ఊరంటే కువకువమంటూ పల్లవించే పాటల పిట్ట అంటూ కవి అవనిశ్రీ చెప్తున్నారు తన కవితలో.
ఊరంటే నాల్గు పాడుగోడులు
ఎనిమిది పందిరి గుంజలు
బొడ్రాయి పొలిమేర రచ్చబండ చెరువుకట్టలాంటి
బండగుర్తులు కాదు.
నీ చివరి కోరిక చెప్పమని ఎవరైన అడిగితే
ఓపారి నా ఊరిని చూపించమనీ
అడిగేటంతటి చెదరని జ్ఞాపకమది.
ఊరంటే
పొద్దున కొట్లాడి మాపుకు మరిసిపోయి
ఒకటే కంచంలో
బువ్వతినేటంతటి కలుపుగోలుతనం.
ఊరు ఉత్తమాటల గంపగుత్తకాదు
పొద్దు పొడవగానే
కువకువమంటూ పల్లవించే పాటల పిట్ట.
ఊరంటే
నిండుగా పారే వాగులో దుంకి
చెరువుగట్టుమీద
రేలపాటకు ఎగిరిగంతేసేటంతటి ఆనందం.
ఊరంటే
అడ్డ బాటలెంట నడిసొస్తుంటే
సేన్ల నడ్మ కూతేసి చేయ్యేత్తి
పల్కరించే పలవరింతల ప్రేమ.
ఊరంటే అన్ని కులాలు ఏకమై
వాయివరుసలతో ఆడ్సాడి
అలాయి బాలాయిగా బత్కి
నాల్గొద్దులు బట్టకట్టడమే.
ఊరంటే
రచ్చకట్టమీద గుండెపై చెయ్యేసుకొని
దర్జాగా పడుకున్న
ఎందుకు పడుకున్నవనీ
అడగలేనంతటి గొప్ప నమ్మకం.
ఊరంటే
అమాస అద్దమరాత్రి కూడా
బెరుకు లేకుండా
ఊరంత గసగొట్టే ధైర్యం.
ఊరంటే
కారం మెత్కులు తినైన
కమ్మగా బత్కును ఎల్లదీయడమే.
ఊరంటే
మాయిగుంత నుండి సావుగుంతదాకా
సాగేటి సుదీర్ఘ పయనం.
మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature