గోపగాని రవీందర్ కవిత : ప్రజాకవి కాళోజీ..!

By telugu teamFirst Published Sep 9, 2021, 3:12 PM IST
Highlights

ప్రజాకవి కాళోజీ 107వ  జయంతి సందర్భంగా లక్సెట్టిపేట నుండి గోపగాని రవీందర్  రాసిన కవిత ' ప్రజాకవి  కాళోజీ..!' ఇక్కడ చదవండి.

ఒక నిర్విరామ పోరాటానికి
నిలువెత్తు రూపమతడు
దీనావస్థలో మగ్గుతున్న
వాళ్ళకు  దారి దీపమతడు
రాజ్య పోకడను ప్రశ్నించిన
ఉద్యమ కెరటమతడు..!

నిర్భంధాలను ధిక్కరించిన
సమరోత్సాహమతడు
అన్యాయాలను సహించని
ప్రజా నాయకుడతడు
సామాన్యుల మధ్య నడయాడిన
అసామాన్యమైన ధీరోదాత్తుడతడు..!

వేదనల వంటి కథల్లో 
అగ్నికణాల వంటి కవితల్లో 
ఉద్వేగభరతమైన గేయాల్లో 
ఉన్నదున్నట్లుగా చెప్పే ప్రసంగాల్లో
నిత్యచైతన్యమై ప్రవహిస్తాడతడు
నిజాం నిరంకుశత్వ పాలనపై
గళమెత్తిన కవన యోధుడతడు..!

బడి పలుకుల భాష కాదు
పలుకుబడుల భాష కావాలని
అహర్నిశలు కృషిచేసిన 
భాషోద్యమకారుడతడు
నేను గిట్లనే మాట్లాడతానని
పిడికిలెత్తిన వేగుచుక్కతడు
నా గొడవతో మనందరిలో
స్ఫూర్తిని రగిలించిన ధీరుడతడు..!

అణగారిన వర్గాల పక్షాన
నినాదమైన ఊపిరి పాటతడు
ఒక్క ఊపిరి తిత్తితోనే
ఎనమిది దశాబ్దాలు శ్వాసిస్తూ
వెనుకడుగు వేయని 
ఉద్యమకారుడతడు..!

వైవిధ్యభరితమైన 
పాఠ్య పుస్తకమతడు
హక్కుల సాధనకై
అవిశ్రాంత పథికుడతడు
అతడంటే మరెవరో కాదు
తెలంగాణ భాషా వికాసంకై
సమర గీతమైన
ప్రజాకవి కాళోజీ..!

click me!