తామరపల్లి రామకృష్ణ కవిత : చల్లబడని రాత్రి

Published : Jul 11, 2023, 12:47 PM IST
తామరపల్లి రామకృష్ణ కవిత : చల్లబడని రాత్రి

సారాంశం

కల్తీ కాబడిన నిద్రలో అందరూ నటులే అంటూ చీపురుపల్లి నుండి తామరపల్లి రామకృష్ణ రాసిన కవిత ' చల్లబడని రాత్రి ' ఇక్కడ చదవండి : 

గాలి చల్లబడి జోకొట్టే రాత్రి‌ని
కదులుతున్న కాలాన్ని నిలిపి
శాంతి ఇందనం ఇస్తానంటుంది

ప్రకృతి ఎల్లప్పుడు ప్రేమ దుప్పటినే అందిస్తుంది
మనిషి గ్రాహకం గమనించిందెప్పుడు

నక్షత్రశాలల్లో మాటలను కట్టిపెట్టి
మౌనంగా మనసులో కదలికలకు రెక్కలు తొడిగి 
కనుబొమ్మల చాటున కలలా మార్చాలని
యద ఆశ ఎదురుచూస్తుంది

జరగవలసిన పనులు 
గ్రీవెన్స్ కట్టల్లా కలలను కండ్లకు 
రానివ్వకుండా కట్టడి చేస్తాయి

జ్ఞాపకాల ముచ్చట్లకు పరుపు పరవాలంటే
శబ్దాన్ని నిశబ్ధంగా అణచి పెట్టాలి

నిన్న పొందిన ప్రేమను రేపటికి  కొనసాగాలంటే 
తలవగ్గడమో,
అభిమానాన్ని కప్పడమో చేయాలి

ఒకరిపై ఒకరికి అనుబంధం 
ఎలా మొదలైందో తెలియదుకాని 
ఎన్ని రాత్రులు గడిచినా
ఆప్యాయత అందివ్వలేని
అసూయా ద్వేషాల దిండు ఎత్తు పైన శిరసువాలుస్తారు 
కాని ప్రేమ తలగడపై మనసు నిలపరు, శాంతినొందరు

కల్తీ కాబడిన నిద్రలో అందరూ నటులే
రాత్రి విచిత్రాలు తెలియని పసితనపు పవలింపులకు 
చీకటి మరుగై
చల్లని గాలికి 
వేకువ కిలకిల నవ్వుతుంది..
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం