అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం " GREATEST POETRY EVER WRITTEN " అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే కవిత్వానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప కవులుగా ఎంచబడ్డ 24 విశిష్ట కవుల రచనల్లోంచి ఎంపిక చేసిన కవితలతో కూడిన ‘గ్రేటెస్ట్ పోయెట్రీ ఎవర్ రిటెన్’ (GREATEST POETRY EVER WRITTEN) అందుకున్నాను. మా అమ్మాయి రేల, అల్లుడు వేణుమాధవ్ లు తమ మూడేళ్ళ కొడుకు ప్రద్యుమ్న కోసం హైదరాబాద్ లో ఏర్పాటయిన చిన్నపిల్లల పుస్తకాల ప్రదర్శనకు వెళ్ళారు. చిత్రంగా అక్కడ ఈ పుస్తకం దొరికితే నాకోసమని తెచ్చారు. పుస్తకం చూడగానే ఆశ్చర్యం వేసింది. ఇంతమంది గొప్ప కవుల కవిత్వాన్ని ఒకే చోట చూడ్డం ఆనందమే కదా.
థాంక్స్ చెప్పి చదవడం మొదలు పెట్టాను.
......
ఈ గ్రహం మీద తిరగాడిన పలువురు గొప్ప కవులు, కవయిత్రులు లిఖించిన గొప్ప మాటల్ని ఒక చోట చేర్చే ప్రయత్నమీ సంకలనం.. అన్నారు ప్రకాశకులు.
“ ఏదయినా ఒక భావోద్వేగం ఒక భావాన్ని అందుకుని, ఆ భావం మాటలని సంతరించుకున్నప్పుడు రూపొందేదే కవిత్వం’ అంటారు రాబర్ట్ ఫ్రాస్ట్. అలాంటి భావోద్వేగాలతో కూడుకున్న మహామహుల కవిత్వంతో నిండిన పుస్తకమిది. అయితే గొప్పవాళ్ళ కవిత్వమని చెప్పగలను కానీ వారు రాసిన గొప్ప కవిత్వం ఇదే అనిచేప్పలేను. పుస్తకంలో కూడా ఆ మాట చెప్పలేదు. కానీ ఇంద్రధనుస్సును చూసినట్టు ఆనందం మాత్రం మిగులుతుందీ పుస్తకం చూసింతర్వాత.
ఇక కవిత్వమంటే కేవలం మాటలతో కూడుకున్నదనే, లిఖిన్చినదే అన్న భావం సర్వత్రా నెలకొని వున్న ప్రస్తుత కాలంలో Plutarch “ Painting is silent poetry, poetry is painting that speaks” ( నిశ్శబ్ద కవిత్వమే పెయింటింగ్, మాట్లాడే పెయింటింగే కవిత్వం) అంటారు. నిజానికి మంచి కవిత్వం మన జీవితాలకు అర్థాన్నిస్తుంది. మన చుట్టూ వున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కవిత్వం మనలో చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. అందుకు కవిత్వ అధ్యయనం, అవగాహన, ఆరాధనలు మాత్రమే దారి చూపుతాయి.
“All the world’s stage” అన్న Shakespeare కవిత తో మొదలయిందీ సంకలనం. ఆయనంటారు -
All the world’s stage
And all the men and women merely players
They have their exits and entrances; ..
అంటూ సాగుతుందీ కవిత. Shakespeare తన నాటకాలకూ సానేట్స్ కీ ఎంత పాపులరో మనకు తెలసు. జీవితాల్ని వడపోసి రాసిన రచనలవి.
అట్లే ఎప్పుడో దశాబ్దాల క్రితం స్కూల్లో మనం చదువుకున్న రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత -
“STOPPING BY WOODS ON A SNOWY EVENING” ఎన్నో జ్ఞాపకాలను తిరగదోడింది. అప్పటి నుంచి ఎప్పటికీ గుర్తుండే మాటలు..
‘ The woods are lovely, dark and deep
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep,
ఇట్లా ఒకరేమిటి అల్లెన్ పొ, ఇ ఇ కాన్నిన్గ్స్, థామస్ హార్డీ, రుడ్యార్డ్ కిప్లింగ్, ఆస్కార్ వైల్డ్, వర్డ్స్ వర్త్ , మార్క్ ట్వైన్, ఈలియట్, డికెన్ సన్, కీట్స్, బైరన్,ఈట్స్ లాంటి ఎంతో మంది కవిత్వం వుందీ పుస్తకంలో. ఈ ఇక మన వాళ్ళు టాగోర్, సరోజినీ నాయుడు, అరబిందో ఘోష్ తదితరులు కూడా ఉన్నారీ సంకలనంలో.
అంతేనా ‘ఇట్ ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈజ్ మాడ్నెస్’ అన్న మీర్జా గాలిబ్ కవిత్వం కూడా వుంది. అంతే కాదు ‘ఇంకా ఈ ప్రపంచమొక ఆట స్థలం’ అని కూడా అన్నారు గాలిబ్. ఇంకా ‘ఐ ఆం విండ్, యు ఆర్ ఫైర్’ అంటూ రూమీ కూడా ఈ సంకలనాన్ని అలంకరించాడు. మొత్తం మీద తప్పకుండా చదవాల్సిన పుస్తకం అనిపించింది. అంతేకాదు మళ్ళీ మళ్ళీ చదవాల్సిన కవులు వీళ్ళంతా అని కూడా అనిపించింది. అందరినీ అందరూ రాసిన కవిత్వాన్నంతా చదవడానికి మన జీవిత కాలం సరిపోక పోవచ్చు, కానీ అందినకాడికి చదవడం మేలే కదా. అందుకే Grapevine వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ పుస్తకం మంచి ప్రయత్నమనిపించింది.