రచయితలు పెద్దింటి అశోక్ కుమార్, నక్షత్రం వేణుగోపాల్ కథా సంపుటిలు 'జాల', 'మౌనసాక్షి' కన్నడ బాషలో అనువాదమయ్యాయి.
బెంగుళూరు: ప్రముఖ తెలుగు కథా రచయితలు పెద్దింటి అశోక్ కుమార్, నక్షత్రం వేణుగోపాల్ రాసిన కథల సంపుటాలు కన్నడ భాషలో అనువాదమై నిన్న ఇక్కడ విడుదలయ్యాయి. పెద్దింటి అశోక్ కుమార్ కథా సంపుటి 'జాల', వేణు నక్షత్రం కథా సంపుటి 'మౌనసాక్షి' పుస్తకాలను కన్నడ అనువాదకురాలు, రచయిత్రి ఎంజీ శుభమంగళ కన్నడలోకి అనువదించారు. బెంగుళూరులోని రవీంద్ర కళాక్షేత్ర - నయన ఆడిటోరియంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు డాక్టర్ ఆర్.పూర్ణిమ చాహా రఘునాథ్, డాక్టర్ జి.రామకృష్ణ చేతుల మీదుగా పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దింటి అశోక్ కుమార్, ప్రవీణ్ దొడ్డ, మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రచయితలు పెద్దింటి అశోక్ కుమార్, వేణు నక్షత్రంలను పలువురు అభినందించి ప్రశంసల వర్షం కురిపించారు. వారి రచనలు పలు భారతీయ భాషల్లోకి అనువాదమవ్వాలని తద్వారా తెలుగు ప్రజల సంస్కృతి, సాహిత్యం దేశ ప్రజలందరికి చేరువ కావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. వంశీ పబ్లికేషన్స్ వారి ఈ కథల సంపుటాలు బుక్ బ్రహ్మ డాట్ కాం bookbrahma.com/book/mounasakshi ద్వారా లభిస్తున్నాయి.