శ్రీలత రమేష్ గోస్కుల కవిత: అక్షర తాండవంతో

By telugu team  |  First Published Apr 9, 2021, 2:50 PM IST

అక్షరం కవిత్వమై మన ప్రతి కదలికను  ఎలా గుబాళింప చేస్తుందో  హుజూరాబాద్ నుండి శ్రీలత రమేశ్ గోస్కుల వినిపిస్తున్నారు అక్షర తాండవంలో..


ఆవేశమైనా ఆనందమైన
అందంగా ముస్తాబై అలంకారాలతో అలరిస్తూ
పాఠకుని మదిని కదిలించే రసమయ సృజని..

ఎంచుకున్న వస్తువుతో
అనుభవామృతాన్ని భావాత్మకంగా రంగరిస్తూ
నిగూఢతనెంతో పొదిగి
మనసును రంజింపచేయుచూ
ఆలోచనా సరళి వెంట పరిగెత్తించే అంతర్వాహిని...

Latest Videos

అమూర్తమైన ఊసులలో ఊరేగిస్తూ
కనులముందు నిలుపు పదచిత్రాలు
సజీవ జీవితానుభవాన్ని అందిస్తూ
ప్రసరించే కాంతి పుంజ్యమైన అమృతధార

నిత్యనూతన చైతన్య రూపంతో
తొణికిసలాడే తన శిల్పం
వన్నెలెన్నో అద్దుకున్న అపురూపం
భాషా శైలి సొబగులు
రత్న మణి మాణిక్యాలై
వెలుగులు విరజిమ్ముతుంటే
ఆ వెలుగులు చిద్రమైన బతుకుల నిండా అల్లుకుని
అభివ్యక్తితో అంతర్ మూలాల అన్వేషణను కొనసాగించే
ఎల్లలెరుగని నవనవ్యత...

మస్తిష్కపు పొరల్లో
నాట్లుగా వేసిన ఆలోచనా బీజాలతో
అంతరంగాన పెల్లుబికిన భావాలు
నిద్రపోనివ్వని నేస్తమై
ఊపిరితో చేరి కబుర్లెన్నో చెబుతూ
మనసుకు మాత్రం హాయినిచ్చే కచేరీతో జోకొడుతుంది..

ఒక్కసారి కలిగిన తన పరిచయం
నిరంతరం వెంట నడుస్తూ
ప్రతి కదలికలో తన ముద్రను వెతికేలా ప్రేరణనిస్తూ
చెరగని చిరునవ్వు తానేనై
భావలాలిత్య తరంగాలపై
ఓలలాడించే సౌందర్యలాహిరి...

ఎంత చెప్పినా తరగని వెన్నెల రాణీ
రాలిన ఆకుల గలగలపై నిలిచి
హరివిల్లు రంగులద్దీ
విశాల గగనపు వీధులలో విహరింపజేయించే వినువిహారీ..

కన్నీటి చుక్కల కథ కంచికి చేరే వేళా
గుప్పెడు అక్షరాలలో
గులాబీల గుబాళింపులు చూపించి
నేనున్నంత వరకు నీవు నా వెంటే అంటుంది
నా దృష్టంతా తనపైనే నిలుపుకునే  కవిత్వం.

click me!