దీపం కొండెక్కినప్పుడు దిగులు మేఘాలన్నీ ఒక్కసారిగా దుఃఖ సముద్రాలైతవి! అంటూ కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత ' కాలమే అంత ' ఇక్కడ చదవండి :
లోన ఆకులు రాలుతుంటే
అనుభవాలు పచ్చనవుతాయి
మిడిసిపడిన భవనం
కాలం గడుస్తుంటే
పెచ్చలూడదీసుకుంటది!
పైపై అందాలు మసకబారుతుంటే
లోలోన అంతర్ దృష్టి విరాజిల్లుతది
గాలిలో ఎగిరే పతంగిని
ఎవరు ఎంత కాలం ఎగురవేస్తారు
తాడు తెగిందా
ఆట ముగిసిపోతది!
ఇంత కాలం కలిసి ఆడిన వారు
కలిసి భోజనం చేసిన వారు
అంతా కనుమరుగై పోతారు
దీపం కొండెక్కినప్పుడు
దిగులు మేఘాలన్నీ
ఒక్కసారిగా దుఃఖ సముద్రాలైతవి!
పోయే మర్మం ఎవరూ చెప్పరు
అద్దం జారి ముక్కలైనప్పుడు
జ్ఞాపకాలన్నీ చెల్లాచెదరైపోతవి
ఈ గాయం మానదమో అనుకుంటాం
పది రోజులకు మానుబడతది
ఆ ఇల్లంతా తెప్పరిల్లడానికి
కాలం కొంత కాలానికి మంత్రమేదోవేస్తది
పెత్తరమాస నాటికి
ఇష్టమైన భోజనం సిద్ధం చేస్తది!!