పుస్తక సమీక్ష :రంగినేని కవిత- వస్తు వైవిధ్యం

By telugu team  |  First Published Sep 11, 2021, 2:15 PM IST

రంగినేని సుబ్రహ్మణ్యం సాహితీ సర్వస్వం ' సాగర మధనం'  కావ్యాన్ని సంబరాజు రవి ప్రకాశ రావు సమీక్షించారు.  పూర్తి సమీక్షను ఇక్కడ చదవండి.


ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతొ దుష్కరము సుమ్ము అంటాడు గాలిబ్.

కొల్లాపురం మిత్రులు పంపిన రంగినేని సుబ్రహ్మణ్యం సాహితీ సర్వస్వం ' సాగర మధనం ' కావ్యాన్ని తదేకంగా చదివాను.  సంస్థాన కాల సాహిత్య వైభవాన్ని రంగినేని కొనసాగించాడని తెలిసి మరీ ఆనందించాను.  29 ఏళ్లకే రంగినేనిని తన లోకానికి తీసుకుపోయిన దేవుడంటే తొలిసారిగా నాకు కోపం వచ్చింది. కనీసం దేశ సగటు వయసు వరకైనా ఆయన జీవించి ఉంటే కొల్లాపురం హనుమాజీపేటలా ఖ్యాతి పొందేదేమో!

Latest Videos

undefined

రంగినేని సాహిత్యాన్ని చదివినప్పుడు నరుడు నరుడు అవుట చాలా కష్టం అనిపించింది. మనిషి మనిషిగా ఉండాలనేదే ఆయన బలమైన కోరిక. మనిషి తన సహజ గుణాలను విడిచి దుర్మార్గాల వైపు నడవడాన్ని రంగినేని తీవ్రంగా నిరసించాడు. సమాజంలో ఉన్న అలాంటి చెద పురుగులను చూసి వేదన చెందాడు. వ్యాకులతకు గురయ్యాడు. ఒక్కోసారి నిరాశలో కూరుకుపోయాడు. వెంటనే తేరుకుని మనలను ఆశలలో ముంచెత్తాడు .ఇంకొక్క మాటలో చెప్పాలంటే రంగినేని కవితా లక్ష్యం శాంతి స్థాపన. ఆయన అశాంతికి మూలకారణాలను వెతికాడు. వాటిని ఎలా పార దోలాలో  ప్రబోధించాడు. శాంతిని సుస్థిరం చేయడానికి కవిత్వ దీక్ష చేపట్టిన శాంతిదూత సుబ్రహ్మణ్యం.

రంగినేని కవితా  సంపుటాలకు ముందుమాట రాసిన కవి పండితులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు."నేటి సమాజంలోని అశాంతిని, అవినీతిని నిర్మూలించాలన్న ఆకాంక్ష ప్రతి ఖండికలో కాన వస్తుందని" గడియారం రామకృష్ణ శర్మ గారు రాశారు.

"సాధన సత్యాన్వేషణ లక్ష్యం స్వార్థాన్ని సమాధి చేసి శాంతి కన్నుల నెల వెన్నెల క్రాంతి గీత ఆలాపన "అని సి. నారాయణ రెడ్డి గారు రాశారు.
"శాంతి కన్నుల నెల వెన్నెలలో క్రాంతి గీతాన్ని ఆలపించుటే "రంగినేని కవితా లక్ష్యమంటూ ఎస్వీ రామారావు గారు సెలవిచ్చారు.

రంగినేని వచన కవిత్వంలోని వస్తువులుగా అన్యాయం, అవినీతి, దుర్మార్గం, దౌర్జన్యం, దోపిడి , శాంతి, ప్రేమ, పట్టుదల మొదలైనవి కనపడతాయి. అక్కడక్కడా ప్రణయం కూడా ఉంది.  సినారె, దాశరథి , విశ్వనాథ వంటి మహాకవుల గొప్పతనం కూడా ఈ సంకలనంలో కవితా వస్తువులు అయినవి .

ఈ సాహితీ సర్వస్వంలో రంగినేని రాసిన నాలుగు కవిత్వ సంపుటాలున్నవి.  అవి సితపుష్పమాల, జీవన హేల,  మనసు గీచిన చిత్రాలు, తూర్పు కనులెర్ర చేస్తే..

సిత పుష్పమాలలో వైరుధ్య భావాలు కనబడతాయి.
"అలసిన నా హృదయంలో
అపజయాల వాసనలే
అన్యాయపు ఖడ్గధార కర్పించితి నా బ్రతుకును"
అని వేదన చెందిన రంగినేని సుబ్రహ్మణ్యం
"పతనమయ్యే నీ బ్రతుకున
పూలవాన కురిపించదు
కన్నీటి సానుభూతి
కనపరచదు ఈ లోకం"
అంటూ సాటి మనుషుల తీరును ఎరుక పరుస్తాడు.  కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా దానిని ఎదుర్కోవాలి తప్ప చింతించి చింతించి పాతాళానికి పోకూడదు. అలా పోతే సమాజం నిన్ను పట్టించుకోదు. నీకోసం ఒక కన్నీటి చుక్క కూడా రాల్చదు. అయ్యో !పాపం... అనే వాక్యాన్ని కూడా ఉచ్చరించదు అనే హెచ్చరిక ఉంది.

కవి పేరుతో ఉన్న కవితలో రంగినేని కవి కులానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. కుంగిపోయిన జాతికి అండగా నిలవాలని కవులను అభ్యర్థిస్తున్నాడు. మోసగాళ్ల కబంధ హస్తాల్లో నలిగిపోయిన అభాగ్య సోదరులకు ఆపన్న హస్తాన్ని అందించమని పిలుస్తున్నాడు.  సాటి వారి బాధలను తీర్చడానికి నడుము కట్టమని, సామ్యవాదం శక్తితో ముందుకు సాగమని బోధిస్తున్నాడు. తెలుగుజాతి వెలిగిపోవాలని స్వచ్ఛ కోరికను కోరుకుంటున్నాడు.

వ్యధిత హృదయ కవితలో కవి వేదన ఉంది.  అయితే ఇందులోని వేదన వైయక్తికము కూడా కావచ్చు లేదా పూర్తి కవి కులానిది కావచ్చు.  న్యాయం ధర్మం నీతి నిజాయితీలను కవి అంధకార జగతిలో, స్వార్థపూరిత ధరణిలో, ద్వేషపూరిత వసుధలో వెతుకులాడాడు. ఫలితం అందరూ ఊహించిందే.   కవితో పాటు ఆయన కలం కూడా నిలువెల్లా గాయాలపాలైనది... ఈ పని చేసింది ఎవరు అన్న ప్రశ్నకు కవితలోనే జవాబు దొరుకుతుంది. వారు జ్ఞానం తెలియని మూర్ఖులు.  కామం నిండిన అమరులు,  క్రోధం పండిన దానవులు, స్వార్థం ఉండిన శ్రీ పతులు. హెచ్చు స్థాయిలో ఉన్న కామక్రోధాలకు నిండిన, పండిన పదాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. తీవ్రమైన దుర్మార్గాన్ని అవి తెలుపుతున్నాయి.

"వాడి చేతిలో పడ్డ ఏ మానవుని తనువుకైనా పల్లేరు కాయలు కుచ్చుకోవాల్సిందే
గుండెలకు సూదుల  ఈటెలు దిగబడాల్సిందే"

సమాజంలో ఉన్న దుర్మార్గం మనిషిని ఏ విధంగా కుళ్లబొడుస్తుందో  ఈ కవిత తెలుపుతుంది.  ఈ కవిత లోని ప్రతి అక్షరం దిగాలు పడింది. భయానకంగా ఏడ్చింది. పిరికితనంతో నవ్వింది. అంతులేని ఆవేదన చెందింది.  గుండె పగులకొట్టుకున్నది. " నేను ఉన్నానని అనిపించుకో"  కవితలో రంగినేని దేవుడిపైకి ప్రశ్నలను శరపరంపరగా వదిలాడు .బాధ్యతను విస్మరించి కులుకు తున్నావు అంటూ ఘాటుగా విమర్శించాడు. ఇందులో వ్యాజస్తుతి ఏమీ లేదు. పాపపు పరిపాలకుల   మాయలో పడ్డ దేవుడికి మెలకువ గీతం పాడుతున్నాడు.  లోకంలో నెలకొన్న అశాంతికి, మోసకారి తనానికి, కుటిలత్వం, కుతంత్రాలకు అవినీతికి  దేవుడైన వాడే చుక్కానై దారి చూపిస్తున్నాడని తీవ్రమైన అభియోగాన్ని కవి మోపుతున్నాడు.

దుర్మార్గాలకు పహారా కాస్తున్నాడంటూ దేవుడిని నిందిస్తున్నాడు. ఇదే సందర్భంలో దరిద్రాన్ని దూరంచేసి నేనున్నానని అనిపించుకో అని హితవు పలుకుతున్నాడు.

అన్నార్తుల హృదిలో శాంతిని విభజించమని అప్పుడే వారు దేవుడున్నాడని అంటారని పరమాత్మకు గుర్తు చేస్తున్నాడు.  "కొత్త సృష్టి"  కవితను చదువుతున్నప్పుడు సమాజం నుండి రంగినేని ఏమి కోరుకుంటున్నారో తెలుస్తున్నది.  మనుషులు ఎలా ఉండాలని ఆయన ఆశించాడో తేటతెల్లమవుతుంది. ఆయన  స్వచ్ఛమైన సమాజాన్ని ఆశించాడు.
మానవుడంటే దానవత్వం గుహను వీడి, మానవత్వ శిఖరం ఎక్కిన వాడని చీకటి ప్రపంచంలో అమృత రస వాహినులను వెలయించిన వాడని, కొన  ప్రాణంతో  కొట్టుమిట్టాడుతున్న వానికి ఊపిరి పోసే వాడని రకరకాల నిర్వచనాలు ఇచ్చాడు .  ఇలాంటి వాళ్ళ వల్లే కొత్త సృష్టి సాధ్యమని తేల్చిచెప్పాడు.  శాంతి అంటే రంగినేనికి చాలా ఇష్టమని  ఈ సర్వస్వం ద్వారా మనకు తెలుస్తున్నది. రంగినేని సుబ్రహ్మణ్యం కవితా సర్వస్వాన్ని ముద్రించిన వారి కుటుంబ సభ్యులకు యావత్ తెలంగాణ కవి సమాజం అభినందనలు తెలియజేస్తున్నది. 

click me!