మతం పేరున అవమానించ బడతున్న ముస్లిం మహిళలకు మద్దతుగా హైదరాబాద్ నుండి జ్వలిత రాసిన కవిత "మత్తు ఎక్కడం లేదు" ఇక్కడ చదవండి
ప్రశ్నలకు భయపడే భీరువుల్లారా
పితృస్వామ్యం పీఠం కదులుతుందనే కదా
మీ భయమంతా
స్తన్యం కుడవని సన్నాసులెవరురా...
బుల్లీబాయ్ పిల్లిగంతులేస్తున్నది
ఇప్పుడు అమ్మలకు మతం మత్తు కిక్కు ఎక్కడం లేదు
ఇది ఐక్యతను కత్తిరించే ఎత్తుగడేనని తెలిసింది వాళ్ళకు
'భస్మాసుర హస్తాల' కథలో
అసలు మోసం కూడా తెలిసింది
'వేలు' ఎవ్వరిదైనా మా కంటి దాకా రానివ్వము
నీ వెకిలివేషాలను ప్రపంచ పటం మీద గీసుకొని
పంచ తడుపుకునే నీ పిరికితనం సాక్షిగా
ప్రశ్నలను అలంకరించుకునే చెల్లెళ్ళను
అధికారాన్ని అనుభవిస్తున్నాము అనుకునే అక్కలను
చికిత్సించి మత్తుదించి మందల కలపినంక
స్త్రీలంతా ఒక్కటేనని చాటుతాం.