డా.కె.గీత కవిత : యుద్ధప్రశ్నలు కొన్ని- 2

By Arun Kumar P  |  First Published Jun 8, 2022, 1:27 PM IST

ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాడి  100 రోజులు దాటిన నేపథ్యంలో కాలిఫోర్నియా నుండి డా.కె.గీత రాసిన కవిత '' యుద్ధప్రశ్నలు కొన్ని- 2 " ఇక్కడ చదవండి.  


యుద్ధప్రశ్నలు కొన్ని- 2 

మిత్రమా!
ఎక్కడున్నావు?
కూలిన ఆశల కింద
కుప్పకూలిన భవంతి కింద
మరి నువ్వు? 

Latest Videos

*

తలదాచుకుందుకు 
ఇంత చోటులేని చోట 
కడుపు నింపుకుందుకు 
ఏవీ దొరకని చోట 
*
ఎవరైనా కనిపించారా?
మా వాళ్ళు? 
మన స్నేహితులు?
కనీసం నీ చుట్టూ ఎవరైనా ఉన్నారు 
నాకిక్కడ 
చుట్టూ భయం, చీకటి
రక్తం, దుర్వాసన 
యుద్ధం చేస్తున్న భీభత్సం 
మన స్నేహం, ఊరు గుర్తుకొస్తున్నాయి 
అసలెవరైనా బతికున్నారా?
*
ఊ... 
ఎవరో..
జీవచ్ఛవాల్లా నాలాగే 
*
నువ్వూ నేనూ కలిసి తిరిగిన ప్రదేశాలు
ఎలా ఉన్నాయి?
ఒకప్పటి జీవితాలు  
ఎలా ఉన్నాయి?
*
ఏమో 
*
నువ్వెక్కడున్నావు?
*
ఏమో 
ఎప్పుడు ఎవరికీ మూడుతుందో తెలీదు 
కంటి మీద కునుకు రాదు 
ఒకటే చప్పుడు 
గుండె లోపల 
గుండె బయట 
ఇళ్లలో దాక్కున్నా 
రోడ్డున నడుస్తున్నా 
ప్రాణాలు దక్కుతాయని 
నమ్మకం లేదు 
నాకిక్కడ 
చుట్టూ అంధకారం 
నా చుట్టూ
ఎగిసిపడుతున్న దుమ్ము 
కూలుతున్న గోడలు 
కాలుతున్న శవాలు 
గొంతున వేళ్ళాడుతున్న దుఃఖం 
ఎక్కడా ఏమీ లేని శూన్యం 
రోడ్డున పడ్డ  కలలు 
రాలిపడ్డ బతుకులు 
యుద్ధం 
యుద్ధం మాత్రమే 
నిజమైన  వర్తమానం
*
నాకిక్కడ 
తెగిపడ్డ అవయవాలు 
వంటిని మించిన 
మనసు గాయాలు 
నన్ను బతికించేదేదైనా 
ఉందంటే
అది 
ఆ రాక్షసుల రాతిగుండె 
చీల్చే ఖడ్గమే 
తుపాకీ శబ్దమే 
మరి నీకు? 
*
ఏమో 
నాకు బతుకు ఉందో లేదో
నన్ను బతికించేది ఉందో లేదో
కానీ ఎక్కడో
ఏదో ఆశ  
నీ హృదయంలో ఇప్పుడు 
ఓ సంభాషణగా 
ఓ జ్ఞాపకంగా 
ఎక్కడో ఓ మూల మిగిలిన  
గతంలాగా  
యుద్ధంలో ఒరిగినా
మరుగుతున్న  
వీర రక్తపు చుక్కలాగా 
ఒక గొప్ప ఆశ 
ఎన్నో ఏమోలు  
ఎన్నో కానీలు 
అయినా 
గుండె దిటవు చేసుకుని  విను 
నువ్వక్కడ వీర మరణం పొందుతావు 
నేనిక్కడ మరణించేదాకా పోరాటం చేస్తాను

click me!