నేడు జ్యోతీరావు ఫూలే జయంతి సందర్భంగా ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ రాసిన ‘నిజమైన మనిషి’ కవిత ఇక్కడ చదవండి.
నాలుగు మెతుకులు కాదు
నాలుగు అక్షరాలు ముఖ్యమని
మట్టి మనుషుల మెదళ్ళలో నాటిన దీనబంధు -
అక్షరం ఒక తీగ లాంటిదే
అది తీగలు తీగలుగా విస్తరించి
బానిస సంకెళ్ళను తెంపే ఆకురాయి
అక్షరం ఒక నిప్పురవ్వ
అది బానిస బతుకులను దహించే దావానలం ;
బతుకంటే మురికి వాసనలు కాదు
పూల సుగంధాలన్న సున్నిత మనస్కుడు
జీవితాన్ని వెక్కిరించిన వెట్టిని కాదని
దురలవాట్లను తగులబెట్టి
మనలోని మాలిన్యాన్ని కడిగిన మహానీయుడు
స్త్రీ పురుష భేదాలు వద్దని
ఇంటింటా జ్యోతులు వెలిగించిన జ్యోతి అతడు
మన ఆలోచనల్లో పూలు పూయించిన పూలే అతడు
ఈ నేల మీద నడిచిన నిజమైన మనిషి అతడే.