ప్రవాసినీ మహాకుద్ ఒరియా కవిత: ఒంటరితనం

By telugu teamFirst Published Apr 1, 2021, 2:11 PM IST
Highlights

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ ప్రవాసీ మహాకుద్ ఒరియా కవితను తెలుగులో అందించారు. ఒంటరితనం అనే ఆ కవితను చదవండి.

నేను వింటున్న ఈ 
ఒంటరితనం ఎక్కడుంది
ప్రేమావకాశానికి అవతలా 
కన్నీటి సరస్సు పైనా 
లేదూ, మరణ భయం లోనా 
. . . . . . .
వదిలేసిన భవనం అన్ని మూలల్లో 
హృదయం పై ముద్రితమయిన 
సున్నిత పాద ముద్రల్లో
చిత్తడి చిత్తడయిన
బూడిద నేలల అడవిలో
నిశబ్దం శూన్య ఆకాశంలా 
విశాలమయింది బలమయిందీ కూడా
బూడిద రంగు సూర్య కాంతిలో 
ఓ పక్షి తన రెక్కల మీద 
నీలి రంగు ముద్రలతో 
గిరికీలు కొడుతున్నది
సప్తస్వరాల్ని అవపోసన పట్టిన 
చంద్రుడు 
ఇంటి పైకప్పు పైకి పిలుస్తున్నాడు
ఇంత ఒంటరితనం 
నా చెవుల్లో ఎట్లా నిండింది
చల్ల గాలి ‘మహువా’ వాసనల్ని 
మోసుకొస్తున్నప్పటికీ 
ఓ బలహీనమయిన గొంతు 
నన్ను చేరుతున్నది
ఓ సున్నితమయిన సూర్యోదయం 
పట్టరాని కోపంతో 
నన్ను నిద్రలేపుతున్నది
ఒంటరితనంతో నాకిది ఎక్కడి స్నేహం 
నన్నెట్లా భగ్నం చేస్తుంది 
ఇంకొకరి ఆధిపత్యాన్ని తిరస్కరించే నన్ను 
ఈ ఒంటరితనం బంధించి వేస్తున్నది
ఒంటరితనం జవాబుల్ని ఆశించినప్పటికీ 
నేను ప్రశ్నలు వేయను
నేనెప్పుడూ పిలవకున్నా 
ఒంటరితనం నా పక్కనే ఎదురుచూస్తూ వుంటుంది
నేను మాట్లాడను, అయినా 
ఆరంభాన్నీ అంతాన్నీ తెలుసుకోవాలనుకుంటాను
నన్ను భయమెందుకు పాలిస్తున్నది 
నా జ్ఞాపకాల నెందుకు రేపుతున్నది
నా సాన్నిహిత్యాన్నెందుకు 
ఆశిస్తున్నది .

ఒరియా : ప్రవాసినీ మహాకుద్ 
ఇంగ్లీష్: జయంత మహాపాత్ర 
తెలుగు : వారాల ఆనంద్

click me!