పనోల్లం ఎవరికి కానోల్లం - పనికి ఐనోల్లం అంటూ నిజామాబాద్ నుండి కందాళై రాఘవాచార్య రాసిన కవిత "పనోల్లం" ఇక్కడ చదవండి.
పనోల్లం
అవును ! మేం పనోల్లమే
మా వంశమేదో మరిచిపోయినం
తరాల నుండి పనోల్లమైతిమి
ఇంకా కులమేమిడ్ది
వంశమేమిడ్ది
పనోల్లం అనుడుకన్నా
పెద్ద కులమేమున్నది
పేరు ఏదైనా
పనోడా హమాలీ కూలీ లేబర్
ఎన్ని పేర్లో
అసలు పేరు గుండు సున్నా
సూర్యుడు చీకటి దుప్పటి
దుల్పక ముందే లేచుడైతది
ఒక్కోసారి మధ్య రాత్రే
ఒళ్లు నొప్పులు నిద్ర లేపుతై
రంగుల కల రాంగ
నడుమంత్రంలనే తెగిపోద్ది
కల కాడ గూడ కఠినమే
పనిమీది కెక్కితే పొద్దు దిగినా
మేము దిగుడు ఉండదు
అంతా ఎగుడు దిగుడు బతుకు
జ్వరమొచ్చింది తెల్వదు
తగ్గింది తెల్వదు
కాని పెయ్యి
ఎప్పుడూ కాల్తనే ఉంటది
కుమ్మరి వాము లెక్క --
బతుకు పలిగిన కుండ లెక్క
పచ్చలు పచ్చలు ఒక రూపం లేదు
మా లెక్కనే మా పోరగాల్లు
సిన్నప్పటి నుండి ఇటుకలతోనే
ఆడుకుంటా పని నేర్సుకుంటరు
గుడి లేదు --
మేము మొక్కుకున్న
వఠ్ఠి బండైనా మాకు దేవుడే !
బడి లేదు --
మేం మాట్లాడిందే
పోరగాల్లకు "అధికార భాష"
గాలిల ఎగిరే సిమెంటుతోనే
మా పిల్లలు ఇనుము లెక్క
గట్టివడి గట్టివడి మా లెక్కనే సహజ కవచదారులు
పనోల్లుగా పుట్టె పనోల్లుగా
బతుకు చాలించే
అవతార పురుషులం
మేం ఆగిపోతే నాగరికత ఆగిపోతది
అసలు నాగరికులం మేమే
జనాభా లెక్కల్ల మా పేర్లుండై
జనన మరణాలకు అతీతులం
లెగండి లెగండి
పంటే నడ్వదు
పనికి పిలుస్తున్నరు
పరుగులు దియ్యాలే
దొరికింది దినాలే
దొరలెక్క బతుకాలే
పనోల్లం ఎవరికి కానోల్లం
పనికి ఐనోల్లం.