చప్పట్లు కొట్టడంలోని ఆనందాన్ని తరగతి గది జ్ణాపకాలతో నిజామాబాద్ నుండి కందాళై రాఘవాచార్య వినిపిస్తున్న 'చప్పట్ల చేతులు ?! ' కవిత ఇక్కడ చదవండి.
తరగతి గదిలో దోస్తులకు
ఎక్కువ మార్కులు వస్తే
ఎవరు కొట్టకున్నా
నేను రెండు చేతులతో
నాల్గు చేతులంత చప్పుడయేలా
చప్పట్లు కొట్టేవాడిని !
చప్పట్లతో తరగతి గది కొడంత ప్రతిధ్వని !
అర చేతులు మైదాకు పండినట్లు
ఎర్రెర్రగా నొప్పులు పడ్డా
అభినందించిన ఆనందంలో
బాధ తెలువని తనమే !
నోటు బుకులో వందసార్లు రాసిన
చప్పట్ల అనుభూతికి
సరికి సరి కాదు
కొందరికి చప్పట్లు కొట్టడమంటే తక్కువ తనం
అహం వారికి ఎక్కువ తనం !
తెలివి ఎక్కువైన కొద్ది
డిగ్రీలు పేరుకన్నా పొడవైన కొద్ది
సభలో చప్పట్లు కొట్టడం వెనకా ముందుగా
నాల్గు దిక్కుల్లోకి తప్పించుకునే చూపులే
రెండు చేతులూ కోటు జేబుల్లో దాక్కుంటాయి
చప్పట్లు కొట్టకుండా ఎన్ని రకాల పథ్యాలో
ఎక్కడైనా లేచి రెండు చేతులతో
చప్పట్లు కొట్టడం మించిన
వెల్ కమ్ బ్యాండ్ ఏముంటుంది
ఇప్పుడైతే విశ్వమంత చప్పట్లు కొట్టడం
నిలకడగా మానవాళికి ఆరోగ్య సూత్రమైపోయింది
ఇక చప్పట్ల నుండి ఎలా తప్పించుకోగలరు.