జయంతి వాసరచెట్ల రాసిన నీతి కథ "వినదగు నెవ్వరు చెప్పిన…!! " ఇక్కడ చదవండి.
తన కార్యాలయ సమావేశ మందిరంలో పని ఒత్తిడిలో ఉన్న గోకుల్ కు కూతురు నందన నుండి ఫోన్ వచ్చింది. "ఎక్స్యూజ్మీ …." అంటూ పక్కకు వెళ్లి మాట్లాడాడు గోకుల్.
"డాడీ డాడీ.,.హెల్ప్ హెల్ప్" అంది కూతురు నందన.
"నందూ నీకెన్నిసార్లు చెప్పానమ్మా ఇలా ఆటపట్టించొద్దనీ …! చూడు బేబీ ..నేను ప్రాజెక్ట్ మీటింగ్ లో ఉన్నాను. డోంట్ డిస్టర్బ్ మీ .
ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతే మీ డాడీకి ప్రమోషన్ వస్తుంది." అన్నాడుగోకుల్.
ఆమాటలేవీ పట్టనట్లు "నన్ను నమ్మండి డాడీ …..! ఐస్వేర్" అని ఏడుస్తూ .. కూతురు ఏదో అనేంతలోనే ఫోన్ కట్ అయ్యింది.
"ఇది రానురానూ మొండిగా తయారవుతుంది."
అనుకుని భార్యకు ఫోన్ చేసి కూతురు ఫోన్ చేసిన వైనం గురించి చెప్పాడు గోకుల్.
"అడిగింది లేదనుకుంటా ఇప్పిస్తారు టెన్త్ క్లాస్ లో ఫోన్ వద్దంటే విన్నారు కాదు…! ఆడపిల్ల.. ఈకాలంలో పిల్లలకు ఫోన్ చాలా అవసరం అని నాకు స్పీచ్ ఇచ్చారు! మీ అతి గారాబం వల్లే అది అలా తయారైందండీ."
"మొన్నటికి మొన్న…. మమ్మీ నాకు కడుపులో ఎలాగో ఉంది. వామిటింగ్స్ అవుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు అంది."
"అయ్యో...ఎంతలా బాధపడుతుంది ఏమో...అపెండిసైటిస్ ఏమో.. అనుకుని వెళ్ళి తీరా చూస్తే ...అది బాగానే ఉంది.. క్లాసులు తప్పించుకోవడానికి చిన్ననాటకం అంది."
"అక్కడ హెడ్ కు చెప్దామంటే ఇది ఇంటికొచ్చాక గొడవ చేస్తుందని ఊరుకున్నాను. ఆమధ్యే కదా మీరు బెంగుళూరు వెళ్తూంటే డాడీ నన్ను ఎవరో వెంబడిస్తున్నారు కాపాడండి అందని ఫోన్లో ఏడిస్తే... ఏదో స్టాప్ లో దిగి మధ్యలో నుండే మీ ప్రయాణం కాన్సిల్ చేసుకుని వచ్చారు."
"డాడీ…. మీరు నన్ను షాపింగ్ కు తీసుకొని వెళ్తానన్నారుకదా ….? ఇప్పుడు వెళ్తే మళ్ళీ వారంవరకు రారని నేనే ఊరికేచేసానంది
అప్పుడే మర్చిపోయారా…? అంది ప్రీతి."
"అవును ప్రీతి కానీ నందు …. ఏడ్చింది….. అన్నాడు గోకుల్….!"
మరేం ఫరవాలేదు మీ పని చేసుకుని రండి అంది ప్రీతి.
సరేనని ఊరుకున్నాడు గోకుల్."
******
కార్లో ఇంటికి వెళ్తున్న గోకుల్ కు నందన పాఠశాల నుండి తొందరగా రమ్మని ఫోన్ వచ్చింది.
హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి వెళ్దామని ఆదరాబాదరాగా వెళ్ళేంతలో పాఠశాల బయట ఒకదగ్గర గుంపులుగా పిల్లలందరూ ఉన్నారు. అక్కడే నందన బురద కొట్టుకుపోయిన బట్టలతో ఉంది."
"నందూ" అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళాడు గోకుల్
"డాడీ " అంటూ చుట్టేసుకుని ఏడ్చింది.
వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ కూడా అక్కడే ఉంది.
" స్పోర్ట్స్ పిరియడ్ లో గ్రౌండ్ కు వెళ్తామని చెప్పి ... మీ అమ్మాయితో పాటు మరో ఇద్దరు బయటకు వెళ్ళారు. ఎవరో నలుగురు వ్యక్తులు వీళ్ళను వ్యాన్ లో ఎక్కిద్దామని చూసారు. తప్పించుకునే క్రమంలో స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న బురదగుంటలో పడ్డారు.
సమయానికి వాచ్ మెన్ లు ఇద్దరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పటికే అన్ని టీవీల్లో ని న్యూస్ చానల్స్ లో వీళ్ళగురించి మాస్కూల్ గురించి స్క్రోల్ లో వచ్చేది" అనుకుంటూ నందూతోపాటు మరో ఇద్దరిని చూపించింది హెడ్ మిస్ట్రెస్..!
"మిస్టర్ గోకుల్….మీకెన్నో సార్లు చెప్పాము ఇలాంటి పనులు చేయొద్దని. ఎంతచెప్పినా మీఅమ్మాయి వినడం లేదు. మీరేమాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్లు లేదు. మరీ ఇలా ఎలాగండీ ….కాస్తా మేం ఏమన్నా గట్టిగా అంటే ..!! మీరు మాఅమ్మాయి అలాకాదు అంటూ ... మాపైనే దాడికి దిగుతారు. ఇంకోసారి ఇలా చేయొద్దని మీరైనా చెప్పండి. చదువుకుని పరీక్షలు బాగా రాయమని చెప్పండి అంది హెడ్ మిస్ట్రెస్."
నందన ముందే వాళ్ళ నాన్నను తిట్టడం నందనకు తలకొట్టేసినట్లైంది.
******
"నాన్నా పులి" కథ ఎన్నిసార్లు విన్నదీ .!!.. నందనకు గుర్తొచ్చింది.
తను ఫేక్ కాల్స్ చేయడం వల్ల నిజంగా అవసరమయ్యి హెల్ప్ అని అన్నా ….ఎవరూ నమ్మలేకపోవడాన్ని తలుచుకుని, తనతప్పు తెలుసుకుని తలదించుకుంది నందన.
******
నీతి: సరదాకు చేసే పనులు అన్ని సమయాల్లో పనికిరావు.