కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతా విస్తరించి అపరిచిత యుద్ధం చేస్తోంది. దాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు ప్రపంచం చేయాల్సిన పని. దాన్ని కవితాత్మకంగా జయంతి వాసరచెట్ల చెప్పారు.
ఇప్పుడు
పలకరించుకోవడం
పలవరించుకోవడం
ఆత్మీయత పంచుకోవడం
అనర్థం
ఒకరికి ఒకరం చేతిలో చేయి కలిపి
అక్కున చేర్చుకోవడం నేరం
నేనెప్పుడూ అనుకోలేదు
పరిచయం లేని రోజును కలుసుకుంటానని
కనిపించని జీవి ఎర్రకిరీటం బోర్లించుకుని
తానే రాజునని ప్రకటించుకుంటుందని
కాలాన్ని శాసించే మానవుడిపై
దండయాత్ర చేసి
ప్రపంచాన్నే స్తంభింపజేసి
సైలెంట్ గావైలెంట్ అవుతుందని
కాలాన్ని ప్రకృతి అగ్నిప్రవేశం చేయించినట్లు
ఎవరికి వారే నిశబ్దం తెరచాటున నిలబడి
కనిపించని శత్రువును వెతుకుతామని
ఇప్పుడు
కాలు గుమ్మం దాటడం
కూర్చున్నకొమ్మను నరుక్కోవడం
మనవ మేథకు అంతుపట్టని ఒక
సవాలును ఎదుర్కోవడానికి
సమాయత్తమవుతామని
అంతుచిక్కని ప్రశ్న కు జవాబు రాబట్టడం
మనవంతయినప్పుడు
ఎవరికి వారే పరాయీలుగా మారి
ఆగిపోకుండా ప్రయాణం సాగించాలి
తిరిగి ప్రకృతి ని పరిచయం చేసుకుంటూ
మన సంస్కృతి సాంప్రదాయాలను
వెలిగిస్తూ
మనల్ని మనం కొత్తగా పరిచయం
చేసుకోవాల్సిందే
మహమ్మారితో
అపరిచిత యుద్దం చేయాల్సిందే!!
ఇటీవల తన మొదటి కవితా సంపుటి ' నేల విమానం' ద్వారా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన జయంతి వాసరచెట్ల వివిధ సామాజిక సమస్య లపై స్పందిస్తున్నారు.