ఏనుగు నరసింహారెడ్డి కవిత: రాలక ముందటిపూలు

By telugu team  |  First Published Oct 6, 2019, 10:49 AM IST

పూల రాలక ముందు అంటూ ప్రముఖ కవి ఏనుగు నరసింహా రెడ్డి అంటున్నారు. ఆయన రాసిన కవితను ఇక్కడ చదవండి.


ఇన్నాళ్ళుగా
నడిచీ నడిచీ
ఇప్పుడు దారితప్పుతరు
పిల్లల్లాగే అమ్మలు
అర్థం లేకుండా మాట్లాడుతరు
అదే తొవ్వలో
ప్రయాణం చేస్తూ
చేరాల్సిన గమ్యం
యాదిమరుస్తరు
పిల్లలు
నచ్చిన పదం
వల్లించినట్లే
అమ్మలు పదేపదే
చెప్పిందే చెబుతుంటరు
కనిపించని కాలం
లొంగదీసుకున్నట్లు
నిన్న కనిపించిన దృశ్యం
క్రమంగా మసకబారుతుంటది
పిల్లల్లాగే అమ్మలు
అల్లరి చేస్తుంటరు
ఎన్నో నడిపించిన లోకంలో
ఏదీ నడిపించలేని సంగతి
వాళ్ళకసలే అర్థంకాదు

ప్లిల్లాగే అమ్మలు
ఇల్లంతా తామే
ఐపోతరు
అప్పటి నుండీ
తనచుట్టే తిరిగిన ఇల్లు
ఇప్పుడు మాత్రం
తిరగదా అని
వాళ్ళ గోల
పిల్లల్లాగే అమ్మలు
పిచ్చిపిచ్చి చేస్తుంటరు
ఎక్కడో మొదలుపెట్టి
ఎక్కడనో తేలే
తెల్లారగట్ల బాలసంతు కథలా
పిల్లల్లాగే అమ్మలు
మనకసలే పట్టని ముచ్చట్లు
వల్లెవేస్తుంటరు.
పుట్టక ముందటి
లోకం నుండి తెచ్చిన
సందేశం పిల్లల్ని
అలా తీరుస్తుంది
తర్వాత వెళ్ళాల్సిన
లోకాల మీది మోజు
అమ్మల్నలా మారుస్తుంది

Latest Videos

undefined

పిల్లలు
ఎంతగోల చేసినా
ముద్దే
మారాం ఎక్కువైతే
చంకనేసుకొని
గుండె కద్దుకుంటాం
పిల్లల్లాగే
అమ్మలు కూడా
ఆరాటం చేస్తే
మనం అమ్మలకు
అమ్మలం కావలసిన
పరిణతికి రావలసిందే

-ఏనుగు నరసింహారెడ్డి

click me!