ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆచార్య వెలుదండ నిత్యానందరావు సాహిత్య కృషి అమూల్యమైంది. ఆయన సాహిత్య కృషిపై దత్తాత్రేయ శర్మ రాసిన వ్యాసం చదవండి.
జిజ్ఞాస, అభిరుచి, పాండిత్యాల మేలు కలయికల ఫలితం ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి పరిశోధన. పేరుకు తగ్గట్టుగా నిత్యానంద రావు నిత్య విద్యార్థి. తాను చదివిన తన దృష్టికి వచ్చిన ప్రతిరచనను ఆసాంతం చదివి సాహిత్య రసానందాన్ని తాను అనుభవించి, దాన్ని లోకానికి పంచడం ఆయనకు పెన్నుతో (వెన్నతో) పెట్టిన విద్య. ఈ అలవాటే ఎన్నో కావ్యాలపై, సాహిత్య పరిశోధన వ్యాసాలపై, విశిష్ట వాఙ్మయ మూర్తులపై వందలాది విమర్శనాత్మక వ్యాసాలుగా ప్రకటితమైంది. సాహిత్యేతర అంశాలను చారిత్రకంగా అపూర్వంగా పరిశీలించి రాయడంకూడా ఆయన నిర్ణిద్ర పరిశ్రమకు నిదర్శనం. పరిశోధనా చక్షువైన ఆయన మూడుతరాల సాహితీ విమర్శకుడిగా విఖ్యాతి గడించాడు. తనకన్నా ముందుతరంవారైన నిడిదవోలు వెంకట రావు, జీవీ సుబ్రహ్మణ్యం, ఎస్వీ రామారావు, అక్కిరాజు రమాపతిరావు, ఆరుద్ర మొదలైన వారి స్ఫూర్తి తో తనతరానికేకాక భావి పరిశోధకులకూ మార్గదర్శిగా మారాడు.
నిత్యానంద రావు రచనలో విమర్శకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో ఉపయుక్త గ్రంథాలు, వ్యాసాలు చదివి కావలసిన విపులమైన విషయ సేకరణకు పూనుకుంటాడు. పూర్వకాలపు పీఠికలు పుస్తక సమీక్షలకోసం నాటి భారతీ పత్రికలన్నీ కూలంకషంగా అధ్యయనం చేయడమేకాదు వాటి ఫోటోకాపీలన్నీ తీసి దాచుకున్నాడు. ఇంటినే పుస్తకాలయంగా మలచుకొన్నాడు.పరిశోధన ఆయన వ్యసనం. రచన ఆయనకు అశనం.(ఆహారం). దేశవిదేశాలలో వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగులో పరిశోధన చేసిన వారి వివరాలన్నీ ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి సేకరించి, విపులమైన పీఠికతో కాలానుక్రమంగా, ప్రక్రియాపరంగా ప్రకటించి ప్రచురించిన గ్రంథం ఒకయూనివర్సిటీ/ అకాడమీ చేయాల్సిన పని. తానొక్కడే చేసి శహభాష్ అనిపించుకున్నాడు. డిగ్రీ పూర్తికాకముందే ఆయన రాసిన సాహిత్య విమర్శా వ్యాసాలు ఆనాటి సుప్రసిద్ధ పత్రికలన్నీ ప్రచురించిన ఘనత సాధించాడు. పాలెం ప్రాచ్య కళాశాలలో చదువుకునేరోజుల్లోనే డా.కపిలవాయి లింగమూర్తి, డా.శ్రీరంగాచార్య, డా.హరీంద్రబాబు వంటి సద్గురువుల సాన్నిధ్యం లభించింది. వారి అంతేవాసిత్వం సాహిత్య అధ్యయనం, తెలుగు భాషాభినివేశాన్ని కలిగిస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనలోని విమర్శనా పటిమకు మరింత ఒరిపిడి పెట్టింది. పిడీసీ చదివే రోజుల్లోనే నాటి ఆర్డీవో కేవీ రమణాచార్య,ఐఏఎస్ ఒకసభలో నిత్యానంద రావు ఉపన్యాసం విని బాగా అభివృద్ధి లోకి వస్తావని ఆశీర్వదించారు. వారి వాక్కు ఫలించింది. తనను తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం లోనే ఉపన్యాసకునిగా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఆచార్యునిగా, తెలుగుశాఖాధ్యక్షునిగా రాణించి గురువులుమెచ్చిన శిష్యుడనిపించుకున్నాడు. నిత్యానంద రావు వ్యక్తిగా ఆత్మీయతను పంచే నిర్మలహృదయుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినయాన్వితుడు. మాటలో స్వచ్ఛత, నిర్మొహమాటత్వం ఆయనసొంతం. ఇదేగుణం ఆయన విమర్శలోనూ ప్రతిఫలిస్తుంది. కవిత్వం, క్రికెట్, ఉద్యమచైతన్యం, దేశోద్ధరణ వంటి కార్యక్రమాల జోలికి పోకుండా అధ్యయనం అధ్యాపనం, వాఙ్మయ విమర్శ, రాతపనికే అంకితమయ్యాడు. ఒకందుకు అదీ మంచిదేఅయింది. అన్నిట్లో వేలుపెట్టి దేనిలోనూ రాణించని ఎందర్నో మనచుట్టూ చూస్తూనే ఉన్నాం. నాకు తెలిసి అత్యవసరమైతే తప్ప సభలూ సమావేశాలకు కూడా ఆయన వెళ్ళడం అరుదే. దానికంటే కాలేజీ కాగానే ఇంటికెళ్ళి ఏదో రాసుకోవచ్చు అనేదాయన మనస్తత్వం. విమర్శకుడిగానే కాకుండా చంద్రలేఖావిలాపం అనే తొలివికట ప్రబంధంపై పరిశోధించి ఎంఫిల్ పట్టాన్ని, ఎవరూ స్పృశించని తెలుగు సాహిత్యం లో పేరడీలపై పీహెచ్ డీ పట్టాన్ని పొందాడు.
వెలుదండ ఇంటిపేరైతే నిత్యానందమైన 'హాసవిలాసం'ఆయన ఒంటితీరు. నిత్యన్వేషణ, నిత్య వైవిధ్యం తో తెలుగు పరిశోధనలలో కొత్త కోణాలెన్నోచూపి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. బంకించంద్ర ఛటర్జీ, బూర్గుల రామకృష్ణారావుల జీవితం- రచనలపై చేసిన రచనలు దేశభక్తికి, రాజనీతిజ్ఞతకు నిలువుటద్దాలు.
వచ్చే శోభకృత్ లో 60వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న వేళ ముందుగానే కలిసివచ్చిన ఖాళీ సమయాన్ని( కరోనా వ్యాక్యూమ్ ను) సద్వినియోగ పరచుకుని గతంలో తాను వెలువరించి ప్రచురించిన అనేక వ్యాసాలు సమీక్షలు తనసమగ్ర సాహిత్యం పేరిట 7 పుస్తకాలుగా ఒక్కటొక్కటిగా విడుదల చేస్తున్నాడు. వాటిలో 'అనుభూతి -అన్వేషణ' పేరిట 147 పుస్తక సమీక్షలతో, 82 భిన్న భావాల పీఠికలతో ఒక బృహత్సంకలనాన్ని వెలుగు లోకి తెచ్చాడు. నిత్యానంద రావు సాహిత్య వికాసానికి ఈ గ్రంథం గొప్ప కొలమానం. ఆ తర్వాత 'అక్షరమాల' పేరిట సాహితీ మూర్తుల వ్యక్తిత్వం సౌరభాలను మరొక మహద్గ్రంథంగా వెలువరించాడు. వ్యక్తుల్ని వారి రచనల్ని అంచనావేడంలో ఆయనకాయనే సాటి. చెప్పదలిచిన విషయాన్ని సూటిగా, సరళంగా, స్పష్టంగా చెప్తాడు. ప్రతివ్యాసాన్నీ కీలకాంశంతో ప్రారంభించి చదివించే శైలితో నిర్వహిస్తాడు. కవితాత్మక అలంకారిక శైలికి తపన పడడు. పత్రికలకు 'కాలమ్' దాటని ప్రతిభతో సంక్షిప్తతతో కూడిన విషయ సమగ్రత సాధించడం మరో విశిష్టత. ఇలా1978లో మొదలైన రాతపనికి విరామమేలేదు. ఇంతకాలం చీకట్లో దాక్కున్న వాగ్దేవీ వరివస్య, పరిశోధక ప్రభ, వ్యాస శేముషి, సృజనానందం, ఆదర్శపథం గ్రంథాలు ఇక వరుసగా రానున్నాయి.
తెలంగాణ విద్వద్విమర్శకుడు, నాగరకర్నూల్ జిల్లా మంగునూరు ముద్దు బిడ్డ , మా సహాధ్యాయి, నిత్య నవీన పరిశోధకుడు నిత్యానంద రావును తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శకునిగా గుర్తించి కీర్తి పురస్కారాన్ని అందిస్తున్న వేళ ఇది వెలుదండ మెడలో అక్షరాల విరిదండ.
- మరుమాముల దత్తాత్రేయ శర్మ
(వ్యాసకర్త గురుకుల విద్యాలయాల సంస్థ లో విశ్రాంత ప్రధానాచార్యులు)