డాక్టర్ ఉదారి నారాయణ తెలుగు కవిత: ఇప్పుడు సమయం కాదు

By telugu teamFirst Published Aug 3, 2021, 1:33 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం ప్రత్యేకమైంది. డాక్టర్ ఉదారి నారాయణ రాసిన ఇప్పుడు సమయం కాదు అనే కవితను ఇక్కడ చదవండి.

చుట్టూ
మృత్యువు  కంచెలుపరిచి
ఉరులు నాటి కాపలా కాస్తున్నపుడు
భయం దుప్పటికింద ముడుచుకోవడం
మనిషితనం కాదు 
వీరుని లక్షణం అంతకన్నా కాదు

వెనుకనుంచి మృత్యువు తుఫాన్
నీటి కత్తులతో    
అలల గుర్రాలెక్కి వస్తున్నపుడు
రక్త కణాల సైనికులకు
ఆంటిబాడీలను మరింత పెంచాలి

సుతి కట్టిన మద్దెల తాడువలె
నరాలన్నిటిని  తెగ బిగించాలి
శబ్ద శిరస్సులు గోడల్ని  మైదం చేసేట్టు 
నాడుల్ని గుంజి కట్టాలి

ఇపుడు సమయం లేదు
నేనూ నువ్వూ  మనమనే
గుణింతాల విభజనల సమయం కాదిది
సహనాన్ని సత్తువను
మీన మేషాల మూటలో దాచే యాల్ల కాదిది
అవకాశమొస్తే
నీకోసం చెయ్యందించిన     
ఒంటికొమ్మతోనైనా ఒడ్డున పడాలి
బండకింది  కప్పలా
తల్లీ పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నపుడు
దేశ సంచారమెల్లిన గాలి రెక్కల తండ్రికోసం
ఎదురుచూడడం వ్యర్థమే
కానరానిలోకంలో
కమాసురాగం  మత్తులో
తేలిపోతున్న ఇంటి పెద్ద కోసం
దారులు పరచడం వెర్రితనమే మరి
మనుషులే  మర మనుషులైన 
విచిత్ర సందర్భంలో
ఎవరు ఎవరికోసం కాకుండా
ఎవరి శరీర గుహలో వాళ్లే
ధైర్యపు కవచంతో గస్తీకాచుకోవాలి.

click me!