వాన చినుకుల కూడికతో ఋతువుల బండి దుఃఖిస్తున్నది
అంటూ కొండపల్లి నీహారిణి రాసిన కవిత ' చేతుల దుఃఖం ' ఇక్కడ చదవండి :
ఋతువుల బండి కాళ్లకు చక్రాలు కట్టుకొని
రంగుల శోభతో నడుస్తున్నది
ఈ న్యాయ రహిత లోకంలో తీరొక్క తీరు మనుషులతో
తానూ నడుస్తూనే ఉన్నది
జీవశక్తి వేగంగా ప్రవహించినట్టు
జ్ఞాన శక్తి క్రియాశీలత కోసం పరితపించినట్టు
నడుస్తూనే ఉన్నది నడుస్తూనే ఉన్నది
కళ్ళల్లో కట్టిన దిగులు గూళ్ళు
తడి వెనుక పేరులేని నవ్వు
రాళ్లు తాకిన సున్నిత మనసు
జారిపోయిన నిన్నటి చివరి మాట
అన్నీ కురిపించేది
రుధిర భాష్ప ధారలే
కలల సౌధాల మెట్లన్నింటినీ కలబోస్తే
బతుకు బండిని ఎక్కిన ఒంటరి ధైర్యానికి
రైతు ఓ పేరున్న మారాజు
జీవనం సమరం
గెలుపు ఓటముల కొట్లాటలు
ఎండా వానల్లో నేల తల్లిని
పంటలేసి ఓదారుస్తుంటాడు
కంటితెర చిల్లుల జల్లెడ
నల్లని ఆకాశం నిండా పరుచుకున్న
కాంతి విహీన నక్షత్రాలు ఇప్పటివే
నిన్నటి నవ్వుల్ని తలంపుకు తెస్తూనే
అనుభూతిని పంచుతుంటాడు
ప్రకృతేమో
శాంతిని తనలో దాచి
అప్పుడప్పుడు భయంకరాఘాతాలు విసురుతూ
అప్పుడప్పుడు
ప్రేమను సారిస్తూ
చిత్రకన్ను వేస్తుంటుంది
మనసంతా ఒద్దికను వీడి తొంగిచూస్తే
వికటాట్టహాసం చేస్తున్నట్టే
కడలి అలలలా
ఏవేవో అనిర్వచనీయ భావాలు మెదులుతుంటాయి
కళ్లాలపై మొలిచినవని కొన్ని ముఖాలు
కొనుగోలు బేరాల ఆటలవుతుంటాయి
గుండె తెరపై ఒళ్ళు గుగుర్పాటు దృశ్యం
వాన చినుకుల కూడికతో
ఋతువుల బండి దుఃఖిస్తున్నది
దోసిట్లో మొలకల ధాన్యం కూడా
మరి అన్నమెలాగా అంటున్నది
ఇది
రైతు రెండు చేతుల
దుఃఖం..