బన్న గురు శతకాన్ని ప్రముఖ విమర్శకురాలు ఆచార్య కాత్యాయని విద్మహే ఆవిష్కరించారు.
హైదరాబాద్: డాక్టర్ మంథని శంకర్ రచించిన ' బన్న గురు శతకం ' ఆవిష్కరణ సభ శుక్రవారం రాత్రి హన్మకొండలోని వాగ్దేవీ డిగ్రీ , పీజీ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. తెలంగాణ రచయితల సంఘం వరంగల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హన్మకొండలోని వాగ్దేవీ డిగ్రీ , పీజీ కళాశాల ఆడిటోరియంలో బన్న గురు శతకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రచయితల సంఘం సంస్థ అధ్యక్షులు ప్రముఖ కవి లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.బన్న గురు శతకాన్ని ప్రముఖ విమర్శకురాలు ఆచార్య కాత్యాయని విద్మహే ఆవిష్కరించారు. మానవ జీవిత మూలాలను బోధిస్తూ మానవుడు ఎలా జీవించాలి అనే తాత్విక అంశాలు ఈ గ్రంథంలో రచయిత అద్భుతంగా వివరించచారని ప్రముఖ విమర్శకురాలు ఆచార్య కాత్యాయని విద్మహే చెప్పారు.
అంతేగాక శతక లక్షణాలైన మకుట నియమం, సంఖ్యా నియమం పాటిస్తూ లోకంలో నీతి, న్యాయం, ధర్మం , మంచి, చెడు మొదలగు విషయాలను ఈ శతకంలో విపులంగా చర్చించి ఒక నూతన, ఆరోగ్యకరమైన సమాజం కోసం తపిస్తున్న శంకర్ ఈ గ్రంథాన్ని తన గురు దంపతులు శ్రీమతి బన్న విజయ అయిలయ్యలకు అంకితం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఈ గ్రంథాన్ని రచయిత తన గురు దంపతులకు ఘనంగా అంకితమిచ్చాడు.
డా.మడత భాస్కర్ పుస్తకాన్ని సమీక్షిస్తూ శంకర్ ఆట వెలది లో రాసిన శతకం గురువు యొక్క విశిష్టతను అద్భుతంగా తెలియజేస్తున్నదని, గురుకృప ఉంటే శిష్యుడు ఉన్నత శిఖరాలను అధిరోయిస్తాడని, శతకంలో చలోక్తులు, హాస్యం, విమర్శ, భక్తి, ప్రేమ, వైరాగ్యం తదితర అంశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రంథ స్వీకర్త బన్న అయిలయ్య మాట్లాడుతూ శంకర్ మంచి పరిశోధకుడు, అధ్యాపకుడిగా ముందుకు కొనసాగుతూ, ప్రతి విషయాన్ని మానవీయ కోణంతో ఆలోచిస్తాడని , విద్యారంగం వైపుగానే కాకుండా సాహిత్య రంగంవైపు కూడా మంచి మైలురాయిని అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
కార్యక్రమంలో తొలుత కవి పరిచయ వాక్యం చేసిన తెరసం కార్యదర్శి బిల్ల మహేందర్ మాట్లాడుతూ శంకర్ కవిత్వం, విమర్శ, నవలతో పాటు కొత్తగా శతక పక్రియలో కావ్యాన్ని రచించడం విశేషమని, వారి రచనలు ఎక్కువగా దళిత బహుజన అస్తిత్వ ప్రకటన చేస్తాయని అన్నారు. సమావేశంలో ప్రముఖ సాహితీవేత్తలు గిరిజా మనోహర్ బాబు, విఆర్ విద్యార్ధి మాట్లాడారు. అనంతరం కావ్య రచయిత మాట్లాడుతూ ఆచార్య బన్న అయిలయ్య నన్ను ఆవేశం నుండి ఆలోచన వైపుగా మార్చి వెన్నుతట్టి ప్రోత్సహించడం మరువలేనని, అటువంటి గురు దంపతులకు పుస్తకాన్ని అంకితమివ్వడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.
కార్యక్రమంలో కవులు వల్లంపట్ల నాగేశ్వరావు, పల్లేరు వీరస్వామి, వాసిరెడ్డి కృష్ఞారావు, నాగిళ్ళ రామశాస్త్రి, చక్రవర్తుల శ్రీధర్ , పి.చందు, కేశిరెడ్డి మాధవి, బన్న విజయ, వెల్దండి లీల, బిటవరపు శ్రీధర్ స్వామి, తాడిచర్ల రవి, చిర్ర రాజు, బండి రజని కుమార్, గజ్వెళ్ళి నరసింహం, వలబోజు రాంబ్రహ్మచారి, కోడం కుమారస్వామి, పెద్ది వెంకటయ్య, మేకిరి దామోదర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు