అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం ఫిలిం మేకర్, సంగీత దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత, ప్లే బాక్ సింగర్, నిర్మాత ఇంకా ముఖ్యంగా కవి విశాల్ భరద్వాజ్ కవిత్వం సంకలనం ‘న్యూడ్’ అందిస్తున్నారు వారాల ఆనంద్.
సాధారణంగా సృజన కారులు రెండు రకాలుగా వుంటారు. కళారంగంలో వున్న భిన్న కళారూపాల నుంచి కవిత్వాన్నో, కథల్నో,నవలా రచననో, సంగీతాన్నో, పెయింటింగ్ నో, నాటక రంగాన్నో, బాల సాహిత్యాన్నో సినిమానో తమ వ్యక్తీకరణ మాధ్యమంగా స్వీకరించి జీవితాంతం కృషి చేసి నిలబడతారు. ఇంకో రకం సృజనకారులు తమ కాన్వాస్ ని ఎదో ఒక రంగానికి పరిమితం చేయకుండా భిన్నమయిన రూపాల్ని స్వీకరించి కృషి చేసి తమ ముద్రని మిగులుస్తారు. మన దేశ సృజనకారుల విషయానికి వస్తే టాగోర్, సత్యజిత్ రే, గుల్జార్ ఇలా అనేక మంది తమ సృజనాత్మక కాన్వాస్ ని విస్తారంగా పరుచుని భిన్న రంగాల్లో గొప్ప కళారూపాల్ని సృష్టించారు. సరిగ్గా అదేరీతిలో కొత్త తరంలో విశాల్ భరద్వాజ్ అదే కోవకు చెందినవాడు. తను ఫిలిం మేకర్, సంగీత దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత, ప్లే బాక్ సింగర్, నిర్మాత ఇంకా ముఖ్యంగా కవి.
విశాల్ భరద్వాజ్ అనగానే సంగీత దర్శకుడిగా అభయ్,ఫౌజీ, మాచిస్, ఇట్లా పలు సినిమాలు గుర్తొస్తాయి. వాటిల్లో ఆయన అందించిన నవ్య సంగీత రీతులూ స్పురణకొస్తాయి. అంతే కాదు దర్శకుడిగా తను రూపొందించిన సినిమాలకు మూడు అంతర్జాతీయ అవార్డులు, ఏడు జాతీయ ఫిలిం అవార్డులు అందుకున్నారు. ఇతర చిత్రాలతో పాటు విశాల్ ‘షేక్స్ పియర్ రచనలు మాక్బెత్, ఒథెల్లో, హామ్లెట్ ల ఆధారంగా రూపొందించిన మక్బూల్, ఓంకారా , హైదర్ చిత్రాలు ఆయన్ని భారతీయ చలన చిత్ర చరిత్రలో ఉన్నత స్థానంలో నిలుపుతాయి. 1960,70,80 దశకాల్లో వచ్చిన సమాంతర చిత్రాల తర్వాత నూతన తరంలో ఎదిగివచ్చిన దర్శకుల్లో విశాల్ కొత్త భావాలతో కొత్త టెక్నిక్ తో నిలబడ్డ నవ్యదర్శకుడు. ఇట్లా తన వైవిధ్య భరితమయిన సృజన రంగాలతో పాటు ఇటీవల విశాల్ తన కవిత్వ సంకలనం ‘న్యూడ్’ వెలువరించారు. ఇందులో 25 గజల్స్, దాదాపుగా అంతే సంఖ్యలో కవితలూ (నజ్మ్స్) వున్నాయి.
undefined
విశాల్ కవితల నిండా ప్రేమ, ఆర్తి, వేదన వున్నాయి వాటితో పాటు వ్యవస్థమీద ఆయన చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో వున్నాయి. సరికొత్త ఇమేజరీలతో భావాలతో సాగే ఆయన కవిత్వం సూటిగా సరళంగా స్పష్టంగా వుంది.
“ ఇది బనారస్ కాదు, ఇది ధిల్లీ
ఇక్కడ గంగ వెనక్కి ప్రవహిస్తుంది” అంటాడు అంతేనా ‘ఎలుకల ఇంట్లో కాల్చిన రొట్టెలను తినిపిద్దాం రాజకీయాలు వింతయిన ఎలుకలు’ అని కూడా అంటాడు.
గుల్జార్ ని అమితంగా అభిమానించే విశాల్ కవిత్వంలో గాలిబ్ గురించి, ఓషో గురించీ కవితలున్నాయి. మొత్తంమీద గొప్ప భావుకుడయిన కవిగా విశాల్ భరద్వాజ్ తన ‘న్యూడ్’ సంకలనంతో భారతీయ సాహిత్య ప్రపంచంలో నిలబడ్డాడు. విశాల్ హిందీ కవిత్వాన్ని సుక్రితా పాల్ కుమార్ ఇంగ్లీష్ లోకి అంతే ప్రతిభావంతంగా అనువదించారు.
‘న్యూడ్’ కవితా సంకలనం లోని కొన్ని కవితల అనువాదాలు చదవండి.....
నేను
గతంలో నేనే, ఇప్పుడూ నేనే
నేనే నదిని, వృక్షాన్ని
ఆకాశాన్ని, భూమినీ కూడా
నేనే ఆలయాన్ని, అంతఃపురాన్ని
షియా ని, సన్నీ ని కూడా
ప్రార్థన వేళ
పండిత్ ల చేతిలో దివ్వెని
ఖాజీ నుదిటి మీద
నమస్కార చిహ్నాన్ని
ఉపదేశకుడి గుండెల మీద
వేలాడుతున్న శిలువను
గతంలో నేనే, ఇప్పుడూ నేనే
***
ఒంటరి ఛాయ్
మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత
తరుచుగా లోపల
లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకు పోతుంది
పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి
ఓ కప్పు వేడి వేడి సాయంకాలపు టీ తో
అర చేతుల్ని వెచ్చ బరుచుకుంటూ
సూర్యాస్తమయం లోంచి రాత్రిని దర్శిస్తాను
పడగ్గది పైకప్పు పై
వేలాడుతున్న ట్యూబ్ లైటు వెలుగులో
ఓ బల్లి కీటకం కోసం వేచి చూస్తున్నది
నిప్పులపై కాలుతున్న రొట్టె లోంచి
పిండి కాలుతున్న వాసన గుర్తుకొస్తే
కళ్ళు వెలిగిపోతాయి
రాత్రి కురిసిన చిరు జల్లులకు
పై కప్పు చల్లబడింది
రేడియోలో పాత పాటలు వింటూ కళ్ళు మెరుస్తాయి
రాత్రంతా ఓ ముఖం కోసం
ఎదురు చూస్తూ వుంటాను
సూర్యోదయానికి ముందు మెల్లిగా
నిద్రలోకి జారుకుంటూ
తలగడలో ముఖం దాచుకుంటాను
వీధి చివర
ఆలయం ప్రార్థనలలో మంజీర నాదాలు ధ్వనిస్తున్నాయి
మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత
తరుచుగా లోపల
లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకు పోతుంది
పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి
***
ఇంట్లో ఒంటరిగా వదిలేయకు
ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు
నువ్వు ఎదుట లేకుంటే టీవీ ఆన్ కాదు
కప్ బోర్డుకు వేసిన తాళం తెరుచుకోదు
నల్లాకు జలుబు చేస్తుంది
పిచ్చిది టప్ టప్ మంటూ చీదుతూ వుంటుంది
లైట్లు వెలుగుతూ ఆరుతూ దొంగాట ఆడతాయి
ఎయిర్ కండీషనర్ వేడి గాలిని వెదజల్లుతుంది
ఏ కారణమూ లేకుండానే ఇంటర్నెట్ మూగ బోతుంది
నువ్వు రాగానే మరే కారణమూ లేకుండానే కనెక్ట్ అవుతుంది
గాలితో పరదాలు జత గూడి నన్ను భయపెడతాయి
రాత్రంతా కుట్రలు చేస్తాయి
నన్ను ఒంటరిగా వదిలి వెళ్లకు
***
రీ యూనియన్
ఆయన శవం కట్టెలపై కాలిపోయింది
ఆయన పేరు నాలుకపై పూడ్చివేయబడింది
ముఖం నిప్పుల కుంపటి అయింది
అవయవాలు కాలి బూడిదయ్యాయి
ఆజాను బాహుడయిన నా సోదరుడు
ఇప్పుడు బూడిదయి
ఓ చిన్న సంచీలో ఇమిడి పోయాడు
నదిలో కలిపేసాము
నేనెప్పుడూ ఆ నది ఒడ్డున కూర్చుని
ఎదో ఒక రోజు నేనూ ఈ నదిలో కలిసిపోయి
ప్రవహించి అతన్ని కలుసుకునేందుకు వెళ్తానని
తల పోస్తూ వుంటాను .
- స్వేచ్చానువాదం : వారాల ఆనంద్
వీలు చేసుకుని చదవాల్సిన మంచి కవితా సంకలనం ‘న్యూడ్’
(ఆన్లైన్ లో అందుబాటులో వుంది)