ఇరుగు పొరుగు: మూడు హిందీ కవితలు

By telugu team  |  First Published Jun 3, 2021, 3:34 PM IST

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాలా ఆనంద్ మూడు హిందీ కవితలను తెలుగులో అందించారు. వాటిని చదవండి.


కొత్త మార్గం 

నేను జీవితాన్నుంచి 
తప్పించుకోవాలుకోవడం లేదు 
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను
జీవితపు ఊహాత్మక ఇరుసుపైన 
కవిత్వానికి 
అనుమానాస్పదంగా వున్న 
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి
అందుకు మొదట 
జీవితపు శక్తి మూలాల్ని 
క్రియాశీలం చేయాలి
తర్వాత ఆ శక్తిని 
బతుకు కక్షకున్న ఇరుసుకు 
జత చేయాలి
అప్పుడు 
గతంలో లాగా
‘యాంత్రికత’ లేని 
‘మానవత్వం’ వైపు మరలిన
కొత్త మార్గం ఆరంభమవుతుంది.
 
                  హిందీ: కువర్ నారాయణ్ 
                  ఇంగ్లిష్: డేనియల్ వేయిస్ బోర్ట్ 
                  తెలుగు: వారాల ఆనంద్ 

Latest Videos

undefined

---------- 

ఆరుబయట 

తలుపులు మూసేసి 
కవిత రాద్దామని కూర్చున్నాను
చల్లని గాలి వీస్తున్నది 
సన్నటి వెల్తురు కురుస్తున్నది
వర్షంలో ఓ సైకిల్ నిలబడి వుంది 
ఓ పిల్లాడు ఇంటికి తిరిగి వస్తున్నాడు
నేనో కవిత రాసాను
దాంట్లో చల్ల గాలి లేదు
వెల్తురు లేదు
సైకిల్ లేదు
పిల్లాడూ లేడు
మూసిన తలుపూ లేదు 

                  హిందీ మూలం: మంగలేష్ దబ్రాల్ 
                  ఇంగ్లిష్: మంగలేష్ దబ్రాల్ 
                  తెలుగు: వారాల ఆనంద్ 

----------- 

ఒక పదం

ఒక పదం మరో పదాన్ని స్పృశిస్తున్నది
ఒక పదం మరో పదాన్ని ముద్దిడుతున్నది
ఒక పదం రెండు పదాల నడుమ
తల ఆనించి సేదదీరుతున్నది
ఒక పదం మరో పదంలోకి చొచ్చుకెలుతున్నది
ఒక పదం మరో పదానికి పూర్ణత్వమిస్తున్నది
ఒక పదం మరో పదంలోతు తెలుసుకుంటున్నది
ఒక పదం నృత్యం చేస్తున్నది
నిశ్శబ్దాన్ని అనంతంలోకి
తర్జుమా చేస్తున్నది
పదాలు నిశ్శబ్దంలో నివసిస్తాయి
అక్కడ ప్రశాంతంగా వుంటాయి
2
మంచు పచ్చదనాన్ని
స్పృశిశ్తుంది నిశ్శబ్దంగా
వెల్తురులో మొగ్గలు విచ్చుకుంటాయి
వెళ్ళు చీకట్లో శిలలపై
తలలు బాదుకుంటాయి
ఆమె నిశ్శబ్దంగా
అనంతంపై కిటికీ తెరుస్తుంది

                     హిందీ: అశోక్ వాజ్ పేయి
                     ఇంగ్లిష్: కృష్ణ బలదేవ్ వైద్
                     తెలుగు: వారాల ఆనంద్

click me!