బంధం భాంధవ్యాలు ఎంత లోతైనవో కవి కర్ణాకర్. ఆర్ రాసిన ఈ కవితలో చదవండి.
బంధం భాంధవ్యాలు
మొక్కజొన్న లేత కంకిపైవాలిన పక్షులలాంటివి..!
అందం ఆస్తీ
అమాయకపు మనిషి
నిలువెళ్ళా పసిడివేసుకుని
కిరాతక దొంగలగుంపునకి
ఎదురెళ్ళడంలాంటిది..!
కోపం నవ్వూ
మనసులుకలవని
ఆలుమగల సంసారంలాంటివి..!
ప్రణయం
బతుకు ప్రళయంముందు
కూని రాగంలాంటిదే..!
సర్కారు ఉద్యోగం
పెద్దపాలేరు...చిన్నపాలేరు
ఏలే రాజుల కనుసన్నల్లో ఆడే
నెల జీతపు బసువన్నబతుకు..!
కాంట్రాక్టు నౌకరీ
పొద్దుగుత్తకి పోయే
దినసరి కైకిలి లాంటిది..!
ఊపిరీ -జీవితం
కరోనా కౌగిలిలో
శతాయుష్మాన్ భవ అనుకుని
భ్రమపడడం లాంటిది..!
గడిచిన గడియలో
ఒక నిముష కాలం లాంటిది..!
బతుకెంతో బరువైనదే
దానికిమించిన బాధ్యతైనది కూడా..!