చూసే కళ్ళని బట్టే కదా సౌందర్యం అని అంటున్న జయంతి వాసరచెట్ల కవిత " చీకటి తెరలు " ఇక్కడ చదవండి:
చీకటి తెరలు
పల్చటి నల్లని పరదా చాటునుండి
వెన్నెల చిమ్ముకుంటూ
మంచుపొగ చూరినట్లు…
మసకమసకగా ప్రపంచం!
పచ్చదనానికి కాసింత సమయం..…
నలుపు రంగేసుకుంటూ పయనమైన కాలం!
ఎత్తైన శిలలను కప్పుకున్న పర్వతాలు
దూరతీరాన పొగమంచు చాటున
గతకాలానికి సాక్షీభూతంగా
నిశ్చలమైన రక్షకభటుడిలా …
ఆ గది కళ్ళు తెరిచినప్పుడల్లా
నాకళ్ళను ఏవేవో అస్పష్ట రూపాలు
మాయచేస్తుంటాయి!
అడ్డం నిలువుగా గోడలకు వేలాడుతున్న చువ్వలు
ప్రపంచాన్ని నిదురపొమ్మనిచెప్పే సందేశం!!
చూస్తున్న కొద్దీ రంగుమారుతున్న తన రూపం
ఇప్పుడొక దైవ మందిరంగానో
దేవతా విగ్రహంగానో మారబోతున్నదని …
అది నాకు చిరకాల కానుకై
నన్ను అలరిస్తాయని అనిపిస్తుంది!
చూసే కళ్ళని బట్టే కదా సౌందర్యం?
దూరతీరాలిప్పుడు నగిషీల చిత్రాలు!!