అయోధ్యారెడ్డి తెలుగు కథా సాహిత్యంలో పేరెన్నిక గన్న రచయిత. ఆయన హారుకి మురకామి అనే రచయిత కథను తెలుగులోకి అనువాదం చేశారు. ఆ కథను చదివి ఆస్వాదించండి.
మూలరచన: హారుకి మురకామి
డిసెంబర్ నెలలో ఓ రోజు ఉదయం. వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. టోక్యోలో హరుజుకు శివారులోని ఒక చిన్న వీధిలో మెల్లగా
నడుస్తున్నాను. అట్లా వెళుతూ మలుపు తిరుగుతుంటే పక్కన ఒక మెరుపు మెరిసి నన్ను ఉలికిపడేలా చేసింది. వందకు వంద శాతం మార్కులు
పొందగల పరిపూర్ణ అమ్మాయి ఒకరు నన్ను దాటుకొని వెళ్లింది.
నిజం చెప్పాలంటే ఆమె స్టన్నింగ్ బ్యూటీ ఏం కాదు. ఆ మాటకొస్తే అసలు అందగత్తెల జాబితాలోకే రాదు. ఆమె వేసుకున్న బట్టలు గొప్పవేం కాదు. వస్త్రధారణ కూడా ఏమాత్రం ప్రత్యేకత లేకుండా సీదాసాదాగా ఉంది. పొద్దున నిద్రలేచాక కనీసం తల కూడా దువ్వుకున్నట్టు లేదు. వెనుక భుజాల మీదుగా జారిన జుట్టు చిక్కులు చిక్కులుగా, చిందర వందరగా ఉంది.
ఆమెది చిన్నవయసేమీ కాదు. బహుశా ముప్పయి దాటిపోయి వుంటాయి. వాస్తవానికి ఆమె 'యువతి' కి సమీపంలో కూలేదు. కానీ నేనామెకు యాభైగజాల దూరంలో ఉన్నా ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. మొదటి చూపులోనే గ్రహించాను..ఆమె నాకు 100% ఈడు జోడైన అమ్మాయి. ఆమెను చూసిన మొదటి క్షణంలో నా గుండె ఉద్వేగ చలనాలు పెరిగాయి. రెట్టింపు వేగంతో కొట్టుకుంది. ఎడారిలో ఇసుక నమిలినట్టు నాలుక ఎండి పొడిబారి పోయింది.
అమ్మాయిల విషయంలో అందరి అభిరుచులు ఒకేలా ఉండవని నాకు తెలుసు. ఎవరి అభిప్రాయాలు, భావనలు వారికుంటాయి. ఒకరు ఆమె సన్నటి మృదువైన పాదాలను చూసి ఇష్టపడొచ్చు. మరొకరిని ఆమె విశాల నేత్రాలు లేదా సుకుమారమైన చేతి వేళ్లు ఆకట్టుకోవొచ్చు. ఒకమ్మాయి మీద మనసు పారేసుకునేందుకు నిర్దిష్టమైన కారణాలూ ప్రమాణాలూ అంటూ ఉండాలని లేదు. నీకు తెలియకుండానే ఆమెలో నిన్నేదో ఆకర్షించి ఆ తర్వాత ప్రతిక్షణం నీ మనసులో కదలాడుతూ ఆమె రూపం నిన్ను ఆక్రమించుకుంటుంది.
అఫ్ కోర్స్..! అమ్మాయిల విషయంలో నా ప్రాధాన్యతలు నాకున్నయి.
ఒక్కోసారి మనమేదైనా రెస్టారెంట్లో కూర్చొని ఉంటే ఎదురుగా రెండు టేబుళ్ల అవతల కాఫీ తాగుతూ ఒకమ్మాయి చప్పున ఆకర్షిస్తుంది. ఆ మరుక్షణం నుంచీ ఆమె నాకోసమే పుట్టిందని అనిపించవొచ్చు. దానిక్కారణం ఆమె సౌందర్యం మాత్రమే కాకపోవొచ్చు. కేవలం చేతిలోని కాఫీ కప్పును సుతారంగా స్పర్శిస్తున్న ఆమె అందమైన పెదాలు కావొచ్చు. లేదూ.. కొటేరు లాంటి ఆమె ముక్కు విపరీతంగా నచ్చడం కావొచ్చు. కేవలం చిరునవ్వు కావొచ్చు. కానీ నా అభిప్రాయంలో ఏఒక్కరూ తాము కోరుకుంటున్న 100% పరిపూర్ణ అమ్మాయి ముందుగా ఊహించుకున్నవిధంగానే ఉండాలన్న పట్టుదలతో ఉండరు.
నాకైతే నన్ను దాటుకొని వెళ్ళిన అమ్మాయి అందకత్తె కాకున్నా ఆమె ముక్కు బాగా నచ్చింది. కానీ ఆమె మొత్తం శరీరాకృతిపై ఒక స్పష్టత లేదు. ఎందుకంటే నేను చూసింది క్షణకాలమే. అందువల్ల మరిచిపోయాను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెపుతాను. ఆమె గొప్ప సౌందర్యవతి కాదు. సగటు అందం కూడా కాకపోవొచ్చు.
“నిన్న బజార్లో నడుస్తుంటే 100% ఈడు జోడైన ఒక అమ్మాయి నన్ను దాటుకుని వెళ్ళింది” ఒక మిత్రునితో చెప్పాను.
“నిజమా? ఆమె చూడ్డానికి ఎలా ఉంటుంది. చాలా అందంగా ఉంటుందా?”
“లేదు, ఆమె అసలు అందకత్తె కాదు”
“పోనీ నువ్వెప్పుడూ చెపుతూ వుంటావుగా.. అట్లాంటి నీ ఫేవరేట్ టైపా?”
“తెలియదు. అవునో కాదో స్పష్టంగా చెప్పలేను. నిజానికి ఆమె గురించి ఏ ఒక్క అంశమూ నాకిప్పుడు జ్ఞాపకం లేదు. కళ్లు.. మొహం.. వొంటి రంగు.. వక్షోజాల సైజులు..”
“ఆశ్చర్యమే”
“అవును ఆశ్చర్యమే. అంతేకాదు విచిత్రం కూడా”
నేనిట్లా చెపుతుంటే నా మాటలు వింటున్న మిత్రునికి బోర్ కొట్టినట్టుంది. అయినా విసుగు ముఖం మీద కనబడకుండా దాచుకుంటూ “మొత్తం మీద ఇంతకాలానికి నీకు తగిన 100% యువతి తారసపడిందన్నమాట. మరి అప్పుడు నువ్వేం చేశావు..? ఆ అమ్మాయిని ఫాలో అయ్యావా? పరిచయం చేసుకొని మాట్లాడావా..?” అడిగాడు.
“లేదు.. వీధిలో జస్ట్ ఎదురెదురైనం. క్షణంలో ఆమె నన్నుదాటుకొని వెళ్లింది. ఆమె తూర్పు వైపు నుంచి పశ్చిమ దిశలో వస్తున్నది. నేను పశ్చిమ నుంచి తూర్పు దిక్కుగా పోతున్నాను. నిజంగా అదొక అందమైన అనుభవమే కాదు, అందమైన ఉషోదయం కూడా”
నా మాటల్లో మిత్రుడు ఎప్పుడు వెళ్లిపోయిందీ చూడలేదు.
‘ఆమెతో పరిచయం చేసుకొని నిజంగానే మాట్లాడగలిగితే..!’
ఎక్కువసేపు కాదు, అరగంట చాలు. ఆమె గురించి వివరాలు తెలుసుకొని నాగురించి చెప్పాలనుకున్నా. అన్నిటికంటే ముఖ్యంగా విధి వైచిత్రిని గురించి ఆమెకు వివరించాలనుకున్నా. ఏప్రిల్ నెలలో ఒకరోజు అందమైన ఉషోదయాన హరజుకులోని ఇరుకు వీధిలో మనం ఎదురెదురుగా కలుసుకొని, చిన్న పరిచయం కూడా లేకుండా దాటిపోవడం విధి విలాసం తప్ప మరేమీ కాదని చెప్పాలనుకున్నా.
మా నడుమ పరిచయం జరిగుంటే సీను వేరుగా వుండేది. తీయతీయగా మాటలు కలిసి వుండేవి. ఇద్దరి మధ్యన చనువు పెరిగి, మా దూరాన్ని దగ్గరచేసి, ఈ లోకం శాంతికపోతమై విలసిల్లిన కాలంలో తయారైన ప్రాచీన గడియారంలోని పెండ్యులామ్ మాదిరి ఆడుతూ మామనసు పొరల్లో దాగిన నులివెచ్చని రహస్యాలన్నీటినీ తట్టి లేపివుండేదని తలపోశాను.
అట్లా చాలాసేపు ఇద్దరం ఊసులాడుకొని, మాటలు ముగిశాక మంచి రెస్టారెంట్లో చక్కటి లంచ్ చేసి, వీలైతే ఊడి అలెన్ సినిమా చూసి, సాయంత్రం హోటల్ బార్లో ఇద్దరికీ ఇష్టమైన కాక్ టైల్ సేవించి, తర్వాత నా అదృష్టం ఇంకేమైనా మిగిలివుంటే ఆ రాత్రి పక్కమీద ఆమెని మధురానుభూతుల నడుమ కరిగించి. ఇది అత్యాశ అనిపించవొచ్చు. కానీ ఆమాత్రం ఆశ పడటంలో తప్పులేదు.
నా 100% ఈడు జోడైన అమ్మాయి ఎదురుగా వస్తున్నది. అడుగులు మెత్తగా, వయ్యారంగా వేసుకుంటూ వొస్తుంది. ఏదో తెలియని తెగింపు నాగుండె గోడల్నితట్టింది. ఆమే.. నేనూ ఎదురెదురుగా నడుస్తూ. క్రమంగా దూరం దగ్గరవుతూ. మా నడుమ కేవలం పదిహేను గజాల వ్యత్యాసం. ఆమెను ఎట్లా పలుకరించాలి. అసలేం మాట్లాడాలి? ఆమెతో ఏం చెప్పాలి?
“గుడ్మార్నింగ్ మేడం.. మీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క అరగంట తీరిక చేసుకుంటారా”
డామిట్..! ఇట్లా అంటారా ఎవరైనా? ఇది హాస్యాస్పదంగా ఉంది. ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ చేసే అభ్యర్థనలా ఉంది.
“క్షమించాలి మిస్..! మీకీ చుట్టుపక్కల ఇరవై నాలుగు గంటలూ పనిచేసే డ్రై క్లినర్స్ షాపు తెలుసా?”
ఇదింకా దరిద్రంగా ఉంటుంది. నేనేం చంకలో బట్టలు పెట్టుకుని రాలేదుగా. పైగా ఆ వీధిలో అట్లాంటివి ఎందుకుంటాయి? ఉన్నా అమ్మాయికి వాటి గురించి ఏం పని. ఇంకేదైనా గొప్పగా ఆలోచించాలి. పోనీ ఇదంతా లేకుండా సింపుల్ గా, ముక్కుసూటిగా అసలు విషయం చెపితే సరిపోతుందిగా.
“గుడ్ మార్నింగ్ మిస్..! మీరు నాకు 100% ఈడు జోడైన అమ్మాయి అని నేను భావిస్తున్నా”
ఈ మాట ఆమె నమ్మకపోవొచ్చు. ఒకవేళ నమ్మినా నాతో మాట్లాడేందుకు ఇష్టం ఉండక పోవొచ్చు.
“సారీ” అని పుల్ల విరిచినట్టు చెప్పేసి వెళ్లిపోవచ్చు. లేదా “ నేను మీకు 100% తగిన అమ్మాయినైతే కావొచ్చు. కానీ మీరు నాకు 100% పరిపూర్ణ జోడీ మాత్రం కాదు” అని ముఖం మీద గుద్దినట్టుగా చెప్పొచ్చు.
నిజమే.. అట్లాగే జరగొచ్చు. కొద్దిక్షణాల పాటు ఆ సిచ్యుయేషన్లో నన్ను ఊహించుకున్నాను. అట్లా జరిగుంటే నా మనసు ముక్కలు ముక్కలై ఉండేది. ఆమె మీద కోపగించుకోలేక, రోషపడనూ లేక, నాలోనేను గింజుకొని, కుంచించుకొని, ఆ షాక్ నుంచి తెరుకునేందుకు ఎంతసేపు పట్టేదో. అసలు ఏప్పటికీ కొలుకొనేవాణ్ణి కూడా కాదేమో.
నాకు ముప్పయి మూడేళ్లు. పెళ్లీడు మెల్లగా దాటిపోతూ నిరాశగా గడుస్తున్నకాలం. నడివయసు మెయిన్ గేట్లో అనుమతి కోసం
నిలబడి ఉన్నాను. ఒక పూల దుకాణం ముందు మేము దగ్గరై ఎదురుపడ్డాం.. దాటిపోయాం. ఆమె నన్ను దాటిపోతున్నప్పుడు ఒక సన్నటి గాలితెర గోరువెచ్చనై నా చర్మాన్ని స్పర్శించి పొయింది. కాళ్ల కింద బురుద నేల తివాచీ పరిచినట్టుగా ఉన్నది. చుట్టూ పర్యావరణం గులాబీల సుగంధాన్నినింపుకొని నా నాసికాపుటాలను ఉల్లాసపరిచింది.
ఎన్నెన్నో ఊహించుకున్ననేను తీరా ఆమె దగ్గరైనవేళ ధైర్యం చేసి పలుకరించలేక పోయాను.
ఆమె తెల్లటి స్వెటర్ వేసుకుంది. కుడిచేతిలో ఒక పొడవాటి బ్రౌన్ పేపరు కవరుంది. దానిపైన స్టాంపులు అంటించి లేవు. బహుశా పోస్టాఫీసుకు వెళుతుందేమో. అంటే ఆమె ఎవరికో ఉత్తరం రాసిందన్నమాట. ఎవరికి రాసివుంటుంది? బహుశా ప్రేమికునికి కావొచ్చు. అది రాసేందుకు రాత్రంతా మెళుకువతో కూర్చుని, నిద్ర ఆవహిస్తున్న కళ్ళను బలవంతంగా తెరిచివుంచి.. బాగా అలసిపోయి. ఆమె ప్రతి రహస్యమూ ఆ కవర్లో నిక్షిప్తమై ఉండొచ్చు.
మరికొన్ని అడుగులు ముందుకు వెళ్ళాక ఒకసారి వెనుదిరిగి చూశాను. ఆమె మరి కనిపించలేదు. జనంలో కలిసిపోయి కనుమరుగైంది. ఆమెకు స్పష్టంగా ఏం చెప్పివుండాల్సిందీ నాకిప్పుడు బోధపడుతున్నది. అట్లా నా మనసులో వున్నది వున్నట్టు వివరంగా చెప్పివుంటే అది నిజంగానే పెద్ద ప్రసంగం అయివుండేది. వినేవాళ్ల సంగతి అటుంచితే చెపుతున్న నాకది మరింత సుదీర్ఘమై ఉండేది. నాలో కదిలిన ఆలోచనలేవీ వాస్తవానికి ఎప్పటికీ ఆచరణ సులభం కాదు. అట్లా జరిగివుంటే నాకథ “ అనగనగా..” అంటూ మొదలై “ నిజంగానే ఇదొక విషాదాంత కథ కదూ..” అనిపిస్తూ ముగిసేది.
అనగనగా ఒక ఊళ్లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి ఉండేవాళ్లు. అబ్బాయికి పద్దెనిమిది, అమ్మాయికి పదహారేళ్లు. అతడు అందమైన వాడెమీ కాదు. అలాగే ఆమె ప్రత్యేకించి చెప్పుకునేంత అందగత్తె కాదు. వాళ్ళూ అందరిలాంటి వాళ్లే. ఏ ప్రత్యేకతలు లేవు. కేవలం ఒక సాధారణ ఒంటరి అబ్బాయి, మామూలు ఒంటరి అమ్మాయి అంతే. కానీ వాళ్ళిద్దరూ ఎవరికివారే ఈ లోకంలో ఎక్కడోచోట వందశాతం తనకు తగిన అబ్బాయి ఉండే వుంటాడని అమ్మాయి, అట్లాగే.. ఎక్కడో ఒకచోట వందశాతం పరిపూర్ణ అమ్మాయి ఉండే వుంటుందని అబ్బాయి.. మనస్ఫూర్తిగా నమ్ముతూ వొచ్చారు. అంతేకాదు, ఎప్పటికైనా అద్భుతం జరిగి తామిద్దరూ కలుసుకుంటామని కూడా విస్వాసంతో వుండేవారు.
నిజానికా వాళ్లనుకున్న అద్భుతం జరుగనే జరిగింది. ఒకరోజు వీరిద్దరూ ఒక వీధి మలుపులో తారసపడ్డారు.
“ఇదొక అద్భుతం, నాకు చాలా సంతోషంగా ఉంది” అతనన్నాడు.
“నా జీవితమంతా నీకోసమే వెతుక్కుంటూ ఎదురుచూస్తున్నా. నువ్విది నమ్మకపోవొచ్చు. కానీ నేను చూస్తున్న 100% నాకు ఈడు జోడైన అమ్మాయివి నువ్వే”
“నువ్వు కూడా..” అమ్మాయి అతని వంక చూస్తూ అన్నది. “ నేను అన్వేషిస్తున్న100% నాకు తగిన అబ్బాయివి నీవే. అచ్చం నేను ఊహించుకున్నట్టుగానే వున్నావు. నిజంగా నాకిది ఒక కల మాదిరి వుంది.”
ఇద్దరూ పార్కులోకి వెళ్లి ఒక బెంచి మీద కూర్చున్నారు. చేతిలో చెయ్యేసుకొని. గంటల తరబడి ప్రపంచాన్ని మరిచిపోయి పరస్పరం ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నారు. వాళ్లిప్పుడు ఒంటరి కాదు. వాళ్లని వాళ్ళు తెలుసుకున్నారు. ఒకరికొకరు వందశాతం పరిపూర్ణ భాగస్వాములుగా గుర్తించుకున్నారు. నీకు 100% ఈడుజోడైన అమ్మాయి దొరకడం, అలాగే నువ్వామెకు 100% తగిన అబ్బాయి కావడం గొప్ప సంగతి కదా.
కానీ జరిగింది. నిజంగా ఇది అద్భుతం. ఒక విశ్వంతరాల విచిత్రం.
అయితే వాళ్లు ఏకాంతంలో కూర్చొని ఊసులాడుకుంటున్న వేళల్లో అప్పుడప్పుడూ ఇద్దరి మనసుల్లో పల్చటి తెరల్లాంటి అనుమానాలు కలుగుతుండేవి. జీవితంలో ఒకరు కన్నకలలు ఇంత సులువుగా సాకారం కావడం నిజమేనా..? ఇట్లా జరగడం ఇది సరైనదేనా? ఇద్దరి మనసుల్లోనూ చిన్నచిన్న సందేహలు. తెలియని ఒక ఊగిసలాట. వాళ్ల సంభాషణల్లో ఇవి వ్యక్తమయ్యేవి. చివరికి వాళ్ళో నిర్ణయానికొచ్చారు.
“ఇందుకు మనమో పరీక్ష పెట్టుకుందాం. మన ప్రేమబంధం ఆ పరీక్షకు నిలబడుతుందో చూద్దాం. ఆవిధంగా మన ప్రేమ గాఢతను
నిర్ధారణ చేసుకుందాం. మనం ఒకరికొకరం 100% తగిన ప్రేమికులమనేది వాస్తవమే అయితే, మనం భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఒకచోట తప్పకుండా మళ్ళా కలుస్తాం. అది జరిగితే మనిద్దరిదీ నిస్సందేహంగా వందశాతం పరిపూర్ణమైన జంట అని నిరూపణ అయినట్టే” అబ్బాయి అమ్మాయికి వివరించి చెప్పాడు.
“ఈ ఆలోచన బాగుంది.. మనం అలాగే చేద్దాం..” ఆమె కూడా మనస్ఫూర్తిగా ఒప్పేసుకుంది.
అట్లా అనుకున్నతర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. ఆమె తూర్పు దిశగా, అతడు పశ్చిమ దిశగా.
వాస్తవానికి ఇది ఒకరకంగా మూర్ఖత్వమే. ప్రేమకు వాళ్లు పెట్టుకున్నపరీక్ష ఏమాత్రం అవసరం లేదు. అసలు వాళ్లు దానికి సిద్ధపడాల్సిందే కాదు. ఎందుకంటే వాళ్లు నిజంగానే సంపూర్ణ ప్రేమికులు. ఒకరికొకరు 100% ఈడు జోడైనవాళ్ళు.
కానీ విధి అనేది ఒకటుంది. దానికి ఇదంతా తెలియదు కదా. అందుకే వాళ్లు ఒకటి తలిస్తే.. విధి మరోటి తలచింది. ఫలితంగా.. వాళ్ళు జీవితంలో మరెప్పుడూ కలుసుకోలేక పోయారు. ఇది కోరి తెచ్చుకున్న వియోగం. వాళ్లు నిజానికి చిన్నవాళ్ళు. అప్పుడప్పుడే యుక్తవయసులో కొచ్చారు. అందుకే ఈ పరీక్ష కారణంగా తాము మళ్లీ కలుసుకోలేక పోవచ్చునన్న ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. కాలం దయారహితంగా వాళ్ళని విడదీసింది. ఇద్దరూ తలో కెరటం మీదా కొట్టుకుపోయేలా చేసింది.
ఆ తర్వాత ఒక ఏడాది నడి శీతాకాలంలో విచిత్రమైన విధంగా అబ్బాయి ఒకచోటా, అమ్మాయి మరోచోటా ఇరువురూ తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా బారిన పడ్డారు. అట్లా ఎన్నో వారాలు చావు బ్రతుకుల నడుమ కొట్టుమిట్టాడి ఎట్టకేలకు జబ్బు నుంచి బయటపడ్డారు.
కానీ ఆ జబ్బువల్ల ఇద్దరూ తమ పాత జీవితాన్నీ.. జ్ఞాపకాలనూ మరిచిపోయారు. వాళ్ళు పూర్తిగా కోలుకునేటప్పటికి మస్తిష్కాలు శూన్యమై, చిన్నతనంలో డి.హెచ్.లారెన్స్ పిగ్గీ బ్యాంకు బేలెన్స్ మాదిరి ఖాళీ అయిపోయినయి.
అయితే పాత జ్ఞాపకాలు మరిచిపోయినా శారీరకంగా వాళ్లు త్వరగానే కోలుకున్నారు. పట్టుదల, సంకల్పం, వాళ్లని తిరిగి జనజీవన స్రవంతిలో పూర్తిస్థాయిలో కలిసిపోయేలా చేసింది. వాళ్ళు తమ బతుకులేవో తెలుసుకున్నారు. తమ పనులు ఎవరి సాయమూ లేకుండా స్వయంగా చేసుకునే అర్హత సాధించారు. చిత్రంగా వాళ్లకు అప్పుడప్పుడూ కొత్తగా ప్రేమభావనలు కూడా కలుగుతున్నాయి. ఆ భావనలు నూటికి నూరు శాతం పరిపూర్ణ స్థాయిలో అనలేము కానీ, కొన్నిసార్లు 75 శాతం మేరకు.. ఇంకొన్నిసార్లు మరింత ఎక్కువగా 85 శాతం మేరకు కలుగుతూ వచ్చినయి.
కాలచక్రం వడివడిగా, నిర్మొహమాటంగా పరుగులు తీస్తూనే ఉన్నది. చూస్తుండగానే అబ్బాయికి ముప్ఫయి మూడేళ్లు, అమ్మాయికి ముప్పయేళ్ల వయసొచ్చింది. ఏప్రిల్ నెలలో ఒకరోజు అందమైన ఉషోదయాన చక్కటి కాఫీతో ఆదినాన్ని ప్రారంభిద్దామనకున్న అబ్బాయి రోడ్డుమీద పశ్చిమవైపు నుంచి తూర్పువైపు ఉల్లాసంగా నడుస్తున్నాడు. అదే సమయానికి పశ్చిమ వైపు నుంచి తూర్పుకు అమ్మాయి వెళుతున్నది. వీధి మధ్యలో ఇద్దరూ ఎదురెదురయ్యారు. అలాగే ఒకరినొకరు దాటిపోయారు.
ఇద్దరూ సమాంతరంగా, దగ్గరగా వొచ్చిన ఒక్క క్షణకాలంలో ఎక్కడో ఆంతరంగ పొరల మాటున మరుగుపడ్డ జ్ఞాపకం మెరుపులా మెరిసి అస్పష్టమై మాయమైంది. ఇద్దరూ ఉద్వేగంతో వొణికారు. గుండెలో ఏదో గాయాన్ని కెలికిన బాధ. విలువైనది కోల్పోయిన వెలితి. ఇదంతా మిణుగురు చమక్కులా క్షణకాలమే. ఆమె తనకి 100% పరిపూర్ణ జోడీ అని అతనికి తెలుసు.. అతడు తనకు నూరు శాతం జోడైనవాడని ఆమెకూ తెలుసు. ఇదంతా ఎక్కడో మనసు మూలల్లో లిప్తపాటులో కదిలిన భావన. ఎందుకంటే వాళ్ల జ్ఞాపకాలు ఇప్పుడు చాలా బలహీనం.
పధ్నాలుగేళ్ల క్రితం నాటి ఘటనల్ని మననం చేసుకునేంత స్పష్టత వారి ఆలోచనల్లో లేదు. అందుకే ఒక్క మాటైనా మాట్లాడుకోకుండా ఒకరినొకరు దాటుకొని వెళ్లిపోయారు. మరెప్పుడూ కనబడలేని విధంగా జనస్రవంతిలో కలిసిపోయారు.
“ఇప్పుడు చెప్పండి.. ఇదో విషాదాంత, ఆవేదనభరిత గాధ అనిపించడం లేదూ?”
అవును.. నిజంగా విషాదమే కాదు, దయనీయం కూడా. ఇదామెకి చెప్పివుండాల్సింది కదూ.
రచయిత పరిచయం
జపాన్ సాహితీ దిగ్గజం హరుకి మురకామి (మురాకామి హారుకి) అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ గలిగిన రచయిత.
రెండో ప్రపంచ యుద్ధానంతరం 1949 క్యోటోలో జన్మించిన మురకామి కథకుడు. నవలాకారుడు. వ్యాసకర్త. అనువాదకుడు. నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సృజన చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన నవలలు 60కి పైగా భాషల్లో అనువదించబడి మిలియన్ల కాపీలు అమ్ముడవుతూ అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్లుగా ఉన్నయి,
మురకామి బాల్యం నుండి పాశ్చాత్య, రష్యన్ సాహిత్యం వల్ల ఎక్కువ ప్రభావితమయ్యారు. ఫ్రాంజ్ కాఫ్కా, గుస్టావ్ ఫ్లాబెర్ట్, చార్లెస్ డికెన్స్, కర్ట్ వొన్నెగట్, దోస్తోవస్కీ, రిచర్డ్ బ్రాటిగాన్, జాక్ కెరోవాక్ వంటి రచయితలను విస్తృతంగా చదివారు. ఈ పాశ్చాత్య ప్రభావాలు మురకామిని ఇతర జపనీస్ రచయితల నుండి వేరు చేస్తాయి. రియలిజం, సర్రియలిజం, మేజికల్ రియలిజం, పోస్ట్ మాడర్నిజం, బిల్డంగ్‌స్రోమన్, పికారెస్క్యూ జోనర్స్ లో రచనలు చేశారు.1991 తర్వాత ఆయన ధోరణి మారింది. తన రచనల్లో నిర్లిప్తతను నిబద్ధతగా మార్చుకున్నానని స్వయంగా చెప్పుకున్నారు. ప్రారంభ రచనలు వ్యక్తి చీకటిలోంచి జనిస్తే, తరువాతి రచనలు సమాజంలోని చీకటిని వెలికితీస్తూ సాగినయి. స్టేడియంలో బేస్ బాల్ ఆటను చూస్తూ ప్రేరణ పొంది రాసిన తన మొదటి నవల “హియర్ ది విండ్ సింగ్” తో అంతర్జాతీయంగా ఆయన పేరు మార్మోగిపోయింది. మురకామి పలువురు ప్రసిద్ధ రచయితల పుస్తకాలను జపనీస్ భాషలోకి అనువదించారు. పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనకు లభించాయి. వరల్డ్ ఫాంటసీ అవార్డు, యోమోరీ అవార్డు, ఫ్రాంక్ ఓకానర్ ఇంటర్నేషనల్ షార్ట్ స్టోరీ అవార్డు, ఫ్రాంజ్ కాఫ్కా బహుమతి, జెరూసలేం బహుమతి, ఏషియన్ లిటరరీ అవార్డు, న్యూయార్క్ టైమ్స్ అవార్డు తదితర పలు పురస్కారాలు అందుకున్నారు. మురకామి రచనల్లో హియర్ ది విండ్ సింగ్, పిన్ బాల్, ఎ వైల్డ్ షీప్ ఛేజ్, నార్వేజియన్ ఉడ్, ది విండ్ అప్ బర్డ్ క్రానికల్, స్పుత్నిక్ స్వీట్ హార్ట్, , కాఫ్కా ఆన్ ది షోర్ నవలలు; ఆఫ్టర్ ది క్వెక్, ది ఎలిఫెంట్ వానిషెష్, మిస్టీరియస్ టోక్యో, స్లీపింగ్ ఉమన్, బర్త్ డే స్టోరీస్ కథా సంపుటాలు ముఖ్యమైనవి.
ఆయనకు బాగా పేరుతెచ్చిన కథ “100% పర్ఫెక్ట్ గర్ల్”కు ఇది నా అనువాదం.