తెలంగాణలో అభ్యుదయ కవిత్వోద్యమం

By Pratap Reddy Kasula  |  First Published Mar 12, 2022, 10:44 AM IST

అభ్యుదయ కవిత్వం లక్షణాలు తెలుగు సాహిత్యం పైన దాని ప్రభావం గురించి సిద్దిపేట నుండి డా. సిద్దెంకి యాదగిరి అందిస్తున్న వ్యాసం మూడవ భాగం ఇక్కడ చదవండి


ప్రపంచ వ్యాప్తంగా, సాహిత్యంలో వస్తున్న మార్పుల్ని, నిజాం నియంత్రణపై తిరుగబడుతున్న ప్రజల భావాలకు అద్దంపట్టే విధంగా తెలంగాణ కవులు కళాలు ఎక్కుపెట్టారు.
ఉర్దూలో ముఖ్దుమ్ మొహియుద్దీన్, దాశరథి- అగ్నిధార, రుద్రవీణ; కాళోజి నా గొడవ. మొదలైన రచనలు కలవు.
"టేల్స్ ఆఫ్ తెలంగాణ" అను గ్రంథాన్ని హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ రచించారు.
“నైజాము సర్కారురా  ఓరన్నా నాజీల మించిందిరా, ప్రజారాజ్యానికి పోరాడు ప్రజలపై రాక్షస క్రీడలు రకరకాలు చేస్తుంది” తిరునగరి రామాంజనేయులు పిలుపునిచ్చారు.
“ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ”
తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించెన్ కృపానం;
ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి
మాగాణములను సృజియించి, ఎముకల్ నుసిసేసి పొలాలు దున్ని, భోషాణములు నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణం రైతుదే, ముసలి నక్కకు రాజరికము దక్కునే అని దాశరధి నిప్పులు కక్కారు.

దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం ఉద్యమానికి ఊపిరిలూదింది. పోరాటానికి సైరన్  అయింది. గడ్డిపోచలు కత్తులు పట్టాయి. ప్రతీకలతో పతాకస్థాయికి తీసుకుపోయిన సాహిత్యం అభ్యుదయ సాహిత్యం. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న సందర్భంలో అభ్యుదయ కవిత్వానికి ఆయువుపట్టు అయింది.  తత్ఫలితంగా చాలామంది కవులు తమ నిరసనను కవిత్వం ద్వారా వెలిబుచ్చారు.   ఆ కవిత చదివిన నిరసనకారులు ఉత్తేజితమై ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు.

Latest Videos

“చుట్టుముట్టు సూర్యపేట నట్టనడుమ నల్లగొండ, .... గొల్ల కొండ కింద  నీ ఘోరి కడతం కొడుకో నైజాము సర్కరోడా అని రొమ్ము విరిసిన కవి రచయిత యాదగిరి.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిక్షిప్తం చేసిన కవితా పంక్తులు చూద్దాం :
ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడురా
ఈ జులుం జబర్దస్త్ నెగుర తన్ని వేయరా
నేడు తెలుగు వీరుడా రణము చేయలెమ్మురా -  సుద్దాల హనుమంతు
వచన కవితా పితామహుడు కుందుర్తి ‘తెలంగాణ’ కావ్యం రాశాడు.  ఇది తెలంగాణలో తొలి వచన కావ్యం.  తొలి తెలుగు విప్లవ కావ్యంగా పేరుగాంచింది.  ఆరుద్ర ‘త్వమేవాహం’ పేరుతో తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు  లిఖించాడు.  సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి కలిసి ‘మా భూమి’ నాటకం ద్వారా తెలంగాణ పరిస్థితిని వివరించారు. దాశరథి అగ్నిధార, రుద్రవీణ;  కాళోజి నా గొడవ, సోమసుందర్ వజ్రాయుధం,  రెంటాల గోపాలకృష్ణ సర్పయాగం, సంఘర్షణ ఎర్రోజు మాధవాచార్యులు, సుద్దాల హనుమంతు  పాటలు ఇవన్నీ అభ్యుదయ సాహిత్యానికి ఊపిరిలూదాయి.

“అది ఒక దయ్యాల మేడ, శిథిల సమాజాల నీడ పీనుగలను పీక్కు తినే, రాబందుల రాచవాడ
ఆద్యంతము అంతులేని అరిష్టాల మహా పీడ” అని ఉర్దూలో ముఖ్దుం మోహియొద్దీన్ తన నిరసనను తెలియజేశారు.
“కైత చేత మేల్కొల్పకున్న కాళోజి కాయము చాలింక” - కాళోజి – ‘నా గొడవ’ పేర్కొన్నారు.
“ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు, ఒక నెత్తుటి బొట్టు లోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు”-ఆవంత్స సోమసుందర్
“కవిత కోసమే పుట్టాను. కాంతికోసమే కలము పట్టాను”, “ఇది నాగలి ఇది దాగలి, ఇదే పునాది,  సైతాన్ కి ఇదే సమాధి” – ఆరుద్ర అన్నారు.
“మంచివాని కంఠం కంచై మోగాలి. మంచివాని కష్టం కనకమై మోగాలి.” అని వరవర రావు నినదించారు. వీరి రచనలు చలినెగళ్ళు, జీవనాడి.

మనిషి తన అనుభూతి లోంచి చైతన్యం వైపు నడుస్తున్నాడు అని భావించిన  సంపత్ కుమార్, వే. నరసింహ రెడ్డి, పేర్వారం జగన్నాథం, కోవెల సుప్రసన్నాచార్య మొదలగువారు 'చేతనావర్తం'1967లో కవితా సంకలనం తెచ్చారు. వీరు చేతనావర్త కవులుగా స్థిరపడ్డారు.

సాహితీ రంగంలో రాజకీయ వ్యూహం రాణించదు అని తేల్చి చెప్పిన మొదటి ఉద్యమం అభ్యుదయ సాహిత్యోద్యమం అని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు.  'మానవతను మట్టిలో పారేసి, మంచితనాన్ని మీరు భూమిలో పారేసి, అభ్యుదయం తెస్తామనడం ఆకాశాన్ని కోస్తాం అనడం, ప్రజా వంచనకు మెత్తని మార్గమని" పేర్వారం జగన్నాథం వ్యక్తీకరించారు.

సామాన్య మానవుని కష్టాలను కన్నీళ్లను వెలిగించవలసిన అభ్యుదయ కవిత్వం తెలుగు సాహిత్యంలో చెరుగని ముద్ర వేసింది కానీ లిఖించ వలసినంత లిఖించ లేకపోయింది.  అభ్యుదయ కవిత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించక తన శక్తినంతా కోల్పోయి వివిధ వాదాలకు నెలవైంది.  అభ్యుదయ కవిత్వ ఉద్యమం తర్వాత వచ్చిన దిగంబర, విప్లవ కవిత్వానికి తగిన బాటలు వేసింది.

click me!