యాదాద్రి భువనగిరి జిల్లా గోసుకొండ పోచంపల్లి నుండి డా. పాండాల మహేశ్వర్ గద్దర్ యాదిలో రాసిన గేయ కవిత ' తెలుగు గుండెల సవ్వళ్ళ వెలుగు నీవు ' ఇక్కడ చదవండి
పీడిత ప్రజలకు అండగా తానిల్చి
ఎర్రసైన్యపునేత ఎవరితండు?
తన దేహ గాయాల్ని జనశృతి గేయంగ
పొలికేకలేసినా పోరడెవడు ?
ప్రత్యేక తెలగాణ ఆకాంక్ష నెద దల్చి
ఉద్వేగ సింహమై ఉరికెనెవడు ?
విప్లవాస్ఫూర్తికి హృదయగొంతుక మీటి
సూర్యచంద్రులజ్యోత్స్న సూక్తమెవరు?
ప్రకృతి మాతకు ప్రణమిల్లి దండాలు
అడవమ్మ పాటకు ఆద్యుడెవరు?
పొడిచేటి పొద్దులో నడిచేటీ కాలాన్కి
అనుబంధ రాగాలకాజ్యమెవరు?
కాళ్లగజ్జెలు కట్టి కడగండ్ల వ్యధలను
కళ్ళకు చూపినా కథకుడెవరు?
జనగుండె లోతుల్లొ జననాట్య మండలై
అరుణరంగులమార్పు కాద్యుడెవరు?
దాష్టీకాలను తెంచ దౌర్జన్యమెదిరించి
నిత్య చైతన్యాల కృత్యుడెవరు?
కులము కుంపటిలోని కుళ్ళుని ప్రశ్నించి
తెగమర్లబడినట్టి తేజమెవరు?
మాటల్ని పాటగా తూటాల ఈటెగా
గళమెత్తి గర్జించె ఘనుడెవండు?
సరికొత్త పోరుకు వరవడి తత్వమై
గద్దరన్నకు సాటి బుద్దుడెవరు ?
ఆట పాటల కన్నీళ్ళ ఊటలకును
ఉద్యమా రవి! నీ దారి యుద్దనౌక !
తెలుగు గుండెల సవ్వళ్ళ వెలుగువీవు
అమర వీరుడా! విఠలుడా! అంజలిదియె!