ఈ ఆదివారం ఉదయం లేదాళ్ళ రాజేశ్వరరావు రచించిన ' అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి ' వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభ లక్షేట్టిపేటలో జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
సమాజంలోని మానవ విలువలకు ప్రతీకగా లేదాళ్ళ రాజేశ్వరరావు కవిత్వం ఉందని ప్రసిద్ధ తాత్విక కవి మునిమడుగుల రాజారావు అన్నారు. సాహితీ స్రవంతి లక్షేట్టిపేట ఆధ్వర్యంలో స్థానిక గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం లేదాళ్ళ రాజేశ్వరరావు రచించిన ' అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి ' వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మానవ జీవితం చాలా విస్తారమైన కాన్వాస్ కలదని దాన్ని కవిత్వంతో దృశ్యమానం ఈ కవి చేశారని కొనియాడారు. గతంలో ఆయన రాసిన కందిలి, మౌనమూర్తి తర్వాత వెలువరించిన ఈ పుస్తకం కూడా సాహిత్యంలో మంచి గుర్తింపును కలిగిస్తుందన్నారు. కవిత అంటే కష్టజీవి కష్టాలకు విమోచనం కల్పించడం కోసం తపించేది అన్నారు.
సంస్థ అధ్యక్షురాలు ల్యాదాల గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్. నీళాదేవి పుస్తక సమీక్ష చేశారు. కవిత్వ సంపుటిని పలు కోణాల్లో వివరించి కవిత్వ ప్రయోజనాన్ని విడమర్చి చెప్పారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జన్నారం మండలం విద్యాధికారి నడిమెట్ల విజయ్ కుమార్, గోపగాని రవీందర్, కందుల తిరుపతి, అల్లాడి శ్రీనివాస్, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఐ వి సుబ్బాయమ్మ హాజరయ్యారు.
సమన్వయకర్తలుగా సంస్థ ప్రధాన కార్యదర్శి నూటెంకి రవీంద్ర, ప్రచార కార్యదర్శి రాచకొండ శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు శ్రీమన్నారాయణ, కొండు జనార్ధన్, గుండేటి యోగేశ్వర్, వేనంక చక్రవర్తి, ముత్యం మల్లేశం, వినయ్ కుమార్ కొట్టే, సరిత భూపతి, లేదాళ్ళ జయ, గోపగాని రమణ శ్రీ, నూటెంకి భారతి, దండ నాయకుల వామన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు అందరి చేత పుస్తకావిష్కరణను ఘనంగా నిర్వహించారు.