ఇరుగు పొరుగు: రెండు ఇంగ్లీష్ కవితలు

By telugu teamFirst Published Jul 1, 2021, 12:51 PM IST
Highlights

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ రెండు ఇంగ్లీష్ కవితలను తెలుగులోకి అనువదించారు. వాటిని ఇక్కడ చదవండి.

జోక్యం 

పెన్నుతో పిచ్చి గీతలు గీస్తూ 
ఆమె రాత్రి కలలో 
రద్దీగా వున్న వీధుల గుండా 
ప్రయాణం చేసింది 
సిల్వియా ఫ్లాత్, మాయా అన్జేలియో 
కమలాదాస్ లను కలిసింది 

బోనులో వున్న పక్షులెందుకు 
పాడుతున్నాయని ఆశ్చర్య పొంది 
ఆమె కథ ఘంట జాడీ కింద 
కూరుకు పోయింది 

తన లోపల తాను తవ్వుకుంటూ 
అమితంగా రక్తం స్రవిస్తూ 
ఆమె కోసం ఆమె రాసుకుంది 

ఆలోచనలతో ఓ రహస్య ఒప్పందం 
కుదిరింతర్వాత 
ఆమెలో సృజన 
ప్రవాహమై రంగులీనింది 

తీవ్రమయిన ఒత్తిడితో కూడిన 
జీవితపు అలల మధ్య 
ఆమె కలం 
అరిచింది గీపెట్టింది 

లింగ రహిత పదానికి 
జన్మ నివ్వడానికి 

                      ఇంగ్లీష్ కవిత: దివ్య ఎన్.
                      అనుసృజన: వారాల ఆనంద్
 

కవిత లిఖించడం 

నేను సమూహంలో వున్నాను 
అయినా నేను ఒంటరినే 
అంతే కాదు 
నేను నాకవిత 
రక్త మాంసాల్ని, ఎముకల్నీ కూడా
నేను సముద్రంలో వున్నాను 
ఎత్తైన పర్వతం మీదా వున్నాను 
నువ్వు రాయని నీ దుఖాన్ని 
నేను పంచుకోవాలి
కళ్ళు మాట్లాడే భాషలో 
కవిత రాయడానికి 
పదాల్ని, ముఖాల్ని, గాయాల్ని 
జీవితమంతా సేకరిస్తూనే వున్నా
విరామం లేకుండా నా హృదయ స్పందనలు 
ప్రేమను ధ్వనిస్తున్నాయి
ఎదో ఒక రోజు ‘రేడియో స్టేసన్’ ను 
స్వాధీనం చేసుకుంటాను 
నా హృదయ స్పందనల్ని 
ప్రసారం చేయడానికి 

                    ఇంగ్లీష్: అమరేంద్ర చక్రవర్తి 
                    తెలుగు : వారాల ఆనంద్

click me!