ఐడియా, ఇమేజ్ లను సమ్మిళితం చేసిన " స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్ " (Sculpting in Time)

By Arun Kumar PFirst Published May 9, 2022, 10:51 AM IST
Highlights

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం ఆండ్రీ టార్కోవిస్కీ  " స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్ " ( Sculpting in Time ) అందిస్తున్నారు వారాల ఆనంద్.
 

"స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్" ( Sculpting in Time ) అన్న గొప్ప పుస్తకాన్ని సుప్రసిద్ధ దర్శకుడు, కవి బి.నరసింగరావు వద్దనుండి అందుకున్నాను. అద్భుతమయిన పుస్తకాన్ని అందించిన ఆయనకు మొదట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.   

జీవితం సృజన రంగం వైపు మలుపు తిరిగిన తర్వాత మూడు దశాబ్దాల క్రితమే సినిమా సాహిత్యాలు రెండు కళ్ళు గానూ, హృదయపు నాణానికి రెండు పార్శ్వాలు గాను మిగిలిపోయాయి. ఈ పయనంలో వందలాది పుస్తకాలు సినిమాలు మనసు పొరల్లో నిలిచి పోయాయి. మహాప్రస్థానం నుంచి శ్వేత రాత్రులు దాకా, సత్యజిత్ రాయ్ నుంచి, ఇజెన్ స్టీన్, మజీద్ మజిదీ, జాఫర్ పనాహీ దాకా ఎంతో మంది చలన చిత్రకారుల సినిమాలు అత్యంత ప్రభావం కలిగించాయి. వాటి వల్ల ఎంతో నేర్చుకున్నాను. సమాజపు అనేక పార్శ్వాలు ఎంతో కొంత అవగతమయ్యాయి. 

అయితే పుస్తకంగా నన్ను అత్యంత ప్రభాన్ని కలిగించి సినిమాకి సాహిత్యానికి ముఖ్యంగా కవిత్వానికి వున్న అనుబంధాన్ని అర్థం చేయించిన పుస్తకం సుప్రసిద్ద దర్శకుడు ఆండ్రీ టా ర్కో విస్కీ రాసిన " స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్". సినిమా కవిత్వం రెండు వేరు వేరు కావని మానవ వ్యక్తీకరణలో అవి ప్రధాన మాధ్యమాలని " స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్ " వివరించింది. మనసుకు హత్తుకునేలా చేసింది. ఐడియా, ఇమేజ్ లను సమ్మిళితం చేసి భావలయకి, దృశ్యలయకి వున్న ప్రాముఖ్యాన్ని అనుభూతి కలిగించింది.

‘దృశ్యాల్లో ఆలోచించడం సినిమా అయితే అనుభూతుల్ని పంచడం కవిత్వం’ అంటాడు ఆండ్రీ టార్కోవిస్కీ. ‘కళాత్మకమయిన ‘దృశ్యం’ భావానికి రూపానికి మధ్య వున్న అనుబంధం ఆధారపడి వుంటుంది’ అంటాడు.

కవిత్వమయినా సినిమా అయినా మాస్టర్ పీస్ కావాలంటే కళాకారుడిలోని నీతివంత మయిన భావాల ప్రకటన వల్లే సాధ్యమవుతుంది అంటాడు ఆండ్రీ టా ర్కోవిస్కీ.  కవిత్వానికి సంబంధించి సినిమాకి సంబంధించి అనేక విషయాలు చర్చించిన ఆండ్రీ టా ర్కోవిస్కీ కవిత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు ‘అది ప్రాచీన మా ఆధునిక మా అన్న ఆలోచన నాకు రాదు అది వాస్తవానికి చెందిందా లేదా అన్నదే నాకు ప్రధానం. అట్లాగే అది ప్రపంచాన్ని గురించి అవగాహన పెంచేదిగా వుందా లేదా అన్నదే నాకు ముఖ్యం’ అంటాడు ఆండ్రీ టా ర్కోవిస్కీ.

నిజానికి సాహిత్యంలో వచన మయినా కవిత్వమయినా మాటల్ని ఆధారం చేసుకుని వ్యక్తీకరించబడతాయి.  అంతే కాదు గొప్ప గొప్ప రచనల్లో మాటల మధ్య అంతర్ లయగా భావాలు వుంటాయి. అయితే  సినిమా దర్శకుడు భావుకుడు అయినప్పుడు  జీవితాన్ని నేరుగా పరిశీలించడం ద్వారా తన సినిమాని రూపు దిద్దుతాడు. ప్రతి కళకి తన దయిన కవితాత్మక భావం వుంటుంది. సినిమా దానికి మినహాయింపేమీ కాదు అన్న ఆండ్రీ టా ర్కోవిస్కీ తన సినిమాల్లో ప్రతి ఇమేజ్ ని కవితాత్మకంగా చిత్రీకరించాడు. తనదయిన ఒక వొరవడిని రూపొందించాడు.

మన కాలానికి సంభందించి ప్రపంచంలో అత్యంత ముఖ్యమయిన దర్శకుల్లో ఎన్నదగిన వాడు ఆండ్రీ టా ర్కోవిస్కీ. ఆయన నిర్మించిన ‘ఇవాన్ ది చైల్డ్ హుడ్’ 1962 లో వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అత్యుత్తమ చిత్రంగా గోల్డెన్ లయన్ అవార్డ్ ను అందుకున్నప్పటి నుంచి ప్రపంచం ఆయన సినిమాల పైన దృష్టి పెట్టింది.  కళాత్మకంగాను
మౌళికమయిన భావాలతోనూ నిండిన ఆయన సినిమాలు అనేక చర్చల్ని లేవదీశాయి. ప్రేక్షకుల ఆలోచనల్ని మనసుల్ని వెంటాడే దృశ్యాలతో ఆండ్రీ టా ర్కోవిస్కీ తనదయిన శైలిని ఏర్పరుచుకున్నాడు. 

ఆయన సినిమాల్లో "ఆండ్రీ రుబ్లెవ్", "స్టాకర్" , 'సోలారిస్', 'మిర్రర్', ' నాస్తాల్జియా' లు ప్రపంచ ప్రేక్షకుల పైన చెరగని ముద్రవేశాయి.  కళలని ముఖ్యంగా కవిత్వాన్ని సినిమాతో పోల్చి విశ్లేషించిన ఆండ్రీ టా ర్కోవిస్కీ తన సినిమాల్లో దృశ్య లయ ని సాధించడంలో అనితర సాధ్యమయిన విజయం సాధించాడు. 

‘సినిమా యొక్క మౌలికాంశం పరిశీలన అయితే కవిత్వానిది అనుభూతి’ అన్న ఆండ్రీ టార్కోవిస్కీ ఈ పుస్తకం నిండా ఆయన సినిమాల స్టిల్ల్స్ తో పాటు ఆయన తండ్రి ఆర్సెని టా ర్కోవిస్కీ కవితల్ని ప్రచురించి పుస్తకానికి ప్రభావవంత మయిన శక్తిని జత చేశాడు.

ఈ " స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్ " ( Sculpting in Time ) కళ దాని ఆదర్శం, కాలం, సినిమా యొక్క నిర్ధారిత పాత్ర, ఫిలిమ్ ఇమేజ్, టైమ్, రిధం తదితర అంశాలతో పాటు కవిత్వము భావన వ్యక్తీకరణ లాంటి అనేక విషయాల్ని చర్చించింది.  మంచి కవిత్వమూ మంచి సినిమా రెండు వేరు వేరు కాదని రెంటి మధ్య వ్యక్తీకరణకు సంబందించి పోలిక ప్రేరణ వున్నాయని కవితాత్మకంగా చెప్పిన " స్కల్ప్ టింగ్ ఇన్ టైమ్ " ( Sculpting in Time ) నా పైన అమితంగా ప్రభావితం చూపిన పుస్తకంగా మిగిలి పోయింది.
 
 

click me!