వనపట్ల సుబ్బయ్య కవిత: ఎక్కబుడ్డి

By telugu team  |  First Published Sep 25, 2019, 9:13 AM IST

ఎవరి మిద్దెలైనా/  అదే వెలుగు/  ఎన్ని దిడ్డి అర్రలున్నా/ ఒకటే దీపం అంటున్నాడు ప్రముఖ తెలుగు కవి వనపట్ల సుబ్బయ్య. ఆయన పలు కవితా సంకలనాలను కూడా వెలువరించారు.


ఎవరి మిద్దెలైనా
అదే వెలుగు
ఎన్ని దిడ్డి అర్రలున్నా
ఒకటే దీపం

తెగిన గాలిపటంలా
సూరుకు వేలాడుతూ
కోడినిద్రలా మిల్క్ మిల్క్ మంటూ
మా గుడిసెలో గుడ్డెలుగులు
నేలకు పున్నమి వెలుగు
మాకు ఎక్కనే కంటి వెలుగు

Latest Videos

అమ్మ 
కూలినుంచి వచ్చేట్యాలకే
సన్నపిల్లగానికి మాడంటినట్లు
పొయిల బూడ్దితో తోమితే
కోడిగుడ్డులా నిగనిగ మెరువాలి
సూర్యుడు మబ్బుల్లోకి జారుకోకముందె
ఇంట్ల ఎక్క ఎలుగాలి 
ఆల్సమైతే ఈపున భక్ష్యాలే !

వెంకటాచారి చేతుల పొదగిన 
తుమ్మది చెక్క స్టాండు 
పోషమ్మ మెడకు కంఠెలా ఇనుపతీగ
సూర్యగోళంలా మధ్య సన్నని బుడ్డి
రామప్ప శిల్పంలా
వోజు పనితనం అదో కళా ఖండం

మా చదువులన్ని దీపంముందే
పొద్దుగాల్ల ముక్కు సీదితే 
ముక్కునిండా బొగ్గులా మసి
ఏ గూట్ల ఎంత కర్దూవ పేరుకుంటే 
అంత సంపన్నుల కింద లెక్క ఆనాడు

ఇప్పడన్ని లైట్ట్లే
బెడ్ రూమ్ లైట్, బాత్ రూమ్ లైట్ 
కంపోండులైట్ పార్కింగ్ ట్యూబ్ లైట్లు 
ఇంటికో లైటు లైటుకో మనిషి 
ఎవరింట్ల వాళ్ళే

నాలుగు వాసాల గుడిసె కింద
ఉసిల్ల పుట్టలా ఇంటోల్లందరం
బువ్వలు ముచ్చట్లు వాకిట్ల ఎక్క బుడ్డి కిందనే
ఎంత గాలొచ్చినా యుద్ధవీరుడిలా పోరాడేది
ఇప్పుడు
ఇట్ల మొగులు కాకముందే
అట్ల కరెంటుపోయి ఇల్లంతా చీకటి 

మా అమ్మ
సంతల ఏ పూసలవ్వతాన తెచ్చిందో
ఎక్కబుడ్డి
మాకెప్పటికి దివిటి

- వనపట్ల సుబ్బయ్య

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

మరిన్ని కవితలు

గజ్జెల రామకృష్ణ తెలుగు కవిత: సహవాసం

కోడం కుమారస్వామి కవిత: మనలోని మను

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం

ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

click me!