దూకాకే తెలుస్తుంది ఆ ఊసరవెల్లికి ఆ గోడే అందర్నీ దూరం చేసిందని! అంటూ కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత ' ఊసర వెల్లుల ఆత్మ జ్ఞానం! ' ఇక్కడ చదవండి :
'పొంగు'ను చూసుకున్న
ఓ నది తొందరపడి
సముద్రంలో దూకింది
ఉనికిని కోల్పోయింది!
రాజకీయమూ
మతం వంటిదే
మారినంతనే
గతం వెంటాడుతది!
అది సముద్రం
దాని అలల మురిపెం రెప్పపాటే
తిమింగలాలు తిరిగే చోట
ఆర్తనాదాలెవరికీ వినిపించవు!
ఎలుకలు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న
చిన్న ఉల్లిగడ్డకు ఆశ పడితే
బోనులో ఇరుక్కోవలసిందే!
గోడ దూకేంత వరకు
అందరు కొట్టేవి చప్పట్లే
దూకాకే తెలుస్తుంది ఆ ఊసరవెల్లికి
ఆ గోడే అందర్నీ దూరం చేసిందని!