హన్మకొండకు చెందిన కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ కు జూలై 18న న్యూ ఢీల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరగబోయే 'ఆల్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ రైటర్స్ మీట్' లో పాల్గొనే అవకాశం లభించింది.
దివ్యాంగుల సాధికారతకోసం కృషి చేస్తున్నందుకు ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా బిల్ల మహేందర్ రాసిన కవిత 'నేను మరణిస్తూనే ఉన్నాను ' ఇక్కడ చదవండి :
నేను మరణిస్తూనే ఉన్నాను
ఎవరైనా
ఈ దుఃఖాన్ని చెరిపేస్తే బాగుండు
గుండె చెరువైదాకా ఏడ్వాలంటే
దేహంలో సత్తువ లేదు, కళ్ళలో తడి జాడ లేదు
బతుకంతా
అసమానత శిలువను మోస్తున్నాను
అడుగడుగునా
అవమానపు చూపులను ధరిస్తున్నాను
పేరులో
మనిషిని మాయం చేసి
మతాన్ని వెతుకుతున్నారు
కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు
ఊరెప్పుడూ నాది కాలేదు
బతుకు చుట్టూత కంచె నాటి
పొలిమేర పాతేసింది
నగరమెన్నడూ
నా భుజాన్ని తట్టి పలకరించలేదు
మురికి కాలువలు, ఫుట్ పాత్ లు
నా చిరునామాగా మార్చింది
పిడికెడు
ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని
ఏ తీరం వెంబడి పయనించినా
గాయాలు అలలు అలలుగా తాకుతూనే ఉన్నాయి
నా దేశం
ఏ కులం గానో, మతం గానో
విడిపోయిన ప్రతీసారి
నేను మరణిస్తూనే ఉన్నాను!