కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో తెలుగు కవిత్వం విరివిగా వెలువడుతోంది. పొన్నాల బాలయ్య కాలవాచకం కవితను ఆ నేపథ్యంలోనే రాశారు.
"ఈగో "తలకిరీటం ధరించి
పుర్రెల సింహాసనం మీద పుర్షత్గా కూసున్నది
ఇగ మోకాళ్ళ మీద వంగి
పాదాల చెంత పడి వుండాలి జనం
గాలిని సుత ఉక్కు సంకెళ్ళల్ల బంధించే జులుం
సీకటి శాసనాల చిత్రహింసల కాలవాచకం
ఏకస్వామ్యం గుత్తాధిపత్యం
ముంగట ముచ్చట పెట్టద్దు
ముఖాముఖిగా మాట్లాడద్దు
ఊపిరి స్తంభింపజేసే విధ్వంసకర మొఖం
తలలు తెగిపడ్డ నేల దేహం మీదుగా
సచ్చిన ఆశల శవాల దిబ్బల మీదుగా
మోసం కాలువలు నిండిపారనిదే
కాలు గడపదాటదు
పచ్చి పచ్చి అబద్ధాలు గుప్పు కొంటున్న
హోళీ క్రీడవినోదం
మనుషుల చుట్టూ గోడలు
ప్రశ్నల చుట్టూ గోడలు
కలాలా గళాలా చుట్టూ గోడలు
ఎన్ని అడ్డుగోడలు కట్టినా....
మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛా జీవి
బానిసలు కావాలనుకునేది భ్రమల ప్రపంచమే!
గప్చుప్గా గాలి కంటే వేగంగా
వేళ్ళకుదురుల్లో
నిశ్శబ్దకాంతి ప్రవాహం
నిటారుగా నిలబడే"ఫొటో సింథసిస్ "గళం
పడగ విప్పి బుసలు కొడుతున్న
అహం తోకబట్టి గిరాగిర తిప్పి
నేలకు వయినంగా యిసిరి సంపేదే కలం
ములుపుచ్చ ముండ్ల ఆకుల మీద
కూరుపాట్లు కుక్కుతున్న లోకంలో
ధైర్యంగా ఎదురు నడిచేది అక్షరాల ప్రశ్న
కుత్తెంగా గోడలు కట్టి కూల్చలేనివి కలలు
ఒక్క చూపుడు వేలు పోటుకు
ఆధిపత్య బలగం పుటుక్కున తెగిపోయే పూదారం
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/topic/literature