డా. సిద్దెంకి యాదగిరి తెలుగు కవిత: వెన్నెముకలు

By telugu teamFirst Published Jan 27, 2021, 11:13 AM IST
Highlights

తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. కవి డాక్టర్ సిద్దెంకి యాదగిరి వెన్నెముకలు పేర ఓ కవిత రాశారు. దాన్ని పాఠకులకు అందిస్తున్నాం. చదవండి.

అవమానాలు ఎన్ని కల్గినా        
    సహనాన్ని ఆవాహన చేసుకున్నాడు
    ఇజ్జతికి తాకట్టు పడ్డాడేకానీ 
    తిరుగుబాటుకు మజ్జతియ్యలేదు 
    అప్పుల కుప్పలు పెరిగితే 
    కొన్నిసార్లు దేహాన్నైనా వదుతున్నాడు కానీ
    దేశం వదిలిపోలేదు
    
    రెండు కండ్లల్లో
    రేయింబవళ్లు నింపుకొని 
    ఎండీ 
    నానీ(తడిసీ)
    వణికీ
    పంటకై తపస్సు చేసినోడు 
    మంట పెట్టడానికి ఎట్లైండు?
    
    శమటతో
    బీళ్లల్లో బీజాలు చల్లి
    పొలాల్లో మొలిసినోడు
    లొల్లయి మొలుస్తుండు ఎందుకు ?
    పిడికిలితో విత్తనాలు చల్లినోడు
    పిడికిల్లెత్తుతున్నడు? 

    సూర్యుని చెక్కిళ్లు పట్టి దుక్కి దున్నినోడు
    చీకట్లని పట్టి వెలుతురు దున్నడా?
    గిట్టుబాటు కళ్లానికి నోరెత్తనోడు
    చిక్కం తొడిగే చట్టాలను తొక్కడా?
    చలిని తట్టుకోవడానికి నెగడయి మండినోళ్లకి
    చట్టాలు ఒక లెక్కా

    అధికారం రంగు మారుతది
    పొలం అంటువాయని రైతాయే
    ఎట్ల మారుతడు?

    పొలాన్ని
    రైతునూ
    పంటనూ 
    కబ్జా చేస్తే ఊరుకుంటడా?
    ఆగ్రహపుట్ట పలిగి ఊసిల్లై లేస్తడు
    విషమ్మీదనే విషమైతడు
    మట్టిలో ఉన్నోడాయే
    నింగికంటిన అధికార నషాలాన్ని 
    మట్టిలోకి దించుతడు

    పిట్టని తరిమినట్లు
    చట్టాని తరుముతడు
    కొత్త సాగుబాటు చేసినట్లు
    కొత్త శాసనాలను నాగలితో తిరగరాస్తడు

    వారు ఈ దేశ వెన్నెములకు కదా! 
    ఎప్పటికైనా ఈ రాజ్యం 
    కార్పోరేట్‌ సంస్థలది కాదని 
    కళ్లు తెరిపిస్తడు

    కాకపోతే వెనుకా ముందు.

click me!