ప్రముఖ కవి విమర్శకుడు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య ఇవ్వాళ 2021 జూన్ 30వ తేదీన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపెక్స్ కాలేజీలో సీనియర్ ఫాకల్టీ గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్బంగా ప్రముఖ కవి వారాల ఆనంద్ రాసిన కవిత ఇక్కడ చదవండి.
మాటకున్న మార్దవం, పదునూ
రెండూ ఎరిగినవాడు
అందుకే తడబడడు వెతుకులాడడు
ఆయనో మాటల జలపాతం
అక్షరాల్ని మట్టి పరిమళంలో విత్తి
కవిత్వం పండిస్తాడు
లోకం విస్తరిలో వడ్డిస్తాడు
రైతును ప్రేమిస్తాడు, పచ్చదనాన్ని కాంక్షిస్తాడు
కన్నీటి బొట్టుకు కరిగి పోతాడు
కవిత్వం చిటికెన వేలు పట్టుకుని
దేశమంతా తిరిగాడు
సచ్చిదానందన్, సునీల్ గంగోపాధ్యాయ్
ఎం.టి., మహాశ్వేతల కరచాలనంతో
దేహమంతా భావలయను నింపుకున్నాడు
కవిత్వమే ప్రాణమయి
స్నేహాన్ని పంచాడు,ప్రేమను పలవరిస్తాడు
ఆయన ‘జీవన వీచిక’,’ప్రవాహమై’
సంగమంలో కవిత్వ దర్శనం చేస్తోంది
రా మిత్రమా హద్దుల్లేని ప్రపంచంలో
నీ సృజన మరింత విస్తారమయి
లోకం చైతన్య భరితం కానీ .