ఖననంలోనో దహనంలోనో దూరమైనా మరలా పూస్తుంది అమర స్థలిని - డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత ఇక్కడ చదవండి.
కూలుతున్న గుండె గృహాలు
పారుతున్న రోడ్ల నీటి ప్రవాహాలు
శిధిలమైన స్దిరాస్తుల నిర్జనశకలాలు
ఒక్క తుఫానులో ఊపిరి ఆవిరైంది అనంతంగా
తప్పించుకొనే దారిలేదు
చిందర వందర చీకటి తోవైంది
శవాల కమురు కాలుతున్నది స్మశాన వాటికగా
ఒక్క కరోనా వేటుకు రోదిస్తున్నవి
మృదంగ తరంగాలైన గాలిలో
రాగాలు లేని పాట పాడుతున్నది
అక్షరాల అందమైన మృత వలల్లో
వగపు తెర దిగిపోతున్నది చిత్రంగా
అల్లుకున్న సృజన జీవిస్తుంది చెట్టులా
జననం వస్తూవస్తూ మరణాన్ని
వెంటేసుకొచ్చింది కనపడకుండా
ఖననంలోనో దహనంలోనో దూరమైనా
మరలా పూస్తుంది అమర స్థలిని.