కొండపల్లి నిహారిని రాసిన కవిత ' అలే పడవైనప్పుడు ' లో అంతరంగ తరంగాలను వినండి.
అలే పడవైనప్పుడు
ఇప్పుడే ..ఇక్కడే…ఇంతే…
ఆగని పరుగు, కదలని కాలం
ఆలోచనల దట్టమైన అడవి అది
అనువుగాని అరకొరలనుండి , అలవడని తడబాటునుండి
వర్తమానాన్ని చిరునవ్వుతో ఆహ్వానించే
ఓ శుభోదయాన
కరిగిపోయిన కాలం విలువ గుండెకు గాలంవేస్తున్నప్పుడు
ఏ హృదయమైతే ప్రేమపుష్పాలు పూయిస్తుందో
ఏ హృదయమైతే సేవఫలాలు పంచిస్తుందో
ఏ హృదయమైతే ఆలనపాలనల ఓలలాడుతుందో
ఆ హృదయం
అదే హృదయం
వర్తమానాన్ని నవవిధ , నవ్యవిధ
చిరునవ్వై ఆహ్వానిస్తుంది
నేలను , గాలిని శ్వాసించినవారు
పచ్చికబయళ్ళను
పిచ్చుక గూళ్ళను
రెక్కలిచ్చే ఆకాశాన్ని
బ్రతుకునిచ్చే మట్టినీ
కంటినిండా నింపుకున్న
నమ్మకమనే తెప్ప తెప్పరిల్లినప్పుడు
వెన్నెలరేడు ముంగిట్లో వాలుతాడు
అక్షరాల్ని వెంటేసుకున్న సురక్షిత పథకంలా
సూర్యుడు నిత్యవిద్యార్థై నీ ముందు నిలుస్తాడు
వచ్చిపోయే అలల పోలిక
కలల పోలిక
పొలికేక వేసినంత
విదిలింతలుగాని
కష్టమొచ్చి కాలికడ్డం పడ్డప్పుడు
కదనరంగ వీరత్వమే
అరచేతి పిడి
అడ్డుపడే డాలు
గాయాలకు మలాములుపూసే కాల ధ్యాస అల్లుకుంటుంది
కాబోయేదంతా
రాబోయేదంతా
తెలియని సుబోధనే చేస్తున్నది
మిత్రమా,
వర్తమానమొక్కటే దోసిటబట్టిన చెలిమెనీరు
వర్తమానమొక్కటే పొద్దుమాపుల నడుమన నర్తించే మనసు
అలే పడవైనప్పుడు
తేలుతూ లయాన్వితంగా ఊగుతూ ఉండేది నీ అంతరంగమే!