పూలు పూయించ లేదని తోటమాలికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరు నెలల జైలు శిక్ష విధించినందుకు నిరసనగా కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత "పూల ధిక్కార పాఠం!" ఇక్కడ చదవండి.
చిరు గాలికే
పరవశించే పూలమొక్క
ఏ నియంత ఆదేశాలకు
తలవొంచి పూలు పూయదు!
సహజంగానే
ఎవరి మెహర్బానీ కోసమో
నలుమూలల
పరిమళాలు వెదజల్లదు!
తిరుగులేని తన ఆదేశాలను
పూలమొక్క ధిక్కరిస్తే తోటమాలిని
కటకటాల వెనక్కి నెట్టడం
మూర్ఖ్ రాజా బరితెగింపే!
కొరియా! కొరియా! ఉత్తర కొరియా!
ఇనుప పాదాల కింద నలుగుతున్న స్వరమా
నేల రాలే పూలు
నీకో ధిక్కార పాఠం చెబుతున్నాయి!
బతికేది ఎంత కాలమైనా
అందంగా విప్పారి వికసించు
నాలా సుగంధమై పరిమళించు
పోతూ పోతూ సుకుమారత్వం నేర్పు!
ఎన్ని సార్లు
నియంత పాదాల కింద నలిగినా
ఉనికిని కోల్పోక పోవడమే
జీవన సౌందర్యం!!