సహృదయ అంతరంగం: వఝ్జల శివకుమార్ 'కలల సాగు'

By telugu team  |  First Published Sep 30, 2019, 1:21 PM IST

కవి, దాశరథి అవార్డు గ్రహీత వఝల శివకుమార్ తన   నాలుగో కవితా సంకలనమైన ఈ కలల సాగు పుస్తకంలో మరి ఏ సముద్రాల జ్ఞాపకాల దొంతరలు తీసుకొని వచ్చారో, ఆవేదనా మేఘాలను వర్షించారో దాన్ని నేను అర్థం చేసుకున్న విధంగా ఇప్పుడు ప్రస్తావిస్తాను అంటున్నారు వీణావాణి.


సృజన్ అన్నకలం పేరుతో  కన్నడంలో ఒక చిత్రకారుడు ఉన్నారు. ఆయన చిత్రకారుడిగా అనేక పుస్తకాలకు  ముఖ చిత్రాలు వేయడమే కాదు మంచి  రచయిత, అనువాదకుడు, కవి కూడా . ఒకసారి నేను ఆయన వేసిన రకరకాల పుస్తక ముఖచిత్రాలు చూసే అవకాశం నాకు లభించింది. అందులో ఒక పుస్తకానికి వేసిన ముఖ చిత్రం ప్రత్యేకంగా నన్ను ఆకర్షించింది . ఆ చిత్రంలో పూర్తి రాత్రి సమయంలో చుట్టూ చీకటి  మధ్య ఒక అపార్ట్మెంట్ ఉంటుంది.  అందులో అన్ని గదులు చీకటిగా ఉంటాయి . ఒకే ఒక గదిలో మాత్రం  వెలుతురు ఉంటుంది. ఆ చిత్రకారుడు తను  చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక అందమైన బొమ్మ రూపంలో ఇచ్చాడు. అదేమిటంటే  ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు ఒక కళాకారుడు మాత్రం తాను మెలకువగా ఉండి ప్రపంచాన్ని మేల్కొల్పడం కొరకు తాను మెలకువతో ఉంటాడు అని. మరి ఆ మెలకువలో ఒక రచయిత గానీ ఒక కళాకారుడు గానీ ఆ మెలకువతో ఏం చేస్తాడు ? ప్రపంచాన్ని చుట్టుకున్న ఏ మెలికల సంకెళ్ళను విడిపించడానికో , చిక్కు ముళ్ళు విప్పడానికో ,చుట్టూ జరుగుతున్న సంఘటనలనుఎత్తిచూపడానికో  , మరో స్వాప్నిక జగత్తుతో లంకె వేయడానికో కూర్చుంటాడు ! అలా తన భౌతిక ప్రయాణంలో తను చూసిన ,విన్న, తెలుసుకున్న, అర్థం చేసుకున్న, అనుభవించిన చైతన్యాన్ని ఒక అధిభౌతిక స్థితిలో తన కళగా ప్రకటిస్తాడు. అది ఒక రచన కావచ్చు, ఒక కవిత్వం కావచ్చు , ఒక పాట  కావచ్చు ,ఒక చిత్రమూ కావచ్చు.

భౌతిక జీవితపు చైతన్యానికి అతీతంగా అధిభౌతిక స్థితితో అనుసంధానం చేయడం తపస్సు అయితే అదే క్రమానికి చెందిన అనుభవాలని అదే అధిభౌతిక స్థితిలో ప్రపంచం కోసం ప్రకటించడం రచయితల పని. అదిఒక కళాకారుడు తన కళల ప్రదర్శించే సమయంలో కూడా అంతే  .సందర్భాల్లో ఏదైనా మనం ఒక రచనను చేసినప్పుడో,  ఒక కళాకారుడు ఒక కళాకృతిని  చేసినప్పుడో కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే ఇది నేను రాసిందేనా ఇది నేనేనా చేసింది అనేటువంటి ఒక స్థితికి లోనవుతాము. దానికి కారణం మనం స్వీకరించిన అంశాలు మన అంతరాంతరాలలో ఉండి అధి చేతన ద్వారా ప్రకటించబడడమే. ఎంతో లోతుగా పరిశీలన చేయగల శక్తి వలననే ఇది సాధ్యమవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే  ఈ వేదిక నిర్వాహకులు ఈ ప్రసంగ సమయాన్ని సహృదయ  అంతరంగంగా పెట్టినందుకు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా రచన ఒక అధి చేతన స్థితి , తపస్సుకు సరి సమాన మైంది అందుచేత దానిని ఒక సమీక్ష అనే తులాభారం వేసి వేలాడదీయడం సమంజసం అని నేను అనుకోవడం లేదు. కనుక నేను రచయిత అంతరంగాన్ని అర్థం చేసుకొని ఆ విషయాన్ని నా పరిశీలన ద్వారా అర్థం చేసుకున్నది  మీ అందరితో పంచుకునే అవకాశం కల్పించినందుకు ఈ ప్రత్యేక అభినందనలు.
 
కలలు ఎందుకు వస్తాయి ? కలలు అంటే ఏమిటి ? శాస్త్రియ పరిశోధనల  ప్రకారం నిద్రలో కూడా కొన్ని దశలు ఉంటాయి, ఒక దశలో మనము గమనించిన అంశాలు  చరిత్రగా నమోదుచేయబడి అవి బాహ్యంగా వ్యక్తీకరిచడం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయా  సంఘనలలోనుంచి  ప్రతిస్పందనగా కలలు వస్తుంటాయని   చెప్తుంటారు .కానీ కవి కనే కలలు ఇవి కాదు.   నిత్య జీవితంలో ఒక విశాల పరిధిలో  ఒక మోయలేని భారాన్ని తలుచుకుంటూ, తండ్లాడుతూ  వాటన్నిటికీ విముక్తి దిశగా తానే  ఒక స్వేచ్తా రాగమై ప్రయాణం చేస్తాడు. మరి గత పాతికేళ్ళుగా అలాంటి ప్రయాణం చేస్తున్న మన అందరికీ  సుపరిచితులైన  కవి, దాశరథి అవార్డు గ్రహీత వఝల శివకుమార్ తన   నాలుగో కవితా సంకలనమైన ఈ కలల సాగు పుస్తకంలో మరి ఏ సముద్రాల జ్ఞాపకాల దొంతరలు తీసుకొని వచ్చారో, ఆవేదనా మేఘాలను వర్షించారో దాన్ని నేను అర్థం చేసుకున్న విధంగా ఇప్పుడు ప్రస్తావిస్తాను. 
 
ఈ పుస్తకంలో అరవై మూడు కవితలలో  తొలి కవిత “మూడు జాముల చివర” అనే శీర్షికతో ప్రారంభమై “మళ్ళీ కవిత్వమై పుట్టాలని” ఆకాంక్షిస్తూ, తన అక్షర జీవన రహస్యాన్ని తెలియజేస్తూ ముగించారు. “మూడు జాముల చివర” కవిత ప్రపంచీకరణ పర్యవసానం సామాన్య కుటుంబంలో మిగిల్చిన    రగిల్చిన దు:ఖం . తన ఇంటి దీపాలను ఆర్థిక వెలుగులో చూడడం కోసం తమ హృదయంతరాలలో చీకట్లు ముసురుకున్నా  తమ పట్ల బాధ్యత తమ బిడ్డల భవిష్యత్తుకు అడ్డు రాకూడదని, తాము అనుభవించిన అరకొర వనరులను తమ బిడ్డలు అధిగమించాలని ఆశపడి తమకు తాముగా ఒంటరి ద్వీపాలైనా ఈ మూడు జాములకు చేరిన దుఃఖపు వృద్ధాప్యాన్ని తలుచుకొని నిట్టూరుస్తారు. ఆ వాక్యాన్ని ఒక్కసారి నేను ఉటంకిస్తాను. 

Latest Videos

ఎవరికి వారే ద్వీపాల్లా బతుకీడుస్తున్న 
ఒంటరి యాతనలు 
వలస పోయిన పత్రహరితాలు 
వివేకాలు పోగిట్టుకున్న వికాసాలు 
అభివృద్ధి భ్రమావరణంలో 
ధ్వంసమైన స్వప్నాలు - అని చెప్తూ అభివృద్ధి లోని డొల్ల తనాన్ని  విడమరుస్తారు.

ఈ మధ్య కాలంలో నేను గమనించిన  రెండు మూడు విషయాలు చెబుతాను. గతంలో మేము అనేకసార్లు  పర్యావరణ సంబంధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించే వాళ్ళం. దానికోసం ఎక్కువసార్లు విద్యార్థుల మీద ఆధార పడే వాళ్లం. విద్యార్థులు ప్రోగ్రామ్స్ దగ్గరికి తీసుకు రావడం వారికి కొన్ని  విషయాలు చెప్పడం ఉండేది చిన్నపిల్లలు ఉపన్యాసాలకు ఓర్చుకోలేక ఇబ్బంది పడేవారు. కానీ  ఇప్పుడు ఏదైనా పర్యావరణ కార్యక్రమం పెడితే దాంట్లో ఎక్కువ  శాతం మంది పెద్దవాళ్ళు ఉంటున్నారు. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ వచ్చిన కూడా ఎంతో మంది ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. .ఇలా హాజరయ్యే వాళ్లంతా కూడా చక్కగా ఉద్యోగం చేసిన వాళ్ళు .వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండే పరిస్థితులు చాలా సందర్భాల్లోలేవు. కానీ వాళ్ళను పరిచయం చేసుకుంటే అర్థం అయ్యింది ఏమిటంటే ఒంటరితనం.  ఒంటరితనాన్ని జయించడం కోసం వారు ప్రత్యామ్నాయ జీవితాన్ని ఇలా అనేక రకాల సామాజిక కార్యక్రమాల ద్వారా భర్తీ చేసుకునే పరయత్నం చేయడం . వాళ్లని కదిలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ . ఈ ప్రపంచీకరణ యొక్క ప్రభావాన్ని తట్టుకోవడం కోసం వారు అనేక రకాలుగా సమాజానికి అదే విధంగా తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చునని ఇటువంటి ఒక విశాల దృక్పథంతో ఈ మధ్య అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోపల దిగులు కూడా. తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరూ లేక ఒంటరిగా అనారోగ్యంతోనో  ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా  మరణించినప్పుడో చెదిరిన ధైర్యం వ్యథ .  అటువంటి బాధలో  రేపటి రోజు మనం కూడా ఇంతే కదా మన పిల్లలు కూడా ఉండరు కదా అనే బాధను దిగమింగుకోవడం . 

తను పుట్టి పెరిగిన “ఊరితడి” మూలలను తడిమిన మూల వాగును  , ఊపిరిచ్చిన నాన్న స్వర వరాలను పొంది సాధించిన “స్వర సాఫల్యాన్ని” , తాను నిర్మించుకున్న కలల “ ఇల్లు”ను  తలుచుకుంటూ పురా జ్ఞాపకాలలోకి జారిపోతారు.
 
తెలుగు దేశంలో నందమూరి వారు తెలియని వారు లేరు . 1961లొ వచ్చిన వారి సినిమా రాజమకుటంలో  ఉన్న “సడి చేయకో గాలి” పాట మీలో చాలా మందికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఆ పాట రాస్తే లీల గారు పాడారు . 

సడి సెయకో గాలీ 
సడి సేయబోకే 
బడలి ఒడిలో రాజు పవ్వలించేనే
ఏటి గలగలలకే ఎగసి లేచేనే 
ఆకు కదలికలకే అదరి చూచేనే 
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
 
సరిగ్గా ఇలాగే  “ అలాల తాకిడికి చెదిరిపోతున్న తన ప్రతిబింబాన్ని  అతికించుకుంటూ ఆరాటపడిన” తన భార్యను  “కారుణ్య మేఘాలకు చినుకుల వరన్నిన్చ్చిన కమనీయ సరోవరంగా అభివర్ణిస్తూ”  “ కొలను నిద్ర పోతుంది”  అనే కవిత రాసారు.  భార్యను కొలనుతో పోల్చడం ఇక్కడ ఒక కవి సమయం . కొలనులో ఏముంటాయి. స్త్రీ ణి సంద్రంతో పోల్చిన కవితలు చాలా ఉన్నాయి . కానీ వీరు కొలను తో పోల్చి చెప్పడం ఒక కొత్తదనమే  కాదు  గ్రాహ్య జలంలా తనలోకి సంలీనం చేసుకోదగిన ఆమె ప్రేమను చెప్పకనే చెప్పారు. రెప్పల బయటి ప్రపంచానికి రెప్పల లోపలి ప్రపంచానికీ మధ్య నిద్రించిన ఆ ప్రశాంత నీరధి నిద్ర చెదిరేలా సడి చేయవద్దని అర్థిస్తారు . 

ఈ కవి కూడా వలస జీవితాల మధ్య ఆప్యాయతల కోసం అలమటిస్తున్నవాడే . దూరంగా ఉన్న బిడ్డల్ని తలుచుకొని  పండుగ పండుగకూ తల్లడిల్లుతున్నవాడే. హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో అనే అమెరికన్ కవి   రాసిన ప్రసిద్ది గాంచిన " The Children's Hour "  కవితను ఇక్కడ ప్రస్తావించడం సమంజసమని  భావిస్తాను.  అది రాసిన కాలం అమెరికన్ సివిల్ వార్ జరిగిన కాలం . హెన్రీ తన మగ్గురు బిడ్డలను ఎంతగా ప్రేమించాడో  ఇలా చెప్పుకున్నాడు. ది చిల్డ్రన్ అవర్ కవిత అమెరికాలో చాలా పాపులర్ అయినటువంటి కవిత.  అది అక్కడ స్థానిక పాఠశాల విద్యార్థులకు బోధించేటువంటి కవితల్లో ఒకటి.  ఆయన రాసిన కవిలో  ఇలా అంటాడు 

యే వియోగమూ  చేధించలేనంతగా
నా మనోదుర్గంలో మీ కోసం తపిస్తాను..
నా హృదయమనే  గుండ్రనిమేడని 
మీ బంధిఖానా చేశాను..
అవును , ఎప్పటికీ 
మిమ్మల్ని అక్కడే దాచుకుంటాను...
ఎప్పటివరకయితే
నా హృదయ ప్రాకారాలు 
విరిగి నశించుతాయో, ధూళియయి
గాలిలో కలిసిపోతాయో
ఆ రోజు వరకు...

శివ కుమార్ గారు కూడా తాను ప్రవాసంలో ఉన్న తన కూతురును గుర్తు చేసుకుంటూ “పాలపిట్ట రాని దసరా”  కవిత రాసారు .
రెప్పల ప్రమిదల మీద 
ఎదురు చూపుల వత్తులేసుకుంటూ 
కంపూటర్ ముందు నీ  కోసం 
మేమూ నీ బొమ్మలూ , నీ గదీ, ఇల్లూ - అంటూ పాలపిట్ట రాని దసరాలా ఉన్న ఇంటి వాకిలిలో అంతర్జాలంలోనైనా వినపడే పుట్టమ్మ ముచ్చట్ల కోసం ఆరాటతపడతాడు.

ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీపి  అనారోగ్య సమస్యని చెప్తూ  

తియ్యని కలల్లోకి 
కాకర రసంలా
.....
చుట్టూమోహరించిన 
మధుమేహ మోహ కాంతి
ఇది ముప్పేట దాడిలో ....
భంగ పడ్డ బతుక్కి 
కాలం పేర్చిన చెరకు చితి - అంటూ  సకల జిహ్వచాపల్యానికి చివరి మజిలీ అయిందని  వాపోతాడు . నిజమే కదా   తిన్నా సమస్యే తినక పోయినా సమస్యే .

ఇక సామాజిక అంశాల పట్ల కలిగి ఉన్న శ్రద్ధ ఇదివరకు  వారు వెలువరించిన కవితా సంపుటాలలో ప్రస్ఫుటమయున్నది. మొదటి కవితా సంకలనం “ గోగుపువ్వు”  మీద నేను ఇదివరకే  పరిచయ వ్యాసం రాసి ఉన్నాను. గోగుపువ్వు కేవలం  34 కవితలు ఉన్నప్పటికీ  సమీక్ష రసం చాలా చిన్న పుస్తకం కేవలం 34 కవితలు ఉంటాయి కానీ ప్రతి ఒక్క కవిత  ఒక సామాజిక బాధ్యతను మోస్తుంది .  ఇప్పుయుడు తెలంగాణ ఉద్యమ అనంతర ఈ సమయంలో కూడా అనివార్యమైన ఒక సందర్భం సమాచార మాధ్యమాల మీద విసిరిన వడిసల “ సమాచార విద్రోహం” కవిత

జరుగుతున్నవి జరిగిన జరగనట్టు 
చిత్రిస్తున్న కట్టుకథల చెట్టు 
ముసుగులు తొడిగి ముస్తాబు చేసిన 
వక్రీభవన వార్తల సమాహారం
 చూపు సాధించినప్పుడు 
కాలం జాడ తప్పిన ప్రకటన
 స్పృహ తప్పిన నిజాల మీద 
పచ్చ పచ్చటి అబద్ధాల కవాతు
....
 పాక్షిక దృష్టి కోణాల సాకార సాక్ష్యం  ఆలోచనలకు సంకెళ్ళేస్తున్న  సమాచార  విద్రోహం  మాయదారి మాధ్యమాల వధ్యశిల

మనకందరికీ తెలిసిందే ఇప్పుడు ఏ  న్యూస్ పేపర్ చదివినా  ఏ వార్తా చానల్ చూసినా  కూడా వార్తను వార్తలా నమ్మే పరిస్థితి లేదు. ఈ విషయం చాలా లోతైన చర్చకు తగిన అంశం. అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఇదివరకు వార్తా పత్రికల మీద ఉన్న గౌరవప్రదమియన్ భావం ఇప్పుడు మసక బారిందనే చెప్పుకోవాలి.అందువల్ల కవితో పాటకుడు ఏకీభవీస్తూ ఈ పరిస్థితి రాకుండా ఉంటె బాగు కదా నాయి ఆశ పడతాడు . 

రాజకీయ పరిస్థితులు కూడా అంత ఆశావహంగా ఏమీ లేదు .రాజకీయ పరిస్థితులను మోసపోతున్న సామాన్యుని యొక్క అంతరంగాన్ని “కళ్ళు మనదే వేలూ మనదే కవిత”లో రాశారు. పరాయి వాళ్ళు ద్రోహం చేస్తున్నారని తిట్టిపోయడానికి ఇక్కడ పరాయి వారు ఎవరూ లేరు. నాథ మనమే . మనమే మన కళ్ళని పొడుచుకుంటే  చూపు అలా , బతుకు పాట ఎలా .?కాలం ముందు ముందుకు జరుగుతుంటే స్వీయ వినాశనం రాసుకునే మన భవిష్యత్తుకు మిగిలేది కబోది కాలమే కదా అంటారు.

వంచిన తల మీదే వంచన కొనసాగుతూ మూడోపాదమై తొక్కేస్తుంది
లొంగు బాటు స్వరాలు  లొంగ దీసుకునే స్వరాలెత్తుకుంటాయి

 కొత్త కొత్త వలలు 
సరికొత్త ఎరలు 
ఆరాటాల చుట్టూ అవసరాలు చుట్టూ
....
 అంకురించింది మొదలు 
మోసపడుతూ మొగ్గ తొడిగిన వాళ్ళం 
మోసపోతూ వికసించిన వాళ్ళం 
ఒక మోసం నుంచి 
మరొక మోసంలోకి 
మూసపోసినట్టు ఒదిగిగిపోతున్నవాళ్ళం

ఇప్పుడు కొత్తగా మోసపోతున్నది ఏమిటి కోల్పోయిన చూపు సాక్షిగా 
పొడుచుకుంటున్న కళ్ళూ మనవే
పొడుస్తున్న వేళ్ళూ మనవే 
అగమ్య గోచరమవుతున్న 
కబోది కాలమూ మనదే 

“అబద్దం” కవిత కూడా ఒక వ్యంగ బాణమే 

మాకు మా తలకాయలు దొరకనంత కాలం 
గా అబద్దాలే మీ పెట్టుబడి’
గా అబద్దల్లోనే మా బతుకు సుడి - అని తేల్చేస్తారు .

ఇలాంటి సందర్భం తోనే మరో కవిత రాశారు “ అదే ఆట అదే తీరు”. అయితే ఈ సారి సామన్యుని ద్రోహాన్ని కూడా వ్యంగ్యంగా లెక్క వేస్తారు.

ఇది వివేకాల్ని 
పూడ్చి పెట్టుకున్న కాలం 
ఆత్మ ల్లేవు 
ఆత్మాభిమానాలు లేవు 

ఎవరూ నిద్ర పుచ్చాల్సిన పనిలేదు
నిద్ర నటిస్తున్న కాలానికి 
ప్రతినిధులం మనం  

ఎవరో మభ్య పెట్టాల్సిన పని లేదు 
లొంగుబాటు స్వరాలకు 
వెన్నుముక లమ్ముకుంటున్నతరం  తనది నడి నడి పోకడల మధ్య
కక్కుర్తిగా బతకడమే మన దిన చర్య 

ఇలా కలల సాగు చేసిన కవి ఆ కవితలోనే చెప్పినట్టు  చెరువులు ఓడిపట్టిన నెల దేహం మీద వెన్నెల వర్షం కురవాలని  పూల గుండెలు విప్పరినట్టు దోసిళ్ళు పట్టాలని దయ లేక దాటిపోయిన నదులు  దరులు ఒరుసుకుంటూ పారాలనీ యోగ్యతను నిలబెట్టుకునే కర్తవ్యాలు  ఆకాంక్షల భుజం మీద బాధ్యత అయి కొనసాగాలని ఆశిస్తాడు . ఈ  కలల్నే సాగు చేస్తూ ఆశను బతికించుకుంటాడు.

ఈ కలల సాగు,వారి  మొదటి పుస్తకం “గోగు పువ్వు” వచ్చి ఇరవై మూడేళ్ళకు  వచ్చింది. నాకు ఈ పరిస్థితిని ఒక చిన్న ఉదహరణ ద్వారా చెప్పాలని ఉంది . ఒక కొమ్మ మీద లేత ఆకు ఉన్నదని అనుకోండి.అప్పుడు   చుట్టూ ఉన్న పరిస్థితులకు  అది చాలా చురుకుగానూ , సున్నితంగానూ ప్రతిస్పందిస్తుంది. కానీ అందులో లేత ఆకు ఆకారం తప్ప  , పత్ర దళం ఏదో , ఈనెలు ఏవో    విడదీయలేనంతగా కలగలిసి పోయి ఉంటుంది. కానీ పెరుగుతున్న కొద్దీ  ఆ పత్రానికి ఒక రూపు , దాని భాగాలలో పరిపక్వత వస్తాయి. అలాగే రచయిత కూడా రచనలు మొదలు పెట్టిన కాలంలో ఆకాంక్షలు , ఉద్రేక ఉద్వేగాలు కలగలిసి పోయి ఉంటే ఏది ఏమిటో అర్థం చేసుకుంటూ కాలంతో చేసిన ప్రయాణం వల్ల పరిపక్వత చెందిన పత్రం లాగే రచనలు మరింత స్పష్టమైన అర్థాన్ని పొందుతాయి. వారి ఆ భావాలు స్థిరమైన భావాన్ని నిక్కచ్చిగా ప్రకటిస్తాయి.కనుక శివకుమార్ గారి మొదటి పుస్తకంలో ఉన్న శుద్ధ సామాజిక చైతనయం లేత ఆకులా చురుకుగా ఉరకలేత్తితే కలల సాగు  కవిత్వం పాతికేళ్ళ ప్రయాణంలో నేర్చుకున్న పదనిసలన్నింటినీ పలికిస్తూనే గంభీరంగా నడిచి వచ్చింది. . 
         
ఈ ప్రయాణం అంతా కూడానూ  ఆనాటికీ ఈనాటికీ జన సామాన్యుని వైపు మాట్లాడటం , అనుభందాల పట్ల అంతే సున్నితత్వాన్ని ప్రకటించడం వీరి ఈ కవిత్వంలో మనం చూస్తాం. ఎన్నేన్ని వ్యథల కథల్ని చూసిన కవి ,వాటికి ఒక పరిష్కారం రావాలని ఆకాంక్షించే  కవి , ఆరాట పడ్డ కవి తాను  కోరుకున్నట్టుగానే మళ్ళీ కవిత్వమై వికసించాలని అక్షరాల కొమ్మ మీద పదాల పరిమళమై  పరిడవిల్లాలని  మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

- దేవనపల్లి వీణావాణి

click me!