ఎస్బీ బాలుకు నివాళి: పాట ఆగిపోయిన వేళ'

By telugu teamFirst Published Sep 26, 2020, 12:41 PM IST
Highlights

గానగంధర్వుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం కానిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎస్బీ బాలుకు తన కవిత ద్వారా ప్రముఖ రచయిత్రి డాక్టర్ జ్యోత్స్న నివాళి అర్పిస్తున్నారు.

అతడొక హిమవన్నగ శిఖరం 
శ్రీపతి పండితులకు మాత్రమే కాదు
ఆబాల గోపాలానికి ఆరాధ్యుడతడు
బాలుణ్ని హృదయంలో నిలుపుకొన్న 
బ్రహ్మజ్ఞుడతడు    
సరిగమలకు రూపం కడితే 
వెలిగేది అతడే 
గమకాలకు పేరు పెడితే 
మ్రోగేది ఆ గళమే
ఆ స్వరమే 
తెలుగు పాటకు ఒక చిహ్నం
చలన చిత్రాలకే  కాదు
సకల సంగీత ప్రపంచానికే 
సార్వభౌముడతడు 
సర్వ సామ్రాట్టు అతడు
అతని పాటలు విని
తెలుగును ప్రేమించాను
అతని పాటలు విని
సాహిత్యాన్ని ప్రేమించాను
అదే బ్రతుకుబాటగా మలచుకున్నాను 
ఆ గాన గంధర్వుడు
ఏ గగనాలకు చేరుకున్నాడో 
ఆ స్వర పురందరుడు 
ఆ స్వర్గ సీమలు చేరుకున్నాడో
నవరసాలను స్వరంలో 
అభినయించే 
ప్రజ్ఞా దురంధరుడు
ఆ నింగి ఉన్నంత వరకు 
ఈ నేల ఉన్నంత వరకు 
ఆ పాట మ్రోగుతూనే ఉంటుంది 
ఆ స్వర రాగలహరి కొనసాగుతుంటుంది
శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి 
కన్నీటి వీడ్కోలు 
పద్మభూషణునికి ఇదే  పదనీరాజనం.

-డా. కె. జ్యోత్స్న ప్రభ

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!