ఏరువాక పున్నమి సందర్భంగా జనగామ రచయితన సంఘం కవి సమ్మేళనాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా జనగామ జిల్లాకు చెందిన ఉత్తమ రైతును రచయితల సంఘం సన్మానించింది.
జనగామ జిల్లా రచయితల సంఘం (జరసం) ఆద్వర్యంలో నిన్న "ఏరువాక పున్నమి ముచ్చట్లు" పేరిట ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జనగామ పట్టణంలోని గ్రెయిన్ మార్కెట్‌లో కవి సమ్మేళనం నిర్వహించారు. జరసం అధ్యక్షులు అయిలా సోమనర్సింహచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కవి సౌజన్య డాక్టర్ లింగంపల్లి రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఏరువాక పున్నమి ముచ్చట్లు మంచి కార్యక్రమమని అన్నారు. ఏరువాకతో రైతు జీవితం ప్రారంభమౌతుందని, రైతు లేనిదే మానవ మనుగడ లేదని కవులు తమ కలాల ద్వారా సాహిత్యం సృజించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కవులు రెడ్డి రత్నాకర్ రెడ్డి, పెట్లోజు సోమేశ్వరాచారి, జి.కృష్ణ, ఆకుల వేణుగోపాల్ రావు, పొట్టబత్తిని భాస్కర్, నక్క సురేష్, లగిశెట్టి ప్రభాకర్, కొట్టే శ్రీలత, చిలుమోజు సాయికిరణ్, మోహన్ కృష్ణ భార్గవ, రేణుకుంట్ల మురళి, కోడం కుమారస్వామి, జోగు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు తిండి పెట్టే రైతు దీనంగా చెయ్యచాపడం, మద్దతు ధరకోసం రోడెక్కడం ఏ విలువలకు సంకేతం అని కవులు ముక్తకంఠంతో ప్రభుత్వ విధానాలను నిరసించారు. కమ్ముకొస్తున్న కార్పోరేట్ వ్యవసాయాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో రైతు అనే వారే మిగలరని ఆవేదన కవిత్వం వినిపించారు.
ఈ సందర్భంగా ఉత్తమ రైతు సోదరులు పాకాల రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు, గంప సీతారాములు, కొడం కుమార్ స్వామి, కార్యక్రమానికి సహకరించిన శెర్విరాల ఉపేందర్ లను, ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ లింగంపల్లి రామచంద్రను జరసం ఘనంగా సన్మానించారు.
పూర్వ కార్యదర్శి నక్క సురేష్ వందన సమర్పణ చేసిన అనంతరం తెలంగాణ రుచులు సల్ల, మిర్చీ, సర్వపిండి, ఏకుడు ప్యాలాలు, బొబ్బరి గుడాలు, జొన్నగట్క అంబలి, జొన్న రొట్టెలు, పుంటి కూర తొక్కు, ఎల్లిపాయ మిరంతో అల్పాహారం జరసం ప్రధాన కార్యదర్శి ఆకుల వేణుగోపాల్ రావు ఏర్పాటు చేశారు.