అభివృద్ధి నిరోధకమైన అంతుచిక్కని వ్యాధి గురించి కందుకూరి శ్రీరాములు రాసిన కవిత " రాజకీయ వ్యాధి " ఇక్కడ చదవండి :
రాజకీయ వ్యాధి
మోదమో ఆమోదమో
ఒక వ్యాధి పచార్లు చేస్తుంది
క్యాన్సర్ వ్యాధి కాదు
కరోనా అంతకంటే కాదు
వింతవ్యాధి విడ్డూరమైన వ్యాధి
ప్రజానీకానికీ
ప్రపంచానికీ అంతుచిక్కని వ్యాధి!
పచ్చని సంసారంలో
చిచ్చుపెట్టడానికి
సిద్ధమవుతున్న వ్యాధి
మతోన్మాదం పడగవిప్పి
మనుషులమీద
విలయతాండవం చేస్తున్నట్టు
వెదజల్లుతూ పెల్లుబుకుతున్న వ్యాధి
నడుస్తున్నదేదో నడవనీయకుండా
గడుస్తున్నదేదో గడవనీయకుండా
కాలికి కాకపోతే మెడకు
మెడకు కాకపోతే కాలికి
సాగకుండా కొనసాగకుండా
అభివృద్ధి నిరోధకంగా అంతుచిక్కని వ్యాధి
రోగాల్ని పిచ్చి రాగాల్ని ఆలపిస్తూ అంటువ్యాధిని అదేపనిగా పనికట్టుకొని మనిషి మనిషికి
వ్యాప్తిచెందిస్తున్న వ్యాధి
కాలం గడుస్తునే వుంది
కాలం నడుస్తునే వుంది
కాలం మార్పు చెందుతునేవుంది
ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు
ఎప్పటికప్పుడు అల,
అల మీద అల అలా
నిరంతరంగా నిరభ్యంతరంగా వస్తునే ఉంటాయి
పోతునే వుంటాయి
ఈ వ్యాధీ అలా వస్తునేవుంటుంది
అలాగే వ్యాధి అలా పోతునే వుంటుంది
కాలమే నిర్ణయిస్తుంది
అంతా కాలమే నిర్ణయిస్తుంది