ఖలీల్ జిబ్రాన్ కవితలకు ఉన్న మహత్తు మనందరికీ తెలిసిందే, ఆయన కవితను గీతాంజలి భయం పేర అనువదించారు. దాన్ని ఆస్వాదించండి.
ముద్రంలోకి ప్రవేశించే ముందు నది
భయంతో వణికిపోతూ..
కొంచెం సేపు అలా.,
ఓడ్డునే నిలబడి పోతుందట !
తాను సముద్రం దాకా చేరడానికి.,
ప్రయాణించిన దారిని
ఒక సారి.,వెనక్కి తిరిగి చూస్కుంటుంది బేలగా..
పర్వతాల మీదనుంచి దుంకుతూ.,
అరణ్యాలనూ, గ్రామాలనూ ఝర, ఝర దాటుకుంటూ.,
ఒంపులు, ఒంపులుగా.,
మెలికలు తిరిగిన రహదారుల వెంబడి ,
పొరలి, పొరలి పోతూ..
తరలి,తరలి పోతూ.,
నది ...,
తాను ప్రయాణం చేసిన మజిలీలను కడసారిగా., విడవలేనితనంతో...
ఆర్ద్గ్రంగా చూసుకుంటుంది.
మళ్లీ.,
తల తిప్పి నది.,
తనముందు విశాల గంభీరంగా ఉరుముతున్న సముద్రాన్ని చూస్తూ.,
ఇక.,
శాశ్వతంగా
సముద్రంలోకి అదృశ్యం అవ్వాల్సిందేనా అని విభ్రమంగా అనుకుంటుంది.
గాఢంగా నిట్టూరిస్తుంది.
కానీ.,
వేరే దారి లేదు మరి !
ఇక నది వెనక్కి వెళ్ళలేదు
నదేనా.., ఎవరూ కూడా
తమ ఉనికిని విడచి
వెనక్కి వెళ్ళలేరు.
అది అసాధ్యం కూడా..!
మరి ఇక.,
నది సముద్రంలోపలికి
వెళ్లే సాహసం చేయాల్సిందే తప్పదు !
అప్పుడే భయం అదృశ్యం అవుతుంది.
ఆ క్షణాల్లో.,
నదికి కూడా..
తాను సముద్రంలోకి అదృశ్యం అవడం కాదు..,
తానే సముద్రంగా మారి పోతున్నదని.,
అర్థం అవుతుంది !
అనువాదం: గీతాంజలి