డా॥ వెల్దండి శ్రీధర్ ఇటీవల రచించిన ‘పుంజీతం’ కథల సంపుటిలోని ఒక్కొక్క కథ గురించి తెలుసుసుకునే ముందు వెల్దండి శ్రీధర్ రచనా శైలి గురించి రెండు మాటలు చెప్పుకుందామంటున్నారు ఏశాల శ్రీనివాస్
Where is mind, Never mind – B. M. Hegde. ప్రముఖ కార్డియాలజిస్టు తరచుగా ఉపన్యాసాలో అంటుంటాడు. సైన్స్ ప్రకారం మెదడు శరీరానికి ఆదేశాలు మాత్రమే పంపుతుంది. దీనినే సైన్స్ లో ‘నర్వ్ కరెంటు’ అంటారు. ఫిలాసపీలో కూడా ‘ఆలోచన మనిషి మెదడులోంచి రాదనీ, అది మనిషి వ్యక్తిత్వంలోంచి వస్తుందని చెపుతుంది.’ దీనినే బాలగోపాల్ డి.డి.కోశాంబి పుస్తకానికి రాసిన ముందుమాటలో ‘స్వంత ఇల్లు, స్వంత స్కూటరు వున్నట్లు స్వంత అభిప్రాయాలు ఉంటాయా అంటే అనుమానమే’ అని రాసారు. మనిషి ఆలోచనకు (Philosophy of Thought )కు ఇప్పటికీ సరియైన నిర్వచనం లేదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం, మనిషికి శరీరం ఉన్నట్లే, మనసుకి శరీర నిర్మాణం ఉందనీ, దీనిని శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చని చెప్పారు. ఈయన నిర్వచనం ప్రకారం, ఆంతరంగిక జీవికి`బాహ్య పరిస్థితులకు ఏర్పడే ఘర్షణ మూలంగా మనిషి వ్యక్తిత్వం రూపొందుతుంది. ఈ ప్రకారంగా చూస్తే ఏ రాజకీయ సిద్దాంతమైనా మనిషి ఆలోచనను ప్రభావితం చేయగలవే కానీ, వ్యక్తులను రోబోలుగా తీర్చిదిద్ది ఆ ఆలోచనకే కట్టివేయలేవు. దీని కారణంగా మనిషి తన రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చే పని కూడా చేస్తాడు. ఈ విషయం సామాన్యులకన్నా రచయితలకే ఎక్కువ అవసరం, ఎందుకంటే మనిషి ఆలోచనలోని ఈ సంక్లిష్టతే కథకు మూలం.
డా॥ వెల్దండి శ్రీధర్ ఇటీవల రచించిన ‘పుంజీతం’ కథల సంపుటిలోని ఒక్కొక్క కథ గురించి తెలుసుసుకునే ముందు వెల్దండి శ్రీధర్ రచనా శైలి గురించి రెండు మాటలు చెప్పుకుందాం. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని గురించి రాస్తూ బాలగోపాల్ ‘మార్క్సిజాన్ని బూర్జువా పత్రికల భాషలో రాయటంలో చేయి తిరిగిన వ్యక్తి’ అని ప్రశంసించారు. శ్రీధర్ కూడా అంతే. కులాన్ని, పేదరికాన్ని, మనుషుల మధ్య సంబంధాన్ని, పడికట్టు పదాలు లేకుండా పాఠకుడికే కొన్ని విషయాలను వదిలేసి, ఆలోచింపజేస్తాడు.
అమృతవర్షిణి: ఈ కథ ఒక వ్యక్తికి ఇద్దరు మహిళల పరిచయం వల్ల కల్గిన అనుమానాన్ని స్వామీజి దగ్గరకి వెళ్ళి నివృత్తి చేసుకుంటాడు. సమాధానంగా కథ చివర్లో స్త్రీ, పురుషులు ఇద్దరు ఒకరికి ఒకరు ‘అవసరం’ అని చాలా మర్యాదస్తుల పదంతో ముగిస్తాడు. కానీ ఇదే సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఆధారంగా ‘గాడ్ సెక్సు అండ్ ట్రూత్’ (GST) అనే డాక్యుమెంటరీని రాంగోపాల్ వర్మ తీసాడు. ఇందులో మొదటి వాక్యమే ‘సెక్సు అనేది కేవలం పిల్లలని కనడానికి మాత్రమే కాదు’ అని అంటుంది, మియా మాల్కోవా.
పొక్కిలి: దేవయ్య చిన్న వ్యవసాయదారుడు చిన్న వ్యవసాయదారులందరిలాగానే ఈయన కూడా అప్పుల్లో ఉంటాడు. ఊరిలోని పటేలు భూమి అమ్మమని వచ్చి అడిగితే అయిష్టంగానే భూమి అమ్మి, సంవత్సరం ఖాళీగా ఉండి కూలి పనికి పోయి ఆరోగ్యం సహకరించకపోయినా నాగలి దున్ని ఇంటికొచ్చాక దమ్ము, దగ్గుతో ప్రాణం మీదికి తెచ్చుకుంటాడు. ఇందులో రచయిత చెప్పకుండా మన ఆలోచనలకి వదిలేసింది` ప్రభుత్వంలోని అధికారులు అగ్రవర్ణాలకు దగ్గరగా వుండి, భవిష్యత్తులో రాబోయే అభివృద్ధి గురించి తెలుసుకొని ముందే అగ్గువకు భూములు కొని, తక్కువ సమయంలోనే ఎక్కువ ధరకు అమ్ముకొని బాగుపడతారు. ఇది ప్రస్తుతానికి ‘నేరం’ కాదు. ప్రజాస్వామ్య భాషలో తెలివి, ముందు చూపు అంటుంటారు. రచయిత దృష్టిలో ఇది నేరమే!
ఆరుద్రపురుగు: ఈ కథలో ఒక టీచరు ఎన్యుమరేటర్‌గా వెళ్ళి చంద్రవ్వ అనే ముసలామె గుడిసెకి వెళ్ళి, ఆమె పేదరికాన్ని కళ్ళార చూసి, ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేపర్లలో, ప్రచారంలో వస్తుంది, నిజానికి ఇలాంటి పేదరికంలోని ఈమె రేషన్ కార్డు ప్రభుత్వం తొలగిస్తే ఏమీ చేయలేక నిస్సహాయంగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం కూడా లేక వారం రోజు పస్తులుండి చనిపోతుంది. ఈ కథలో పేదరికాన్ని గురించిన వర్ణన చాలా బాగుంది. మన దేశంలో పేదలంటే ఎవరు అని చెప్పడానికి ఎన్ని కమిటీలున్నాయో, అన్ని రకాల లెక్కలున్నాయి. 2009- 10లో ప్లానింగ్ కమీషన్ గ్రామీణ ప్రాంతాల వారికి 28 రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 34 రూపాయల ఆదాయం వుంటే వారు పేదవారు కాదని తీర్మానించింది. ఇదే ప్లానింగ్ కమీషన్ కార్యాలయంలో మరుగుదొడ్ల ఆధునీకరణకు పది లక్షలు ఖర్చు చేయటం ఆ రోజుల్లో వివాదాస్పదమైంది. ప్లానింగ్ కమీషన్ చైర్మన్‌కు 1020 రూపాయల డి.డి.ని రాజస్థాన్‌లోని ఒక మహిళ పంపి నెల రోజులు ఈ డబ్బుతోనే బతికి చూపించమని అడిగింది. ఇక్కడే అంబేడ్కర్ జ్ఞాపకం వస్తాడు. నిజానికి అందరికీ ఒకే విలువ కల్గిన ఓటు హక్కు ఇవ్వకపోయినా, క్రింది కులాల ఓటుకు విలువ లేకపోయినా మనకు ఈ సంక్షేమం కూడా ఉండేది కాదు. స్వాతంత్య్రానంతర సంక్షేమం కేవలం అయిదేండ్లకు ఒక సారి ఓటు వేయడానికి బతికి ఉండటానికే!
మరణ మృదంగం: ఇందులోని మూడు కుటుంబాలు చేనేత వృతి మీద ఆధారపడే కుటుంబాలు. శాంతనగర్‌లో మల్లేశం, రాజీవ్ నగర్‌లో శ్రీనివాస్, గాంధీ సెంటర్‌లో చంద్రయ్య, ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ప్రతి కథలోలాగే చావుకు కారణం మనకు వదిలి చనిపోయిన వ్యక్తి వలపోతను మనకు వినిపించిండు. మనం మళ్ళీ మూలాల్లోకి పోయి దేవులాడాలనేది రచయిత అభిలాష కావచ్చు. ఈ దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువగా ప్రజలు చేస్తున్న వృత్తులో చేనేత మొదటిది. పారిశ్రామికీకరణ చేనేతను మింగి మరమగ్గాలలోని యాంత్రికత చేనేత కళాకారుడి అద్భుతమైన కళను చంపింది. ఇంజినీరింగ్ కంటే గొప్ప టెక్నాలెజీని కనుగొన్న చేనేతను యాంత్రికత మింగింది. ఇంత వరకే చూస్తే మార్క్సిజం భావజాలం మాత్రమే కనపడుతుంది. దీని మూలం మన హిందూ మతాలలో దాగి ఉంది. శ్రమ అనేది శూద్రులు, క్రింది కులాల వాళ్ళు చేసేది ఇది జ్ఞానం కాదు, అధ్యయనం. అధ్యయనం, వేదాలో ఉన్నది మాత్రమే జ్ఞానం అంది. ఈ సాఫ్ట్ వేర్ ఇప్పటికీ మన ఆలోచనలో భాగం కాబట్టే, ఆత్మహత్య చేసుకొనే వాడు ఖర్మ అనుకుంటడు. ఇంకా వ్యవసాయంతోని అవసరం వుంది కాబట్టి ప్రభుత్వం పట్టించుకున్నట్లు చేస్తుంది. చేనేత రంగం అవసరం ప్రభుత్వానికి లేదు కాబట్టి, పరిశ్రమగా గుర్తించదు, ఏదో నామ మాత్రంగా సంక్షేమాన్ని చేస్తున్నట్లు నటిస్తుంది.
సహజీవనం: ఈ కథ కొంచెం సంక్లిష్టమైంది. ఇందులో వ్యవసాయదారుడైన అయిలయ్య అప్పుపాలై, బిడ్డ పెళ్ళికి తెచ్చిన అప్పుతో భారం మరింత పెరుగుతుంది. ఇంతలోనే కొత్తగా పెళ్ళైన బిడ్డ సూటుకేసుతో ఇంటికొచ్చి, అల్లుడు ఆటో అమ్మిండని, తను దుబాయికి పోదామనుకుంటుడని లక్ష రూపాయలు తెమ్మని పంపిండని చెపుతుంది. ఇంతలో నీళ్ళు లేక పంట ఎండిపోతే అయిలయ్య పంటకు నిప్పుపెట్టి తను ఆత్మహత్య చేసుకొని తన పరిష్కారం తను చూసుకుంటడు. ముందు చెప్పినట్లు సంక్లిష్టం అని ఎందుకంటున్నానంటే! వీళ్ళ పేదరికానికి కారణం వ్యవసాయంలో కలిసి రాకపోవడం ఒక్కటే కాదు, లేదా అల్లుడు లక్ష రూపాయలు అడగడంలో నేర స్వభావం లేదు. రచయిత చెప్పనిది మనకు వదిలిన విషయం ఏమిటంటే ఈ కుటుంబం శ్రమ మాత్రమే చేసి వచ్చిన ఆదాయంతో బతకటం. ఎందుకంటే ఈ అయిలయ్య క్రింది కులం వాడయి వుంటాడు. అగ్రవర్ణాలకు ఉండే నేరస్వభావం వీళ్ళకు ఉండదు కాబట్టి సంపద గాలిలోంచి సృష్టించలేరు. అగ్రవర్ణం గాలిలో సృష్టించగలదు అంటే ఇక్కడ గాలి అనేది రాజ్యం అని నా ఉద్ధేశం. మన దేశంలో ఇలాంటి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఇంటి యజమాని చనిపోతే! ఆ కుటుంబం గురించి ఆలోచించడానికే కష్టంగా వుంది. రాయటానికి ఈ పెన్ను, పేపరు సరిపోదు.
నాలుగు కోట్ల పిడికిళ్ళు: నవలగా రాయవలసిన దానిని రచయిత కథగా చేసి మన ముందుపెట్టిండు. ఇందులో 1. అదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్: ఇంకా అటవీ సంపదైన బంక, తేనెలాంటివి అమ్ముకొని జీవించే కుటుంబం. 2. మెదక్ జిల్లాలోని చిన్న కోడూరులో బోర్లు వేసి నష్టపోయిన రైతు కుటుంబం. 3. నల్లగొండ జిల్లాలోని కట్టంగూరులో ఫ్లోరైడు కారణంగా కాళ్ళు, చేతు వంకర్లు పోయి చిన్న తనంలోనే మంచంలో పడుట. 4. మహబూబునగర్ జిల్లాలోని పాలమూరు వలస కార్మికుల వ్యథలు. 5. ఖమ్మం జిల్లాలోని రంగువారి గూడెంలోని గొర్ల కాపరుల జీవితం. 6. రంగారెడ్డి జిల్లాలోని పోల్కంపల్లిలో ఎస్‌ఈజెడ్ కింద భూములు పోయినా ఉద్యోగాలు రాని కథ. 7. హైదరాబాద్ ఉద్యోగం కోసం వచ్చి నోటిఫికేషను కోసం ఎదురు చూసి ఉద్యోగాలు రాక నిరాశకు లోనవుతున్న నిరుద్యోగులు. 8. కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేటలో దుబాయికి సంపాదన కోసం పోయి శవమైన యాదగిరి. 9. నిజామాద్ జిల్లా బోధన్‌లో పిండిగిర్ని నడిపే దూదేకుల అల్లావుద్దీన్ పేదరికం.10. వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేట గ్రామంలోని కరువు.
రచయిత ఈ కథ రాసేనాటికి తెలంగాణ రాలేదు కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణ అని అగ్రవర్ణుల నాయకత్వంలోని టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల్ని నమ్మించకల్గింది. అందుకే యవకులు దాదాపు 1500 మంది తమ ప్రాణాలను బలిదానం చేసారు. తెలంగాణ వస్తే ఈ సమస్యలన్నీ కొంతలో కొంతయినా పరిష్కరించబడతాయనేది రచయిత ఉద్ధేశం కావచ్చు. అందుకే ‘నాలుగు కోట్ల పిడికిళ్ళు’ అని కథకు పేరు పెట్టాడు. మనం ఇంకొంచెం ముందుకు పోయి ఆలోచిస్తే బాగుంటుంది. చరిత్ర మనకో అవకాశం ఇచ్చింది. మన కళ్ళముందరే రచయిత ఈ కథ రాసిన నాలుగేండ్లకు తెలంగాణ వచ్చింది. పైన రాసిన పది రకాల సమస్యకు తెలంగాణ ప్రభుత్వం ఏం పరిష్కారం చేసిందో వివరంగా రాయాలని ఉంది కానీ సమయం సరిపోదు. ఒక్క విషయం మాత్రం చెప్పాలి ఎవ్వరికి న్యాయం జరగకపోయినా, అన్యాయంగానేకాదు, రాజ్యాంగ విరుద్ధంగా బ్రాహ్మణ పరిషత్ పెట్టి బ్రాహ్మణులకు సంక్షేమం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సాతంత్య్రం వచ్చిన దగ్గరి నుండి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇప్పటి వరకు కేంద్రం కానీ అమలు చేయని పథకాలు ఇవి. ఈ కథలోని ఆలోచన చాలా పెద్దది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. అస్తిత్వవాదానికి బహీనతలు న్నాయని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిరూపించింది.
పుంజీతం: రచయిత పుస్తకానికి పెట్టుకున్న పేరే ఈ కథ. ఈ కథ గురించి చెప్పే ముందు దీనికి ఎ.కె.ప్రభాకర్ ‘పులుల్ని కట్టడి చేసే మేకల కోసం’ అనే టైటిల్‌తో ముందుమాట రాసారు. ఈయన విశ్లేషణతో పేచీ ఏమీ లేదుకాని, టైటిల్‌తో విభేదిస్తున్నాను. మార్క్సిస్టు సాహిత్యంలో ఈ రకమైన భావజాలం ఉంది. దీనికి ఈ మధ్యనే కాలం చేసిన వంగపండు ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ పాట పాడేవారు. మేకలు పులుల్ని ఎప్పటికి కట్టడి చేయలేవు, చిలకలు కత్తులు జలపరించలేవు, చీమలు పాముని పొడవలేవు, జింకలు పులుల్ని వేటాడలేవు. ఇది సామాజిక వాస్తవం. సాహిత్యంలో అవాస్తవికమైన ప్రతీకలుగా వాడే వీలుందంటారేమో! అది భవిష్యత్తులో జరగబోయేదయితేనే ఆ వీలుంటుంది. ఎన్ని వంద ఏండ్లయినా జింక`పులి కాలేదు. ఇంకా ఏమైనా సందేహం ఉంటే వంగపండు ` బుర్ర రాము ఏడో సారా కథలో చెప్పినట్లు, కార్ల్ మార్క్స్ ని వెతికి పట్టుకొని నేను ఇంతకాలం పాడింది కరక్టా కాదా అని అంటే నాకు తెలిసిన వరకు నమ్మకాలంటే అసహ్యమని చదివాను కాబట్టి ఏం చెపుతాడో!
కథ విషయానికి వస్తే ఒకప్పుడు గ్రామంగా ఉన్నది. ఆ చుట్టు పక్కల అభివృద్ధిని ముందే పసిగట్ట గలిగే పులి రాంమనోహర్. ఆ ఊరి సర్పంచి జయరాంతో కలిసి ఊర్లోని ఒక్కొక్కరి భూమి కొంటాడు. ఆఖరికి ఊరిలోని స్కూల్ టీచర్ భూమి కూడా కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెడతాడు. స్కూల్ టీచర్ ప్రకాశ్ కొడుకు జీవా అమెరికా నుంచి తన ఊరికి వచ్చి చూస్తే ఊరి పచ్చదనం మొత్తం పోయి కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతే కడుతున్న అపార్ట్ మెంటులన్నీ పల్లె తల్లి సమాధుల్లాగ కన్పిస్తాయి. ఈ కథలో మనకు శ్రమ లేకుండా రచయిత పట్టణ నాగరికత ముసుగును తొలగిస్తూ కులాల వారీగా అపార్టుమెంటున్నాయనీ, మీది ఏ కులమైతే అదే అపార్ట్ మెంటులో ప్లాటు తీసుకొనే సౌకర్యం ఉందని చెప్పిస్తాడు.
ఈ కథను ఇంకింత విస్తృతంగా అర్థం చేసుకోవటానికి నేను అనంతపూర్‌లోని లేపాక్షి ఎస్‌ఈజెడ్ (ప్రత్యేక అర్థిక మండళ్ళు) కింది గ్రామాల పరిస్థితి చెప్తాను. 2005లో వచ్చింది ఈ చట్టం. ఇక్కడ భూ సేకరణ 2007 నుండి మొదలైంది. నేను 2009లో రెండు రోజులున్నాను. ప్రతి గ్రామం తిరిగాను. ఇక్కడి వ్యవసాయ భూమి అంత విలువైనది ఏమి కాదు. నీటి వసతులు లేవు. బోర్లు, బావుల కిందే వ్యవసాయం. 2005లో ఎకరం యాబైవేలుండేది. రైతుల మధ్యనే అమ్మటం, కొనటం జరిగేది. ఈ ఎస్‌ఈజెడ్ ప్రకటించాక యాబై వేల నుండి లక్షా ఇరవై అయిదు వేలకు పెంచి మొత్తం భూమిని కొన్నారు. ఈ గ్రామాలు శ్రావణబెళగోళ ఎయిర్ పోర్టుకు నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 2009 చివరి నాటికి ఎకరం భూమి విలువ ఇరవై లక్షలు. వీళ్ళు సేకరించింది దాదాపుగా వెయ్యి ఎకరాలు. ఎవరైతే భూములు అమ్ముకున్నారో అందులో నూటికి డెబ్బై మంది కుంటుతున్నారు, చేతులు విరిగి ఉన్నాయి. ఎందుకని తెలుసుకుంటే డబ్బు వచ్చాక కర్ణాటకలో మందు తక్కువ రేటు కనుక టూ వీలర్లు కొనుక్కొని తాగి కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకున్నారు. కొంత మంది మాత్రమే సిమెంట్‌లో పక్కా ఇళ్ళు కట్టుకున్నారు. చాలా మంది డబ్బులు అయిపోయినయి. ఇళ్ళు కట్టుకొన్న వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. వీళ్ళు తీసుకున్న భూములన్నీ పడావుపెట్టారు కాబట్టి పని లేదు.
ఈ పులి ఒక్కొసారి ప్రభుత్వం రూపంలో కూడా వస్తుంది. ఇబ్రహింపట్నం ఏరియాలో ప్రభుత్వ అధికారులు కొన్ని గ్రామాలలో సర్వే చేసినట్లు పేపర్లో వచ్చింది. అక్కడ వజ్రాలున్నాయి ప్రభుత్వం భూమిని తీసుకుంటుందని అడ్డికి పావుసేరుకు అమ్ముకున్నట్లు పేపర్లో వచ్చింది. ప్రజలు మేకలూ కాదు, వీళ్ళు పులులు కాదు. ప్రభుత్వం అండతో ఆర్థికంగా ఎదిగి వచ్చిన అగ్రవర్ణం వాళ్ళు. వీళ్ళను ఎదుర్కోవటానికి చదువు, జ్ఞానం కావాలి. అందులో పూలే, అంబేద్కరుండాలి.
పేగు బంధం: ఈ కథ ఆధునిక సమాజంలోని తలక్రిందు ప్రపంచాన్ని చూపించే కథ ఇది. ఈ ఆధునిక ప్రపంచంలో తల్లి వద్దు, తండ్రి వద్దు, కానీ తన పిల్లలు తనకి కావాలి (బహుశా ఈ ఆధునికత ఇంకింత తలకెక్కితే పిల్లలు కూడా బరువైతారేమో) ఈ పిల్లలను చూడటానికి ఇంట్లోకి సొంత మనుషులను తెచ్చుకోవటం ఇష్టం లేక పని మనిషిని తెచ్చుకుంటే, పనిమనిషి తల్లి పిల్లగాన్ని తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్ ముందు పడుకోబెట్టి అడుక్కుంటుంటే చూసి చలించిపోయి అప్పుడు ఊర్లోని అమ్మ, నాన్న గుర్తుకొస్తారు. ఈ కథ కోట్లాది కుటుంబాల కథ. మనుషులకు డబ్బే అన్ని సుఖాలను ఇస్తుందని నమ్మిన తరం ఇది. అన్నింటికీ డబ్బే సమాధానం అని అర్ధం చేసుకున్న తరం కథ. ప్రపంచీకరణకు స్థానికతే సమాధానం అంటాడు, ప్రముఖ నవలా రచయిత గాబ్రియెల్ మార్క్వెజ్. మన సాహిత్యం సమస్యను పట్టుకోవడంతోపాటుగా పరిష్కారాలను కూడా పట్టుకొంటే ఉమ్మడి కుటుంబాలే పరిష్కారం అని రాయాలి.
పుండు: కాశీ పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితురాలి బిడ్డను చూసి పోలికలను గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీలవేణిని చూసిన తర్వాత వెంటనే జరిగిన పరిణామంతో ఆమెకు మూడు లక్షల చెక్కు రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఆమె కుటుంబం, ఇద్దరు బిడ్డలు భర్త వ్యవసాయం చేసి అప్పు పాలై ఆటోకొని కాల్ మనీగా పిలవబడే కాబూలీ వడ్డీకి డబ్బు తీసుకున్నారు. కాశీ వున్నప్పుడే కానిస్టేబుల్ వచ్చి ఎస్సైగారు రమ్మంటున్నారు అని తీసుకవెళుతాడు. వాళ్ళ వెంట వెళ్ళిన కాశీ ఎస్సై మాట్లాడిన విధానం చూస్తాడు, కానీ ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే కాల్ మనీ నడిపే వ్యక్తిది అగ్రకులం.
పేద ప్రజలకు చట్టాల పట్ల అవగావన లేకపోవడమే వీళ్ళకు పెట్టుబడి. సివిల్ మ్యాటర్లో తల దూర్చొద్దని పోలీసులకు తెలుసు. కాని ప్రజకు తెలియదు కాబట్టి అధికారం చెలాయిస్తాడు, పైగా కాల్ మనీ అన్యామనీ నీ దగ్గర లైసెన్సు లేకుండా వ్యాపారం ఎలా చేస్తున్నావు అని అడగడు, ఎందుకంటే కులం అగ్రవర్ణం, డబ్బున్నోడు. మనకు తెలవాల్సింది ఏమిటంటే బ్యాంకుకు కోట్లు ఎట్లా ఎగగొడతారు, విదేశాకు ఎలా పారిపోతారు (బ్యాంకుకు ఎగ్గొట్టి విదేశాలకు పోయిన అందరూ అగ్రవర్ణాల వారే) ఎందుకంటే మన చట్టాల ప్రకారం ‘కాగ్నిజబుల్ అఫెన్స్’ కాదు. ఎవరైన బ్యాంకులో డబ్బు ఎగ్గొడితే జైలులో వేయాలి. అంటే అతని తిండికి పెట్టే డబ్బును బ్యాంకు వారుముందే కోర్టులో జమ చేయాలి, ప్రభుత్వం పెట్టదు. అరిస్టాటిల్ మంచివారికి చట్టాలతో పని లేదు, చెడ్డవాడు చట్టాలను లెక్క చేయడు అంటాడు. కానీ బహుజన రచయితకు రాజ్యాంగం, చట్టాల పట్ల ఎంత అవగాహన ఉంటే అంత మంచిది.
దడ్వత్: ఈ కథలో కులం అనేది చూపించిండు రచయిత. ఈ అగ్ర కులం ఎంత దుర్మార్గమైనా ఎలా చేయగలదో క్రింది కులాలను ఎలా అణిచివేయగలదో చూపించాడు. వీరమల్లు కుమ్మరి కులస్థుడు, ప్రతాపరెడ్డితో గెట్ల దగ్గర పంచాయితీ అయి ఇద్దరు దడ్వత్ పెట్టి పంచాయితీలో కూసుంటరు. వీరమల్లుకి అన్యాయం జరుగుతుంది. ప్రతాపరెడ్డి కొడుకు ధర్మతేజరెడ్డి వీరమల్లు బిడ్డయిన కవితకు కడుపు చేస్తాడు. కవిత పెళ్ళి చేసుకోమని గొడవ చేస్తే అందరినీ మేనేజ్ చేసి కొడుకుని విదేశాలకు పంపుతాడు. ఈ విషయం తెలుసుకున్న వీరమల్లు పోలీస్టేషను చుట్టూ తిరుగుతుంటాడు... ఈ కథలో రచయిత కులం గురించి చూపించి అది ఎలా వెనుకనుండి పని చేస్తుందో రాయకుండానే చెప్పిండు. అంటే క్రింది కులాలకు న్యాయం జరగటం ఎంత కష్టమో ఈ కథ తెలియజేస్తుంది.
లోలోపలి విధ్వంసం: ఈ కథ ఆధునిక సమాజ జీవితాన్ని వివరిస్తూ, అంతిమంగా ప్రశాంతత అనేది అశ్రమాలలో, గురూజీలో దేవులాడుకోవడం ఈ కథ ఉద్దేశం. ఈ కథని చదివితే కన్నబిరాన్ సంఘటన ఒకటి గుర్తుకి వచ్చింది. హైకోర్టు జడ్జీలు ప్రతి సంవత్సరం పుట్టపర్తి సాయిబాబా పుట్టిన రోజుకు వెళ్తుంటే, కన్నబిరన్ ఒక ఉత్తరం రాసారు. సాయిబాబా పుట్టిన రోజున హైకోర్టుకు సెలవివ్వండి అని.గుండె కిందతడి: డేవిస్ క్రిస్టియన్. ఇతని కొడుకు సామేల్ ఎవరో అగ్రకుల అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తారు. పరవు హత్య అంటారు కానీ నిజానికివి అగ్రకుల హత్యలు. నిత్యం పేపర్లో చూస్తుంటాం. ఈ కేసును గనుక దగ్గరనుండి పరిశీలిస్తే ఈ హత్యలు చేసిన వాళ్ళకు శిక్షలు పడవు. ఎందుకంటే జడ్జీలు మనుషులే. వాళ్ళకీ కులముంది. అందులోనూ మన దేశంలో నూటికి నూరు శాతం జడ్జీలు అగ్రవర్ణాలే. ఎందుకంటున్నానంటే దళితులు, బీసీలు, ఆదివాసీలు మొత్తం కలిసినా 0.01 పర్సెంటు కూడా ఉండరు. అంతేకాదు, ఎఫ్‌ఐఆర్ కాపీలోనే కులం వివరాలుంటాయి. క్రింది కులాలు నేర స్వభావం ఉన్న వాళ్ళు అనేది స్వాతంత్రానికి పూర్వం నుండి ఉన్న అవగాహన.
వెల్దండి శ్రీధర్ కథలు మొత్తంగా పేదరికం చుట్టూ తిరిగాయి. వ్యవసాయం, భూమి సంబంధాలు, చేనేత, ప్రధాన ఇతివృత్తాలు కల్గిన కథలు. శ్రీధర్ పేదరికాన్ని మన ముందుంచిదానికి గల కారణాల అన్వేషణను మనకే వదిలేసాడు. మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఏండ్లు దాటిపోయింది. ప్రజల జీవితాలు మారలేదు. ఇందులోనూ శ్రీధర్ కథల్లోని పేదరికపు పాత్రలన్నీ బహుజన కులాలకు చెందినవే! మనం ఆలోచించాల్సింది ఎందుకు మారలేదు అని. నేను పైన చెప్పినట్లు పేదలంటే ఎవరు అనేది సరి అయిన లెక్కులు లేని దేశం మనది. లేటెస్టుగా నీతి అయోగ్ పేదలంటే ఎవరు అనే నిర్వచనాన్ని తెలుపుతుందని, పేదరికాన్ని నిర్వచించే పనిలో ఉందన్నారు. బహుజన తత్వశాస్త్రం మాత్రం ఈ దేశంలో పేదరికానికి, అధికారం, భూమి, సంపద లేకపోటానికి కులమే కారణంఅంటుంది. క్రింది కులాలలో పుట్టారు కాబట్టి ఇవన్నీ వుండవు. కొంత అనుమానం రావచ్చు. బహుజనులలో కూడా అధికారం, భూమి, సంపద ఉన్నవాళ్ళు వున్నారు కదా అని! దీనిని బహుజన వాదం ‘యాక్సిడెంటల్ మనీ’ అని అంటుంది. మన దేశంలో జనాభా లెక్కల మాదిరిగానే భూమి, సంపద లెక్కలు కూడా తీస్తే తెలుస్తుంది ఎవరి దగ్గర ఎంత సంపద వుందీ అనేది. అగ్రవర్ణాలలో నూటికి 0.05 శాతం మంది మాత్రమే పేదరికంలో వుంటారు. అది కూడా క్రానిక్ పేదరికం కాదు. దేశంలో ఎనబై శాతం జనాభా ఉన్న బహుజనులలో నూటికి 0.01 శాతం మంది దగ్గర మాత్రమే కొంత భూమి, సంపద వుంటుంది. భవిష్యత్తు బహుజన సాహిత్యం వూరికో కాన్షీరామ్‌ని వెలుగులోకి తెచ్చేలా రచనలు, పనికూడా చేయాని నా కోరిక.