డాక్టర్ కొండపల్లి నిహారిణి ఎనిమిదో అడుగు పేర వెలువరించిన కవితాసంకలనంపై బండారి రాజకుమార్ సమీక్ష చేశారు. ఆమె కవిత్వలోని లోతుపాతులను శిఖామణి వంటి కవుల కవిత్వంతో పోలుస్తూ విశ్లేషించారు.
కొండపల్లి పేరు ఇనంగనే కొండపల్లి బొమ్మలు యాదికొత్తయి. చిత్రకళాతపస్వి డా॥కొండపల్లి శేషగిరిరావు గారు యాదికొత్తరు. కొండపల్లి వారి కుటుంబం మానుకోట దగ్గర్లోని పెనుగొండ నుండి ఓరుగల్లుకు పొట్టచేతబట్టుకుని వచ్చిన కుటుంబం.దశాబ్ధాల కాలం గిర్రున తిరిగింది.వరంగల్ నుండి అధిక మెజారిటీతో M.P గా గెలిచిన పెండ్యాల రాఘవరావు గారు దేశప్రజలకు సుపరిచితులు.వారి ముద్దుల కూతురు నీహారిణి.పెండ్యాల వారి ఇంటిబిడ్డ కొండపల్లి వారి ఇంట అడుగుపెట్టి "కొండపల్లి నీహారిణి" అయింది.వీరిది చిన పెండ్యాల గ్రామం.మనకు పెండ్యాల వారి వంశం నుండి మరో అగ్గికెరటం విప్లవకవి వరవరరావుగారు అత్యంత సుపరిచితులు.ఇదంతా ఎందుకంటే కొందరు ఇంటిపేరుతో ప్రసిద్ధులయితరు.రెండు కుటుంబాలు సాహిత్య ,కళా రంగాల్లో ఆరితేరినవారిని అందించినయి.కేవలం కుటుంబాలకున్న కీర్తి,ప్రతిష్ఠలతో కవయిత్రి గొప్పవారుకాలేరు. ఎన్నివున్నా, ఎంతవున్నా లోలోపలి ప్రతిభ, స్పందించే హృదయం లేకుంటె కవి కాలేరు. కొండపల్లి నీహారిణి గారు సృజనశీలురు, సౌమ్యులు, అంతకుమించిన సహృదయులు.
కొండపల్లి నీహారిణి గారు గతంలో అర్రతలుపులు, నిర్నిద్రగానం అనే రెండు కవితాసంపుటాలు వెలువరించారు. "ఎనిమిదో అడుగు" పేరుతో తన మూడవ కవితా సంపుటిని ప్రచురించారు.వీటితో పాటు "వ్యాసహారిక" పేరుతో వ్యాససంపుటిని,"అమెరికాలో ఆరునెలలు" పేరుతో యాత్రా చరిత్రను,తెలంగాణ వేగుచుక్కలు ఒద్దిరాజు సోదరులు-పరిశోధనా గ్రంథం,జ్వలిత చేతనం—ఒక యోధుడి గాథ(జీవిత చరిత్ర),కళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు(జీవిత చరిత్ర),బందూక్ నవల -సమగ్ర విశ్లేషణ మరియు నా ప్రజా జీవితం , చిత్రశిల్పకళా రామణీయకం పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.ఇది కవయిత్రి సంక్షిప్త పరిచయం.
నీహారిణి గారు రాసిన "ఎనిమిదో అడుగు" కవితా సంపుటి గురించి మాట్లాడుకుందం.77 కవితలున్న ఈ సంపుటి నుండి ఒకటీ అరా కవితల్ని విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం.పదండి!
గ్యాస్ నూనె సీసా,బూడిద చిప్పలతో సంజె కెంజాయిని ఆహ్వానిస్తున్న కవయిత్రి,వాళ్ల బాపమ్మను విద్వాంసురాలుగా,తబ్లాయిస్ట్ లా,వీణవాద్య కళాకారిణిగా వర్ణిస్తుంది.చిన్నపిల్లలు మారాం జేత్తాంటె తినడానికి ఏదో ఒకటి అమ్మ ఇత్తనే వుంటది.అమ్మ ఇచ్చే 'ఓయమ్మ పనాయ్ "తింటూ బాపమ్మ మోకాళ్లపై వంగి,భుజాలపై వాలి ఆడుకున్న బాల్యమే అందమైనదని జ్ఞాపకాల దొంతరల్ని నెమరేసుకుంటది.అద్భుతమైన బాపమ్మ పనితనాన్ని యాదికి తెప్పించిన "ఎక్కాబుడ్డీ" కవిత ఓ అందమైన అనుభవ శకలం.
"లోకబాంధవుడు కొండలమాటుకెళ్ళకముందే/ కలువరేడి సూచనలు రాకముందే/ తొందరగా శుభ్రపరిచి ఎక్కాబుడ్డీని వెలిగించి/ పెద్దదర్వాజ గూట్లో పెట్టి చీకట్లు పొగొట్టాలనే బాపమ్మ (ఎక్కాబుడ్డీ,పేజీ నం:17)
ఎక్కాబుడ్డీని వెలిగించే సమయాన్ని తెలియజేయడానికి సూర్యున్ని లోకబాంధవుడిగా,చంద్రున్ని కలువరేడుగా వర్ణిస్తూ సూర్యాస్తమయం పురాగ కాకముందే చంద్రుని వెన్నెలలు సోకకముందే ఎక్కాబుడ్డీని వెలిగించే బాపమ్మను స్మరిస్తూ...షోకేసులల్లో షోపీసులుగా పెట్టుకుంటున్న ఎక్కాబుడ్డీ ఇప్పుడొక అందమైన మాన్యుమెంట్ అని వాపోతుంది.
తెలంగాణ పల్లెలో రాత్రిని వెలిగించిన కందిలి,ఎక్కాబుడ్డీ,దీపం బుడ్డీ,పెళ్లిళ్లలో దారి చూపిన పెట్రోమాక్స్ లైట్ ,లాంతరు దీపాలన్నీ కవుల కవితల్లో చక్కగ ఒదిగిన వైనాన్ని సూడొచ్చు.జీవితానికి వెలుతురును పంచి,దారి చూపే నేస్తంగా లాంతరును ప్రతీకగా వాడుకున్న కవులు సుత మనకు కనిపిత్తరు.శిఖామణి గారి "పలకల లాంతరు" కవిత,యువ కవయిత్రి 'రక్షిత సుమ' రాసిన "దారిలో లాంతరు" కవితా సంపుటి యాదికొత్తయి.ఇదే వొరవడిలో రాసిన బిల్లా మహేందర్ "దీపం బుడ్డీ",శిల్పా జగదీష్ గారి "పెట్రోమాక్స్ వెన్నెల" ప్రత్యేకంగా చెప్పవచ్చును.
బుడ్డిల/కొద్దిగంత గాసునూనె పోసి/ఒత్తిని జరంత పైకిలేపి అగ్గిని ముట్టిత్తె చాలు/ముఖం మీది నిలువెత్తు సింధూరంలా/ఎలుగుతూనే ఉండేది
— బిల్లా మహేందర్ (దీపం బుడ్డీ)
నాన్న కన్నుమూసిన కాళరాత్రి/నువ్వు తలకాడ వెలగలేక ఆరలేక/నీ మ్యాంటల్ కంటిని చిదుముకుని/బొట్లుబొట్లుళగా రాలి/మా దు:ఖసాగరంలో /నువ్వొక కన్నీటి కెరటమై కలిసిపోయావు ఓ నేస్తం
—శిల్పా జగదీష్ (పెట్రోమాక్స్ వెన్నెల)
ఆకాశపు చెట్టు చిటారు కొమ్మన/పూసిన చందమామ పువ్వులా/మా రెల్లుగడ్డి ఇంటి చూరున వ్రేలాడుతుంది/పలకల లాంతరు — శిఖామణి(పలకల లాంతరు)
ఒక్కొక్క కవి ఒక్కో రీతిన స్పందించిన తీరును వారి వారి బతుకుల్లోంచి తవ్విపోసుకున్నరు.ఏ కవితా కృత్రిమంగా అనిపించదు.ఒకరు బాపమ్మను మరొకరు బాపును తల్సుకున్నరు.యాదులన్నీ మనిషి మనసు సూరుకు పట్టుకుని యాల్లాడుతున్న గబ్బిలాలై ఖచ్చితంగా మెలిపెడుతయి.
కవయిత్రి 'నగర వాసన పరిమళిస్తున్న నడిబొడ్డు అడ్డా 'అని అడ్డా మీది బతుకుల్ని కలగంటుంది.
"భుజాలు కుంగుతున్నా/ స్వేదజలం పొంగుతున్నా/ రహదార్ల విస్తరణలో/ ఎక్కడో ఓ దగ్గర వ్యాకుల పడ్తూ / పిలవబడే ఏకైక ఆధారం"(పేజీ నం:63)
"అడ్డా పురా సంస్కృతికి రూపంగాకున్నా/ పొట్టకూటికి నెలవు/ చదువుకున్న నిరుద్యోగులకు/ చదువుకోని చిరు ఉద్యోగులకు/ పనిలేని దరిద్రనారాయణులకు/ రికాం లేని రాకపోకల కనులవిందు/ రిక్తహస్తంగాని నడిచొచ్చే నిధి అడ్డా" (పేజీ నం:65)
బడుగుజీవుల బతుకు గుండెదరువు 'అడ్డా'ను ఒక్కొక్కలు ఒక్కో దృష్టితో కవితామయం జేశిన కవులు తారసపడుతరు.అడ్డా మీద రాసిన కవితల్ని పరిశీలిస్తే అన్నవరం దేవేందర్ గారి 'మంకమ్మతోట లేబర్ అడ్డా',అశోక్ ఆవారి 'సిద్ధిపేట లేబర్ అడ్డా' , ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు.
"పల్లె పొలిమేరలు దాటి/అడ్డామీద సరుకుగా మారిన సందర్భం/అంగడిలో గొడ్డూ గోదా అమ్ముడుపోయినట్లు/నిలువెత్తు మనిషి తనను తానే అమ్ముకుంటున్న దృశ్యం
—అన్నవరం దేవేందర్ (మంకమ్మతోట లేబర్ అడ్డా)
"గుంపులున్నీ ఒక్కొక్కటిగా/మాయమవుతుంటే/అడ్డంతా బోసిపోయి/ఆకలి కేకల తుఫాను/ఒక్కసారిగా అంతమవుతుంది"
—బిల్లా మహేందర్ (అడ్డా)
"పనైపోంగనే లేబర్ పక్షులు/రంగు కోరికల సీతాకోకచిలుకలైపోతయ్ /అప్పటికే మేల్కొని వున్న స్పిరిట్ గ్రంథులు /గాంధీ నోటును సూడంగనే/పక్షులన్నీ గూటికి చేరినట్లు కర్తవ్యంగా/కల్లు కాంపౌండో..వైన్ షాపో చేరిపోతయ్ "
—అశోక్ అవారి (సిద్ధిపేట లేబర్ అడ్డా)
ఎవరెన్నితీర్ల జెప్పినా మారని అడ్డా మీది బతుకులు మన పాలకుల నిర్లక్ష్య విధానాల్ని ఎండగడుతనే వున్నయి.ఒకసారి అడ్డా మీద నిలబడి సూడున్రి.దినసరి కూలీల బతుకువెతలు కండ్లపడుతయి.కూలీ పని ఇప్పియ్యడానికి సుత దళారీ వర్గం సిద్ధంగా వున్న తీరు గమనిస్తం. ట్రాలీల్లో పశువుల కంటే హీనంగా కుక్కి తీసుకపోయే దృశ్యాలు కంటతడిపెట్టిత్తయి.సొమ్ము చేతులబడ్డంక పెయి నొప్పులు తగ్గాలంటే ఒక చేతిలో 90 సీసా ,ఇంకో చేతిలో మిరపకాయ బజ్జీ అనివార్యమైన దుస్థితి కంటపడుతది.
అనాదిగా దళితుల మీద జరుగుతున్న దాడులు సూసుకుంట వత్తనే వున్నం. ఇప్పుడు బుద్ధిజీవులైన దళిత మేధావుల్ని సుత మానసికంగా హింసించి ,ఆత్మహత్యకు పురిగొల్పుతున్న విశ్వవిద్యాలయాల తీరుకు మనందరం సిగ్గుపడాల్సిన సందర్భం.చరిత్రను పునర్లిఖించాలనుకుని కలలు కనే యువతరం ఒక్కసారి ఆలోచించాలి.చెట్టంత కొడుకు(రోహిత్ వేముల)ను పోగొట్టుకున్న తల్లి రాధికమ్మ బాధకు, కడుపుకోతకు స్పందనగా రాసిన కవిత "దు:ఖ సముద్రం".
"ఈ అపరిష్కృత అనుభవం/ శ్మశాన వైరాగ్యం గాదని/ చైత్య వైభవమౌతుందని/ ఇరుకుదారుల్లోని వైశాల్యాన్ని/ నైరాశ్యాల్లోని వెలుగు చిక్కుల్ని/ చరిత్రకెక్కించేందుకు నిశ్శబ్ధంగా చేరవేద్ధాం
అమ్మా!/ నిరంతర పోరాటాల్లో/ సత్తువ నిస్సత్తువలు/ విపరీత రాజకీయాలు చేస్తుంటే/ తస్మత్ జాగ్రత్త సూచికలు/ నీ కంటిధారలకు ఏ రీతిగానూ వెలగట్టవు"(పేజీ నం:31)
రోహిత్ వేముల స్మృతిలో పుంఖానుపుంఖాలుగా కవిత్వం వచ్చింది.చరిత్ర ఓ నల్ల చందమామను తన గుర్తుగా ఆకాశాన వేలాడదీసింది.ఇదే కోవలో రోహిత్ స్మృతిలో రాసిన బలమైన కవితల్లో పసునూరి రవీందర్ "నేనింకా నిషిద్ధ మానవుణ్ణే" గురించి చెప్పుకుని తీరాలి.
"ఈ అంటరాని భూమ్మీద/ఇవాల నా పేరు వేముల రోహిత్
.......
మీ తరాల ద్రోహం మీద/చావుడప్పుల మోతనవుతా/ఈ దేశానికి పట్టిన బ్రాహ్మాణీయ వైరస్ ను పాతరేసేందుకు/అదుగో నేనొక చూపుడు వేలునై/మళ్లీ మళ్లీ పుడుతూనే వుంటా!/మీ మస్తిష్కాల మీద/నా ఆత్మగౌరవ గెలుపు జెండాను ఎగరేస్తూనే ఉంటా!"
—పసునూరి రవీందర్ (నేనింకా నిషిద్ధ మానవున్నే)
అమ్మ, అక్క, కూతురు, ఏడడుగుల బంధం పై రాసిన కవితలు; కాళోజీ, జాషువా, శ్రీశ్రీ, అబ్ధుల్ కలాంలపై రాసిన కవితలు;మాతృభాషా పరిరక్షణ గురించి రాసిన కవితలు;బిజీ లైఫ్ లో పిల్లలతో గడపలేని స్థితిని చెప్పే కవిత,టెక్నాలజీ చేతికొచ్చినంక,గ్లోబలైజేషన్ కాలంలో జరుగుతున్న విపరీత పరిణామాలపై స్పందించి రాసిన కవితలు; న్యాయవ్యవస్థలోని డొల్లతనాల్ని ఎత్తిచూపే కవిత,తెలంగాణ గురించీ,ప్రభుత్వ పథకాల్లో భాగంగా హరితహారం,చెరువుల గురించిన కవితలు,గేయరూపంలోని కవితలు అన్నీ సమగ్రంగా పరిశీలిస్తే వస్తు వైవిధ్యానికి కొదువలేదనిపిస్తుంది.పుట్టిపెరిగిన "చిన పెండ్యాల" ఊరు మీద రాసిన కవిత ఆకట్టుకుంటుంది. నూతనాదర్శ కుటుంబ కదంబం కోసం రాసిన 'ఎనిమిదో అడుగు' కవిత ఆలోచింపజేస్తుంది.
తెలంగాణ గురించి రాసిన కవితను ఒకసారి సూద్దం.
"వాగులవంకల, ఇసుకదిబ్బల/ సుందర వనాల చెట్లుచేమల/ పిచ్చుక కువకువల / కనువిందు, వినసొంపు నా భవ్య తెలంగాణ!" (తెలంగాణ,పేజీ నం:15)
కొత్తగా సాధించుకున్న తెలంగాణ భవిష్యత్ లో ఎలా వుండాలో ఒక ఊహ చేసింది కవయిత్రి.చాలా బాగుంది.ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే తెలంగాణ వచ్చాక హరితహారం ముసుగులో ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ జోరుగ సాగుతీన్న తీరు, ఇసుక మాఫీయా వర్ధిల్లుతున్న వైనం దిగ్భ్రాంతికి గురిచేయకమానదు.తదుపరి కవిత్వం ఎలా వుండబోతుందో సూడాలె.'బుద్ధి : కర్మేణ' కవితలో ప్రకృతి విధ్వంసాన్ని ప్రస్తావించినప్పటికీ తెలంగాణ కోణం నుండి విశదీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
కవయిత్రి సద్దుల బతుకమ్మరోజు చెరువులో పడి మునిగిపోతుంటే అక్కయ్య,బుచ్చయ్యలు కాపాడిన జ్ఞాపకాల్ని కైగట్టిన కవిత "కొంగు బంగారం" చెప్పుకోదగింది.
"అమ్మ దాటిపోయింది/ పోలికల్లో ఇమిడి,స్వభావాల్లో కలిసి/ బాపు దాటిపోయిండు/ రాగాల్లో పాటగా స్వరాల్లో భావంగా/ అచ్చొత్తుకున్న గుండె పిట్టగోడల్లో/ మొలిచిన మొక్కలు తంగెళ్లుగ విరబూసె/ ఊహల పందిరిగుంజల అల్లనల్లన అల్లిన, తీగల ప్రేమ గుర్తులు,పోరాటాల గుత్తులు/ ఆలోచనలై వ్రేళ్లాడె,ప్రతి పాదులోనూ వ్రేళ్లూనె" (పేజీ నం:32)
తవ్వుకున్న చెరువుకథల్లో తనొక మునగని రూపమని చెప్పుకుంటది.సాగనంపాలన్న సంబురంతో సిబ్బి కావాలని మారాం జేత్తది.అమ్మ,బాపులు దాటిపోయినా దండైన సంస్కృతి వున్నదంటది.మంచికవిత.
అక్కడక్కడ తెలంగాణ పదాలు కనబడ్డప్పుడల్లా కండ్లల్ల తళుక్కున మెరుత్తయి.పదాల గుండెసాటు కథలన్నీ ఇప్పిజెప్పుతయి. మానవసంబంధాలపట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల అమితమైన పాయిరమున్న కవయిత్రి ఇకపై తెలంగాణ భాష,పలుకుబడులు తొణికాసలాడే మరిన్ని కావ్యాలు రాయగలదని ఆశిస్తూ..నా చిన్ని ప్రయత్నంగా నాల్గు మాటలు నపరింత ఇనిపించిన."ఎనిమిదో అడుగు" ఫలవంతమవ్వాలని కోరుకుందాం.శనార్తులు.
- బండారి రాజకుమార్