మానవ సమూహం చేస్తున్న తప్పు తెలుపమంటూ కవి జోగు అంజయ్య భూమాతకు రాసిన ఉత్తరం ఇక్కడ చదవండి.
అమ్మా భూమాత
నాకు ప్రకృతి ఐనా ప్రపంచమైనా
నీ వే కదా పెద్ద దిక్కు
నవ గ్రహాలలో చల్లని తల్లివని
గొప్పగా చెప్పుకుంటిని
మరి ఎందుకమ్మా మా పైన
కరుణ లేని కరోనాను ప్రయోగించావు ?
తెలివిగల బిడ్డలుగా పుట్టించినందుకు
కృతజ్ఞతగా మెలిగితిమి
ముండ్ల చెట్లు పక్కకు జరిపి
పూల తోటలు పండ్ల తోటలు పెంచితిమి
సుందర వనాలుగా మార్చితిమి
జీవ వైవిద్యమే జీవితమని
జూపార్కులు కట్టించితిమి
టైగర్ ప్రాజెక్టులు పెట్టించితిమి
పక్షులకు సాంక్చరీలు పెడితిమి
స్నేక్ పార్కులకు కంచెలిస్తిమి
మరి ఎందుకమ్మా మాకు
నీటి గండాలు
గాలి గండాలు
కరోనా గండాలు
మా ఉనికినే ఉరితీస్తున్నవు
మేము బతికేది ఎట్ల
మనిషిగా నిలిచేది ఎట్లా
మాలో ఏమి నచ్చడంలేదో
చెప్పమ్మా మార్చుకుంటాం
కాళ్ళు కారులో పెట్టామని
చేతులు కుర్చీపై పెట్టామని
కండ్లు కంప్యూటర్లో పెట్టామని
చెవులకు తాళ మేసి
నోటిలో చెత్తను వేస్తున్నా మని
బాధ పడుతున్నావా తల్లీ !
అత్యాశకుపోయి
ఆగమవుతున్న మనుషులను
దారిలో తెచ్చుకునుటకు
లాక్ డౌన్ పరిస్థితులు కల్పించావా ?
ఎనకటోడు ఎట్లా బతికిండో
ఇప్పటోడు ఏమి చేస్తుండో
పరిశీలిస్తున్నావా తల్లీ !!
చెప్పమ్మా చెప్పు
నీ ఆజ్ఞే మాకు మందు
నీ చూపే మాకు బతుకు.