రూప్ కుమార్ డబ్బీకార్ తెలుగు కవిత: ఇప్పుడు …

By telugu team  |  First Published Jun 2, 2021, 4:49 PM IST

స్మశానానికి, సమాజానికి 'ఇప్పుడు' తేడా లేని స్థితి రూప్ కుమార్ డబ్బీకార్ కవితలో చూడండి.


ఎప్పటిలా  ఇల్లు సందడిగా లేదు,  ఒంటరిదైంది -
అలాగని ఇంటి జనం ఇంటిలోనే  వున్నారు –
కానీ,  నిశ్శబ్దం  గదుల్లోకి  జొరబడింది,  
భయం గుండెల్లోకి .. 
స్నేహాలు, బంధుత్వాలు 'మాస్క్ ' కప్పబడి 
అయోమయ  స్థితిలో,  ఆరిపోతున్న దీపం వత్తిలా … 
సమయంతో సంఘర్షణ ,  కాలంతో యుద్ధం
ప్రతి మూల మలుపులో- 
చూడలేని అనేక దృశ్యాలు 
కోల్పోయిన  అనేక  ప్రపంచాలు 
చివరి చూపు లేదు
చివరికి  కాలిపోయే కట్టెకు మేళం లేదు
పాడె ఊరేగింపులేదు
ఎవరు ఉలిక్కి పడినా,  నాలో సునామిలా వణుకు ..
ఎవరిని పలకరించినా,  నాలో  అలజడి ఉప్పెన..
నిద్ర పై దుప్పటి కప్పి నేను మేల్కొనే వుంటున్నాను 
కళ్ళ ముందు బంధాలు జీవచ్ఛవాలై  కదలాడుతూ వుంటే 
శ్మశానాల్లో  శవాలు దిక్కులేక  ఏడుస్తున్నాయి .. 
శవాల దగ్గర ఏడ్చేవాళ్ళు లేరు 
ఏడ్చేవాళ్ల దగ్గర  ఓదార్చడానికి  ఇంటి దీపాలు లేవు 
ఇప్పుడు -
శ్మశానానికి ,  సమాజానికి  తేడాలేదు – 
కొన్ని నిదురించే శవాలు,  మరికొన్ని నడిచే శవాలు.

click me!