Asianet News TeluguAsianet News Telugu

గజ్జెల రామకృష్ణ తెలుగు కవిత: సహవాసం

గజ్జెల రామకృష్ణ సహవాసం పేరు మీద స్నేహంపై ఓ కవిత రాశారు. ఆ కవిత స్నేహం విలువను తెలియజేస్తుంది. ఆయన కలం నుంచి జాలువారిన ఈ కవితను ఇక్కడ చదవండి.

Gajjela Ramakrishna kavitha Sahavasam
Author
Hyderabad, First Published Sep 24, 2019, 2:48 PM IST

తెల్లవారక ముందే 
చీపురందుకుని చీకటిని ఊడ్చేసినట్టు  
వాకిట్లో కల్లాపు చల్లి
ముగ్గు చిత్రం గీసే మంత్రదండం  
మసి గిన్నెలు  
తళతళ లాడు వెండి మెరుపు 

బెత్తం లేని టీచరులా 
చిట్టి చేతుల చూచిరాత 
జెర్రి పోతులా పరుగెత్తే 
చూపుడు వేలు 

స్నానం గదిల వొలికే 
నీళ్ళ గరం 
గబగబా ఈడ్చుకుపోయే ఆత్రం 
అల్లరి పిల్లల నూరడించు ఓపిక తలస్నానం 
బాల సైనికుల కవాతు వెంట 
బడి దాకా సాగిపోయే పుస్తకాల మూట  

చిటికెలో 
అనురాగం వడ్డించు వంటింటి ప్రేమ పరిమళం  
మెతుకు ఎప్పుడు ముడుతుందో 
తెలియని అదృశ్య దృశ్యం 

అష్టావధానం లా 
అంతటి పని ప్రవాహంలో కూడా 
కురుల చిక్కులు దువ్వి 
తాడు పేనినట్టు 
జడ అల్లుకునే ఈర్పెన రాగం 

తేనీరు కాచినంత సులువుగా 
ఇల్లు 
పూలతేరులా కదిలే సారధ్యం 
అక్షరాలు పదాలయినట్టు 
పదాలు పాదాలయినట్టు నడిచే కవిత్వం  

మొక్కలకు నీళ్ళు పోసి 
పువ్వులు నెత్తి కెత్తుకునే 
పూల నవ్వుల సహవాసం . 

- గజ్జెల రామకృష్ణ  

మరిన్ని కవితవలు

కోడం కుమారస్వామి కవిత: మనలోని మను

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం

ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

Follow Us:
Download App:
  • android
  • ios